Bank Linkages Loans
-
ఇదిగోనమ్మా.. రుణం తీసుకో..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ పథకం కింద ఇచ్చే రుణాల మంజూరు లక్ష్యాన్ని ప్రభుత్వం భారీగా పెంచింది. గత ఆర్థిక సంవత్సరం కంటే ఈసారి సుమారు 32 శాతం అధిక మొత్తంలో రుణాలివ్వాలని నిర్ణయించింది. నిర్దేశించిన లక్ష్యం భారీగా ఉండటంతో మహిళా సంఘాలకు రుణాలిప్పించేందుకు క్షేత్రస్థాయిలోని ఐకేపీ సిబ్బంది తంటాలు పడుతున్నారు. ‘రుణం తీసుకోండమ్మా..’ అంటూ స్వయం సహాయక సంఘాల చుట్టూ తిరుగుతున్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు ప్రభుత్వం బ్యాంకుల ద్వారా ఎస్‌హెచ్‌జీ మహిళలకు రుణాలు మంజూరు చేస్తోంది. సీసీఎల్ లోన్లు, టర్మ్ లోన్లు ఇలా రెండు రకాల రుణాలను బ్యాంకుల ద్వారా ఇప్పిస్తారు. ఆయా సంఘాలు ప్రతినెలా పొదుపు చేసుకుని.. తీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లించిన సంఘాలకు వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. దీని ద్వారా మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించవచ్చనేది ప్రభుత్వ ఉద్దేశం. ఒక్కో సభ్యురాలికి రూ.లక్ష వరకు రుణం రుణ మంజూరు లక్ష్యం భారీగా పెరగడంతో ఒక్కో సభ్యురాలికి సుమారు లక్ష రూపాయల వరకు రుణం మంజూరవుతోంది. గతంలో రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు అంతకు రెట్టింపు పెంచారు. దీంతో మహిళలు ఉత్సాహంగా రుణాలు తీసుకుంటున్నా.. తిరిగి చెల్లింపు విషయంలో ఒకింత ఆందోళన చెందుతున్నారు. పెద్ద మొత్తంలో రుణం తీసుకుని చెల్లించకపోతే, రానున్న రోజుల్లో రుణానికి అర్హత కోల్పోతామని భావిస్తున్నారు. రుణాల ఊబిలో కూరుకుపోతే ఇబ్బందిపడాల్సి వస్తుందని కలవరం చెందుతున్నారు. టంచనుగా రీపేమెంట్ స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇచ్చే రుణాలు టంచనుగా వసూలవుతున్నాయి. రికవరీ రేటు 98 శాతం వరకు ఉండటంతో బ్యాంకర్లు పెద్దగా తిరకాసు పెట్టకుండానే రుణాలిచ్చేస్తున్నారు. ఏదైనా కారణంతో సంఘంలోని ఒక మహిళ తన రుణాన్ని తిరిగి చెల్లించకుంటే సంఘంలోని మిగితా సభ్యులే చెల్లించి, ఆ మొత్తాన్ని తర్వాత వసూలు చేసుకుంటున్నారు. దీంతో రుణాలపై రీపేమెంట్ ఇబ్బందులు లేకుండా పోయాయి. కరోనా కష్టాల నుంచి గట్టెక్కించేందుకు.. కరోనా మహమ్మారి ప్రభావం అన్ని రంగాలపై పడింది. లాక్‌డౌన్‌తో పలువురు ఉపాధి కోల్పోయారు. ఇలాంటి తరుణంలో మహిళల కొనుగోలు శక్తిని పెంచేందుకు రుణ మంజూరు లక్ష్యాన్ని ప్రభుత్వం పెంచిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మహిళల పాత్ర కీలకం కావడంతో వారికి విరివిగా రుణాలివ్వడం ద్వారా గ్రామీణార్థిక వ్యవస్థ గాడిన పడుతుందంటున్నారు. -
బ్యాంకు లింకేజీలో ముందంజ
ఇందూరు(నిజామాబాద్ అర్బన్): పేదింటి మహిళలు ఆర్థిక పురోగతి సాధించడానికి బ్యాంకు లింకేజీ రుణాలిచ్చి ప్రోత్సహించడంలో మన జిల్లా రాష్ట్రంలోనే మూడవ స్థానంలో నిలిచింది. గత నవంబర్ వరకు ఇవ్వాల్సిన రుణాలకంటే 40 శాతం ఎక్కువ రుణాలివ్వగా, ఇంకా మిగిలి ఉన్న రూ.100 కోట్ల రుణాలను ఆర్థిక సంవత్సరానికి మునుపే పూర్తి చేసి ముందు వరుసలో నిలిచేందుకు జిల్లా ఐకేపీ శాఖ కసరత్తు చేస్తోంది. దీంతో ప్రభుత్వం అందిస్తున్న బ్యాంకు లింకేజీ రుణాలు ఈ ఏడాది లక్ష్యాన్ని దాటేలా ఉన్నాయి. 2018–19 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాకు రూ.338 కోట్ల 19 లక్షల రుణాలను, 16,901 మహిళా సంఘాలకు ఇవ్వాలని సెర్ప్ రాష్ట్ర శాఖ అధికారులు లక్ష్యంగా నిర్ణయించారు. ఇందులో నెల వారీగా లక్ష్యాలను కూడా కేటాయించారు. అయి తే గత నవంబర్ వరకు జిల్లాలో 7,500 సంఘాలకు రూ.149 కోట్ల 19 లక్షల రుణాలు అందించాలని లక్ష్యం ఉండగా, ఇప్పటి వరకు 5,869 సంఘాలకు గాను రూ. 230 కోట్లకు పైగా రుణాలందించి జిల్లా రాష్ట్రంలో మూడవ స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో కరీంనగర్ జిల్లా ఉండగా, రెండవ స్థానంలో సంగారెడ్డి జిల్లా ఉంది. మొదటి స్థానంలో నిలిచేందుకు రెండడుగుల దూరంలో నిలిచిన జిల్లా ఐకేపీ అధికారులు, మిగతా రూ.100 కోట్ల రుణాల లక్ష్యాన్ని నెల రోజుల్లో పూర్తి చేసి రాష్ట్రంలో మొదటి స్థానం, లేదా రెండవ స్థానంలో నిలిచేందుకు కసరత్తు చేస్తున్నారు. కొన్ని మండలాలు ముందు.. మరికొన్ని వెనుక మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉన్న పేద మహిళలు ఆర్థికంగా పురోగతి సాధించడానికి బ్యాంకు లింకేజీ రుణాలు ఎంతగానో దోహదపడుతున్నాయి. అయి తే జిల్లాలో కొన్ని మండలాలు లక్ష్యానికి మించి రుణాలు అందజేయగా, మరికొన్ని మండలాలు లక్ష్యానికి దూరంగా ఉన్నాయి. ఇప్పటికే ముప్కాల్, ఆర్మూర్, మోర్తాడ్, వేల్పూర్, బోధన్ మండలాలు నూరు శాతం లక్ష్యాన్ని దాటి రుణాలు అందజేశాయి. అధిక రుణాలు అందించడంలో ముప్కాల్ మండలం ముందు వరుసలో ఉంది. ఇక్కడ ఇప్పటి వరకు 124 సంఘాలకు గాను రూ.44 కోట్లకు పైగా రుణాలిచ్చారు. అదే విధంగా నందిపేట్, మాక్లూర్, మెండోరా, ఎడపల్లి, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, జక్రాన్‌పల్లి, రుద్రూర్ మండలాలు లక్ష్యానికి దగ్గరగా ఉన్నాయి. కోటగిరి, వర్ని, కమ్మర్పల్లి, ధర్పల్లి, నవీపేట్, సిరికొండ, ఏర్గట్ల, డిచ్పల్లి, భీమ్‌గల్ మోపాల్, రెంజల్, ఇందల్వాయి మండలాలు వెనుకబడి ఉన్నాయి. పూర్తిగా వెనుకబడిన మండలంగా ఇందల్వాయి ఉంది. ఈ గణాంకాల పరిస్థితిని చూస్తే లక్ష్యాన్ని మించిన మండలాలే అదనపు లక్ష్యాన్ని కూడా పూర్తి చేస్తున్నాయి. చేయని మండలాలు చేయనట్లుగానే ఉంటున్నాయి. -
‘మహిళ’లకు మొండి చేయి!
- బ్యాంకు లింకేజీ రుణాలకు వడ్డీ భారం - అమలు కాని వడ్డీ లేని రుణాల పథకం - జిల్లాలోని మహిళా సంఘాలకు - బకాయి రూ. 46.40 కోట్లు మోర్తాడ్ : మహిళా సంఘాలకు అండగా ఉంటామన్న ప్రభుత్వ హామీలు అమలుకు నోచుకోవడం లేదు. వడ్డీ లేని రుణం పథకం ఎక్కడా కానరావడం లేదు. దీంతో మహిళలు తాము తీసుకున్న బ్యాంకు లింకేజీ రుణాలకు వడ్డీ భారాన్ని మోయూల్సివస్తోంది. బ్యాంకు లింకేజీ రుణాలకు సంబంధించి ప్రతి నెలా కిస్తులు సక్రమంగా చెల్లించే మహిళా సంఘాలకు.. వారు చెల్లించిన వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వం రీరుుంబర్స్‌మెంట్ రూపంలో ఖాతాల్లో జమ చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం జూన్ 2014లో ఏర్పాటు అయినా ఏప్రిల్ 2014 నుంచి ఉన్న వడ్డీ బకాయిలను పూర్తిగా చెల్లిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ కూడా గతంలో ప్రకటించారు. గత డిసెంబర్ నాటికి జిల్లాలోని మహిళా సంఘాల ఖాతాల్లో రూ. 46.40 కోట్లు వడ్డీ సొమ్ము జమ కావాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు ప్రభుత్వం నయాపైసా వడ్డీని వాపసు చేయలేక పోయింది. దీంతో మహిళలు తమ బ్యాంకు లింకేజీ రుణాలకు వడ్డీ భారాన్ని యధాతథంగా మోస్తున్నారు. జిల్లాలో 39,473 మహిళా సంఘాలున్నాయి. ఈ సంఘాల్లో 4,24,574 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. బ్యాంకు లింకేజీ రుణాల కిస్తులను సక్రమంగా చెల్లించి వడ్డీ మాఫీ కోసం అర్హత పొందిన సంఘాలు జిల్లాలో 33,742 ఉన్నాయి. మహిళా సంఘాలు వడ్డీ మాఫీకి అర్హతను సంపాదించుకోవడం కోసం ప్రతి నెలా క్రమం తప్పకుండా రుణాల కిస్తులను వడ్డీతో సహా బ్యాంకులకు చెల్లించారుు. వడ్డీ మాఫీకి అర్హత పొందిన సంఘాల వివరాలను ఇందిర క్రాంతి పథం అధికారులు ఎప్పటికప్పుడు సెర్ప్ ఉన్నతాధికారులకు చేరవేశారు. నివేదికల ఆధారంగా ప్రభుత్వం వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ను చెల్లించాల్సి ఉంది. 2014 ఏప్రిల్ నుంచి వడ్డీ మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం వద్ద లెక్కలు సిద్ధంగా ఉన్నా నిధులు కేటాయించడంలో తాత్సారం జరుగుతోంది. బ్యాంకు లింకేజీ రుణాలు పొందిన మహిళా సంఘాల సభ్యులు ఎక్కువ మంది ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల వారే. తమ కుటుంబ అవసరాలు, పిల్లల చదువులు, పెళ్లిళ్లు ఇతర అవసరాల కోసం బ్యాంకు లింకేజీ రుణాలను పొందారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వడ్డీ మాఫీకి సంబంధించిన రీరుుంబర్స్‌మెంట్‌ను చెల్లించాలని మహిళా సంఘాల సభ్యులు కోరుతున్నారు.