దారుణం!
సాక్షి, నిజామాబాద్: పంట రుణాల మంజూరులో బ్యాంకర్లు తమ నైజాన్ని కొనసాగిస్తున్నారు. ఖరీఫ్‌లో అంతంత మాత్రం గానే రుణాలిచ్చిన బ్యాంకులు ఈ రబీలోనూ అదే తీరుగా వ్యవహరిస్తున్నాయి. రైతులు పంటలు సాగు చేసుకుని రెండు నెలలు దగ్గర పడుతున్నప్పటికీ బ్యాంకర్లు మాత్రం నిర్దేశిత లక్ష్యంలో కనీసం సగం మందికి కూడా అప్పులివ్వలేదు. అప్పు కోసం చెప్పులరిగేలా తిరగాల్సిన పరి స్థితి రైతన్నలకు ఎదురవుతోంది. ఈ రబీలో జిల్లా వ్యాప్తంగా రూ. 768.40 కోట్ల మేరకు రుణాలివ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు.
కానీ నవంబర్ నెలాఖరు వరకు బ్యాంకులు కేవలం రూ. 312.58 కోట్లు మాత్రమే విది ల్చాయి. ఈ నెలలో కూడా నామమాత్రంగానే రుణ మంజూరు జరిగింది. మొత్తం మీద రబీ నిర్దేశిత లక్ష్యంలో ఇప్పటి వరకు కనీసం 50 శాతం కూడా రుణాలివ్వలేదు. జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం శుక్రవారం స్థానిక ప్రగతిభవన్‌లో జరగనుంది.గతంలో జరిగిన జిల్లా స్థాయి సమావేశాల్లో పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ హెచ్చరించినా బ్యాంకర్ల తీరు మాత్రం మారడం లేదు. ఈసారి కూడా ప్రజాప్రతినిధులు బ్యాంకర్ల తీరుపై మండిపడే అవకాశాలున్నాయి.
కీలక సమయంలో అప్పుపుట్టక..
సాధారణంగా పంటలు విత్తుకునే సమయంలోనే రైతులకు పెట్టుబడులు అవసరపడుతాయి. దుక్కిదున్నుకోవడానికి, విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లు, కూలీల ఖర్చులు ఇలా ఎకరానికి సుమారు రూ.పది వేల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. బ్యాంకర్లు మాత్రం ఈ కీలక సమయంలో అప్పులివ్వకపోవడంతో రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. దీంతో వడ్డీల భారం మీద పడి ఆర్థికసంక్షోభంలో కూరుకుపోతున్నపరిస్థితి ఏర్పడుతోంది. బ్యాంకర్లు మాత్రం రబీ రుణాల మం జూరుకు మార్చి వరకు గడువుందనే సాకుతో దాటవేత ధోరణిని అవలంభిస్తున్నారు. దీంతో రైతులు సంస్థేతర రుణ ఊబిలో కూరుకుపోతున్నారు.
అన్ని బ్యాంకులదీ ఇదే తీరు..
జిల్లాలో 30 బ్యాంకులకు సంబంధించి 293 శాఖల ద్వారా పంట రుణాలు ఇవ్వాలని ఈ ఏడాది రుణ ప్రణాళిక నిర్దేశించారు. నవంబర్ నెలాఖరు నాటికి ఆయా బ్యాంకులు ఇచ్చిన రబీ రుణాల తీరును పరిశీలిస్తే.. 65 ఎస్బీహెచ్ శాఖల ద్వారా రూ.175.86 కోట్ల రుణాలివ్వాలని లక్ష్యంగా నిర్దేశిస్తే, ఈ బ్యాంకు కేవలం రూ. 73 కోట్లు మాత్రమే ఇవ్వగలిగింది. ఆంధ్రాబ్యాంకు రుణ మంజూరు అధ్వానంగా తయారైంది. 29 శాఖల ద్వారా రూ.130 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, రూ.49.68 కోట్లు మాత్రమే విదిల్చింది. 25 సిండికేట్ బ్యాంకు శాఖల ద్వారా రూ. 93.71 కోట్ల అప్పులివ్వాల్సి ఉండగా, రూ. 36 కోట్లు మాత్రమే ఇచ్చింది. ఎస్బీఐ 18 శాఖల ద్వారా రూ. 14.97 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ. 6.23 కోట్లతో సరిపెట్టింది.
సహకార బ్యాంకుల తీరు ఇలాగే ఉంది. దక్కన్ గ్రామీణ బ్యాంక్, ఎన్డీసీసీబీ కలిపి 85 శాఖల ద్వారా రూ.282.67 కోట్లు రుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకుంటే, కేవలం రూ.117.76 కోట్లు మాత్రమే ఇవ్వగలిగాయి. ఇక ప్రైవేటు సెక్టార్లో ఉన్న పది బ్యాంకుల తీరు మరీ దారుణంగా ఉంది. వీటికి నిర్దేశించిన నామమాత్ర లక్ష్యం మేరకు కూడా రుణాలివ్వలేదు. హెచ్డీఎఫ్సీ, ఇంగ్వైశ్య, ఐసీఐసీఐ, యాక్సిస్, ధనలక్ష్మి, కరూర్‌వైశ్య, సిటీయూనియన్, కర్నాటక బ్యాంకులకు చెందిన 32 శాఖల ద్వారా రూ. 15.78 కోట్లు రుణాలివ్వాలని నిర్ణయించగా, కేవలం రూ. 6.52 కోట్లు మాత్రమే ఇచ్చాయి.