విజయ్ మాల్యాకు భారీ ఊరట
లండన్ : లిక్కర్ కింగ్, ఆర్థిక నేరగాడు విజయ్ మాల్యాకు భారీ ఉపశమనం లభించింది. మాల్యాను దివాలాదారుడిగా ప్రకటించాలంటూ భారత బ్యాంకుల కన్సార్షియం దాఖలు చేసిన పిటిషన్ను లండన్ కోర్టు తోసి పుచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని భారత ప్రభుత్వ రంగ బ్యాంకుల కన్సార్టియం పిటిషన్ పై విచారణను కోర్టు వాయిదా వేసింది.
114.5 కోట్ల పౌండ్ల రుణాలు విజయ్ మాల్యా ఎగ్గొట్టాడని, బకాయిల వసూలు నిమిత్తం మాల్యాను దివాలాకోరుగా ప్రకటించాలని ఎస్బీఐ సారధ్యంలోని భారత బ్యాంకుల కన్సార్షియం అభ్యర్థించింది. దీన్ని విచారించిన జస్టిస్ మైకేల్ బ్రిగ్స్ భారత సుప్రీంకోర్టులో ఉన్న పిటిషన్లతో పాటు, కర్నాటక హైకోర్టులో మాల్యా పెట్టుకున్న చెల్లింపు ప్రతిపాదన తేలేవరకు మాల్యాకు సమయం ఇవ్వాలని తీర్పు చెప్పారు. బ్యాంకు రుణాలు పూర్తిగా చెల్లించే వరకు సమయం ఇవ్వాలంటూ దివాలా ఉత్తర్వులిచ్చేందుకు తిరస్కరించారు. ఈ సమయంలో ఇలాంటి చర్యలు తీసుకోవడం వల్ల బ్యాంకులకు ఎలాంటి ప్రయోజనం ఉండదని జస్టిస్ బ్రిగ్స్ వ్యాఖ్యానించారు. కోవిడ్-19 వ్యాప్తి అనిశ్చితి కారంగా తేదీని నిర్ణయించడం కష్టమని పేర్కొన్న కోర్టు తరువాతి విచారణను జూన్ 1, 2020 నాటికి వాయిదా వేసింది.
కాగా భారతీయ బ్యాంకులకు వేలకోట్ల రూపాయల రుణాలను ఎగవేసి మాల్యా లండన్ కు పారిపోయారు. మోసం, మనీలాండరింగ్ ఆరోపణలపై పలు కేసులు నమోదు చేసిన ఈడీ, సీబీఐ మాల్యాకు సంబంధించిన ఆస్తులను స్వాధీనం చేసుకున్నాయి. అలాగే మాల్యాను భారత్ కు అప్పగించే అంశంపై యుకె హైకోర్టు తీర్పు పెండింగ్లో ఉంది. మరోవైపు అప్పులను వంద శాతం చెల్లిస్తానని అనుమతి ఇవ్వాలంటూ పలుసార్లు బ్యాంకులకు విజ్ఙప్తి చేసిన మాల్యా, కరోనా సంక్షోభంలోనైనా తన అభ్యర్థనను మన్నించాలంటూ ఇటీవల కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ను అభ్యర్థించిన సంగతి తెలిసిందే.
చదవండి: కరోనా సంక్షోభంలోనైనా నా మొర ఆలకించండి
కరోనా : ఆరు నెలల్లో తొలి వ్యాక్సిన్ సిద్ధం
కరోనా : భారత సంతతి వైద్యురాలు కీలక నిర్ణయం
కరోనా : ఎన్పీఎస్ చందాదారులకు ఊరట