'వైశ్రాయ్' ఎండీ ఇంటి ముందు ధర్నా
హైదరాబాద్: బడాబాబుల నుంచి రుణాలు వసూలు చేసుకునేందుకు బ్యాంకులు నానాకష్టాలు పడుతున్నాయి. మొండి బకాయిలు రాబట్టుకునేందుకు బ్యాంకు ఉద్యోగులు రోడ్డెక్కుతున్నారు. వైశ్రాయ్ హోటల్ ఎండీ ప్రభాకర్ రెడ్డి ఇంటి ముందు ఓరియంటల్ బ్యాంకు సిబ్బంది మంగళవారం ధర్నాకు దిగారు. రుణాలు చెల్లించాలంటూ ప్లకార్డుల ప్రదర్శించారు. అప్పుగా తీసుకున్న కోట్లాది రూపాయలు తిరిగి చెల్లించకపోవడంతో రోడ్డెక్కాల్సి వచ్చిందని బ్యాంకు సిబ్బంది వాపోయారు.
కాగా, తమ బ్యాంకు నుంచి రుణాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎంపీ కావూరి సాంబ శివరావు ఇంటిముందు పంజాబ్ నేషనల్ బ్యాంకు ఉద్యోగులు శనివారం నిరసన వ్యక్తం చేశారు. ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ కంపెనీ పేరిట కావూరి రూ.160 కోట్ల రుణాలు తీసుకున్నారని బ్యాంకు సిబ్బంది చెప్పారు.