విజయ్ మాల్యాకు మరో షాక్!
న్యూఢిల్లీ: వేలకోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగనామం పెట్టి బ్రిటన్‌లో తలదాచుకుంటున్న వ్యాపారవేత్త విజయ్ మాల్యాపై సుప్రీంకోర్టులో కోర్టుధిక్కార పిటిషన్ దాఖలైంది. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా నేతృత్వంలోని బ్యాంకుల కన్నార్టియం గురువారం ఈ పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశించినా లిక్కర్ బ్యారన్ విజయ్ మాల్యా తన ఆస్తుల వివరాలు వెల్లడించకపోవడంతో ఆయనపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని బ్యాంకుల కన్నార్టియం తన పిటిషన్‌లో కోరింది. ఈ నెల 18న సుప్రీంకోర్టు పిటిషన్ పై విచారణ చేపట్టనుంది.
రూ. 9వేల కోట్ల రుణాల ఎగవేత కేసును తప్పించుకునేందుకు రూ. నాలుగువేల కోట్లు బ్యాంకులకు చెల్లిస్తానని మాల్యా ఆఫర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆఫర్ ను బ్యాంకులు తిరస్కరించడంతో గత ఏప్రిల్ లో ఆస్తుల వివరాలు తెలియజేయాలని మాల్యాకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆస్తుల వివరాలు వెల్లడించేందుకు అంగీకరించిన మాల్యా.. ఆ వివరాలను బ్యాంకులకు ఇవ్వవద్దని సుప్రీంకోర్టును అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికీ వివరాలు వెల్లడించకపోవడంతో బ్యాంకుల కన్సార్టియం ఈ పిటిషన్ దాఖలు చేసింది.