కేంద్ర మంత్రికి ట్వీట్.. మహిళా ప్యాసింజర్ సేఫ్
భువనేశ్వర్: సోషల్ మీడియాను మనం వాడుకునే తీరును బట్టి అది మనకు అనుకూల, ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. ఓ మహిళా ప్రయాణికులరాలికి మాత్రం సోషల్ మీడియా పోస్ట్ ఎంతో మేలు చేసింది. ఎలా అంటారా.. న్యూఢిల్లీకి చెందిన ఓ మహిళా ప్రయాణికురాలు రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలులో గురువారం ప్రయాణిస్తోంది. ఆ రైల్లోనే ఆమె ఉన్న కంపార్ట్మెంట్లో యాభైఏళ్ల ప్రయాణికుడు బని ప్రసాద్ మహంతి ప్రయాణిస్తున్నాడు. ఆ మహిళతో బని ప్రసాద్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. ఎంత చెప్పినా వినకుండా వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ విషయంపై ఆమె ఫేస్బుక్లో పోస్ట్ చేసింది.
తన ఫ్రెండ్ పోస్ట్ చూసిన ఓ బాధిత మహిళ స్నేహితురాలు విషయాన్ని రైల్వే మంత్రి సురేశ్ ప్రభు దృష్టికి తీసుకెళ్లింది. తన స్నేహితురాలికి సాయం చేయాలని రైల్వే మంత్రికి ట్వీట్ చేసింది. వెంటనే స్పందించిన సురేశ్ ప్రభు రైల్వే అధికారులకు సమాచారం అందించారు. నిందితుడు బని ప్రసాద్‌ను టీటీఈలు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది టాటానగర్ స్టేషన్లో అదుపులోకి తీసుకుని రైలు నుంచి దించేశారు. టాటానగర్ రైల్వే పోలీసులకు నిందితుడిని అప్పగించారు. వారు కేసు నమోదుచేసుకుని విచారణ చేపట్టారు. నిందితుడు బని ప్రసాద్ ఒడిషాలోని ఖుర్దాకు చెందినవాడని రైల్వే పోలీసులు వివరించారు.