'నిషేధం ఎదుర్కొంటున్న అందర్నీ అనుమతించాలి'
కరాచీ: స్పాట్ ఫిక్సింగ్ పాల్పడి నిషేధం ఎదుర్కొంటున్న క్రికెటర్ల అందర్నీ తిరిగి అనుమతించాలని నిషేధిత పాకిస్థాన్ క్రికెటర్ సల్మాన్ భట్ అభిప్రాయపడ్డాడు. ఒకసారి ఫిక్సింగ్ చేసి కారణంగా నిషేధించబడ్డ క్రికెటర్లకు మళ్లీ అంతర్జాతీయ మ్యాచ్ ల్లో ఆడే అవకాశం ఇవ్వాలన్నాడు. మరో నిషేధిత పాకిస్థాన్ క్రికెటర్ మహ్మద్ అమిర్ కు గుర్తింపు పొందిన దేశవాళీ మ్యాచ్ ల్లో ఆడేందుకు అనుమతి లభించడంపై భట్ స్పందించాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం దేశవాళీ మ్యాచ్ లు పూర్తయిన అంతర్జాతీయ మ్యాచ్ ల్లో ఆడే అవకాశం ఆ ఒక్క ఆటగాడికే లభించడాన్ని తప్పుబట్టాడు.
అతనొక్కడికే అవకాశం కాకుండా.. మిగతా వారందరికీ అవకాశం ఇవ్వాలని సల్మాన్ అభిప్రాయపడ్డాడు. 2010 లో లార్డ్స్ లో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో అమిర్ ఫిక్సింగ్ పాల్పడి నిషేధం ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే అతను ఆరు నెలల జైలు శిక్షతో పాటు, ఐదేళ్ల నిషేధం ఎదుర్కొన్నాడు. అయితే ఐసీసీ తాజాగా సవరించిన నిబంధనల ప్రకారం సంవత్సరంలోపు జైలు శిక్ష అనుభవించిన వారికి తిరిగి ఆడే అవకాశం ఉంది.