అధికారం ఇవ్వండి.. పౌరసత్వం ఇస్తాం
గువాహటి: రానున్న ఎన్నికల్లో అసోంలో బీజేపీ అధికారంలోకి వస్తే బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన హిందువులకు భారతీయ పౌరసత్వం ఇస్తామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. గత కొంత కాలంగా మత పరమైన సమస్యల కారణంగా చాలామంది హిందువులు బంగ్లాదేశ్ నుంచి వస్తున్నారని వారందరిని బీజేపీ ఆదరిస్తుందని చెప్పారు. ఒక్కసారి తమ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ఆ చర్యల వేగవంతం చేస్తామని తెలిపారు.అంతే కాకుండా, ఒక్క అసోంలోని బంగ్లా హిందువులకే కాకుండ దేశ వ్యాప్తంగా వలస వచ్చిన హిందువులకు భారత పౌరసత్వం ఇస్తామని చెప్పారు.
తమ ఆలోచనలో ఏమాత్రం తప్పు లేదని, వారు కూడా అసోంతోపాటు ఉత్తర భారత అభివృద్ధికి పాటుపడుతున్నవారైనందున వారి తరుపున ఈ విషయంపై పోరాడి పౌరసత్వం ఇస్తామని చెప్పారు. గతంలో ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వాలకు డబ్బులు చెల్లించామని, కానీ అవి మాత్రం ఓట్లను ఆశించి అలాంటి చర్యలకు దిగడం లేదని అన్నారు.