అమ్మకాల తాకిడి: నష్టాల్లో మార్కెట్లు
బలహీనమైన అంతర్జాతీయ సంకేతాలతో పాటు బ్యాంకింగ్, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, ఎఫ్ఎమ్సీజీ షేర్లలో నెలకొన్న అమ్మకాల ఒత్తిడితో గురువారం కూడా ఈక్విటీ బెంచ్మార్కులు పడిపోతున్నాయి. సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా నష్టపోతూ 26,104 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ సైతం తన కీలకమార్కు 8050 కిందకి దిగజారి 53.25 పాయింట్ల నష్టంలో 8,008గా ట్రేడ్ అవుతోంది. వరుసగా రాబోతున్న సెలవుల నేపథ్యంలో అటు ఆసియన్ మార్కెట్లూ బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి.
హిందాల్కో టాప్ నిఫ్టీ లూజర్‌గా నష్టాల గడిస్తోంది. ఈ కంపెనీ స్టాక్ 1.45 పడిపోయి రూ.166.35వద్ద నడుస్తోంది. ఇండస్ ఇండ్ బ్యాంకు, ఓఎన్జీసీ, గెయిల్ ఇండియా, బ్యాంకు ఆఫ్ బరోడా, హెచ్డీఎఫ్సీ, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, మారుతీ సుజుకీ, ఏసీసీ, కొటక్ మహింద్రా బ్యాంకులు ప్రారంభంలో నష్టాలు పాలయ్యాయి.
మరోవైపు నోవర్టీస్ నుంచి ఓ బ్రాండెడ్ అంకాలజీ ప్రొడక్ట్ ను కొనుగోలు చేయబోతున్నట్టు ప్రకటించగానే సన్ ఫార్మా షేర్ 1.3 శాతం జంప్ అయి టాప్ నిఫ్టీ గెయినర్‌గా ఉంది. అంతేకాక ఐషర్ మోటార్స్, టాటా మోటార్స్, విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్, అరబిందో ఫార్మాలు కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి. మార్కెట్లు కొనసాగుతున్న ఈ నష్టాలకు మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.43 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.26 శాతం పడిపోయాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ వరుసగా రెండో రోజు కూడా కోలుకుని 8 పైసలు లాభపడి 67.83గా ప్రారంభమైంది.