నకిలీ పాసుపుస్తకాలతో ఘరానా మోసం
బ్యాంకర్లను బురిడి కొట్టించి రూ. 19 లక్షల రుణాలు పొందిన ముఠా
బ్యాంకు మేనేజర్ ఫిర్యాదుతో కదిలిన డొంక
కేసును ఛేదించిన పోలీసులు వివరాలు వెల్లడించిన కోవెలకుంట్ల
ఇన్చార్జ్ సీఐ ప్రభాకర్‌రెడ్డి
కోవెలకుంట్ల : నకిలీపాసుపుస్తకాలు సృష్టించి బ్యాంకర్లను బురిడి కొట్టించి రూ. 19 లక్షలు రుణాలు పొందిన ముఠా కటకటాలపాలైంది. స్థానిక సర్కిల్ కార్యాలయంలో బుధవారం కోవెలకుంట్ల ఇన్చార్జ్ సీఐ ప్రభాకర్‌రెడ్డి వెల్లడించిన వివరాల మేరకు... కర్నాటక రాష్ర్టంలో పావుగడలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మాదిగబాబు, సంజామల మండలం పేరుసోమలకు చెందిన శీలమ్మ, గిద్దలూరుకు చెందిన కాంతారావు, బనగానపల్లెకు చెందిన తప్పెట శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు అలియస్ లాయర్ జేమ్స్, ప్రసాదు, తప్పెట రాముడు ముఠాగా ఏర్పడి అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలనుకున్నారు.
అందులో భాగంగా పేరుసోమల గ్రామం వద్ద ప్రిజం సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటవుతోందని, దానికోసం భూములు కొంటారని, ఒక్కో ఎకరాకు రూ. 2 లక్షలు న ష్టపరిహారం వస్తుందని వారి బంధువులు, తెలిసిన వాళ్ల పేరుమీద 2009వ సంవత్సరంలో అప్పటి వీఆర్ఓ ప్రసాదు, తహశీల్దార్ రాంప్రసాద్, ఆర్డీఓల సీళ్లు తయారు చేసి పోర్జరీ సంతకాలతో 38 నకిలీ పాసుపుస్తకాలు తయారు చేశారు. ఇందుకు గాను ఒక్కోకరి వద్ద నుంచి రూ. 5 వేలు వసూలు చేసి వారికి నకిలీ పాసుపుస్తకాలు అందించారు.
ప్రిజం సిమెంట్ ఫ్యాక్టరీ రాకపోవడంతో కొన్ని రోజుల తర్వాత పాసుపుస్తకాలు పొందిన వ్యక్తులు తమ భూములు ఎక్కుడున్నాయో చూపాలంటూ పుస్తకాలు ఇచ్చిన వారికి నిలదీశారు. ఫ్యాక్టరీ వచ్చేందుకు ఆలస్యమవుతుందని, ఆ పుస్తకాలతో పేరుసోమల ఆంధ్రబ్యాంకులో రుణాలు ఇప్పిస్తామని వారిని ముఠాసభ్యులు నమ్మబలికించి అప్పటి బ్యాంకు మేనేజర్ శివనాయక్, ఫీల్డ్ ఆఫీసర్ నరసింహారెడ్డిని కలిశారు.
ఒక్కో రుణానికి బ్యాంకు మేనేజర్‌కు రూ. 5వేలు, ఫీల్డ్ఆఫీసర్కు రూ. 2వేలు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆప్రకారం ఒక్కో రుణానికి రూ. ఏడు వేలు వారికి ఇచ్చి 38 పాసుపుస్తకాలపై రూ. 19 లక్షలు రుణం పొందారు. ఏడువేలు పోనూ ముఠా సభ్యులు రుణం ఇప్పించినందుకు ఒక్కో పుస్తకాదారుడి వద్ద నుంచి రూ. 10 వేలు వసూలు చేశారు. కొంతకాలానికి బ్యాంకు మేనేజర్, ఫీల్డ్ ఆఫీసర్ బదిలీ కావడం వారి స్థానంలో వేణుగోపాల్ బ్యాంకు మేనేజర్‌గా వచ్చారు.
ఆయన రుణాలకు సంబంధించిన రికార్డులు పరిశీలించగా 38 మంది తీసుకున్న రుణాలు కట్టలేదని తేలడంతో అనుమానం వచ్చి తహశీల్దార్ కార్యాలయంలో పాసుపుస్తకాల సర్వేనంబర్లను పరిశీలించారు. ఆ సర్వేనంబర్లకు సంబంధించి ఎలాంటి పొలంలేదని, నకిలీ పాసుపుస్తకాలని బయటపడటంతో 2015వ సంవత్సరంలో సంజామల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో 38 మందిపై కేసులు నమోదు చేసి రంగంలోకి దిగిన పోలీసులు సంజామల ఎస్ఐ విజయభాస్కర్ నేతృత్వంలో గుట్టు రట్టు చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న మాదిగబాబు, శీలమ్మ, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, ప్రసాదు, రాముడులను అరెస్టు చేసి కోవెలకుంట్ల కోర్టులో హాజరు పరుచగా మేజిస్ట్రేట్ రిమాండ్‌కు ఆదేశించినట్లు సీఐ పేర్కొన్నారు.