ఇందూరు(నిజామాబాద్ అర్బన్): పేదింటి మహిళలు ఆర్థిక పురోగతి సాధించడానికి బ్యాంకు లింకేజీ రుణాలిచ్చి ప్రోత్సహించడంలో మన జిల్లా రాష్ట్రంలోనే మూడవ స్థానంలో నిలిచింది. గత నవంబర్ వరకు ఇవ్వాల్సిన రుణాలకంటే 40 శాతం ఎక్కువ రుణాలివ్వగా, ఇంకా మిగిలి ఉన్న రూ.100 కోట్ల రుణాలను ఆర్థిక సంవత్సరానికి మునుపే పూర్తి చేసి ముందు వరుసలో నిలిచేందుకు జిల్లా ఐకేపీ శాఖ కసరత్తు చేస్తోంది. దీంతో ప్రభుత్వం అందిస్తున్న బ్యాంకు లింకేజీ రుణాలు ఈ ఏడాది లక్ష్యాన్ని దాటేలా ఉన్నాయి. 2018–19 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాకు రూ.338 కోట్ల 19 లక్షల రుణాలను, 16,901 మహిళా సంఘాలకు ఇవ్వాలని సెర్ప్ రాష్ట్ర శాఖ అధికారులు లక్ష్యంగా నిర్ణయించారు.
ఇందులో నెల వారీగా లక్ష్యాలను కూడా కేటాయించారు. అయి తే గత నవంబర్ వరకు జిల్లాలో 7,500 సంఘాలకు రూ.149 కోట్ల 19 లక్షల రుణాలు అందించాలని లక్ష్యం ఉండగా, ఇప్పటి వరకు 5,869 సంఘాలకు గాను రూ. 230 కోట్లకు పైగా రుణాలందించి జిల్లా రాష్ట్రంలో మూడవ స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో కరీంనగర్ జిల్లా ఉండగా, రెండవ స్థానంలో సంగారెడ్డి జిల్లా ఉంది. మొదటి స్థానంలో నిలిచేందుకు రెండడుగుల దూరంలో నిలిచిన జిల్లా ఐకేపీ అధికారులు, మిగతా రూ.100 కోట్ల రుణాల లక్ష్యాన్ని నెల రోజుల్లో పూర్తి చేసి రాష్ట్రంలో మొదటి స్థానం, లేదా రెండవ స్థానంలో నిలిచేందుకు కసరత్తు చేస్తున్నారు.
కొన్ని మండలాలు ముందు.. మరికొన్ని వెనుక
మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉన్న పేద మహిళలు ఆర్థికంగా పురోగతి సాధించడానికి బ్యాంకు లింకేజీ రుణాలు ఎంతగానో దోహదపడుతున్నాయి. అయి తే జిల్లాలో కొన్ని మండలాలు లక్ష్యానికి మించి రుణాలు అందజేయగా, మరికొన్ని మండలాలు లక్ష్యానికి దూరంగా ఉన్నాయి. ఇప్పటికే ముప్కాల్, ఆర్మూర్, మోర్తాడ్, వేల్పూర్, బోధన్ మండలాలు నూరు శాతం లక్ష్యాన్ని దాటి రుణాలు అందజేశాయి. అధిక రుణాలు అందించడంలో ముప్కాల్ మండలం ముందు వరుసలో ఉంది.
ఇక్కడ ఇప్పటి వరకు 124 సంఘాలకు గాను రూ.44 కోట్లకు పైగా రుణాలిచ్చారు. అదే విధంగా నందిపేట్, మాక్లూర్, మెండోరా, ఎడపల్లి, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, జక్రాన్‌పల్లి, రుద్రూర్ మండలాలు లక్ష్యానికి దగ్గరగా ఉన్నాయి. కోటగిరి, వర్ని, కమ్మర్‌పల్లి, ధర్పల్లి, నవీపేట్, సిరికొండ, ఏర్గట్ల, డిచ్‌పల్లి, భీమ్‌గల్ మోపాల్, రెంజల్, ఇందల్వాయి మండలాలు వెనుకబడి ఉన్నాయి. పూర్తిగా వెనుకబడిన మండలంగా ఇందల్వాయి ఉంది. ఈ గణాంకాల పరిస్థితిని చూస్తే లక్ష్యాన్ని మించిన మండలాలే అదనపు లక్ష్యాన్ని కూడా పూర్తి చేస్తున్నాయి. చేయని మండలాలు చేయనట్లుగానే ఉంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment