వీరంగం సృష్టించిన ఎస్సైల సస్పెన్షన్
ఖమ్మం క్రైం: ఖమ్మంలో ఇటీవల బస్టాండ్ కాంప్లెక్స్‌లోగల ఓ ఫుట్‌వేర్ దుకాణం యజమానిపై దాడిచేసిన ఇద్దరు ఎస్సైలపై సస్పెన్షన్ వేటు పడింది. ఎస్సైలు బాణోతు రాణాప్రతాప్, బాణోతు మహేష్‌లపై వన్‌టౌన్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఒకరిని అకారణంగా కొట్టడం, తిట్టడంతోపాటు ప్రభుత్వం ఇచ్చిన పిస్టల్‌ను అక్రమం గా వాడినందుకుగానూ నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. రఘునాథపాలెం మండలానికి చెందిన రాణాప్రతాప్, మహేష్ సోదరులు. వీరిద్దరూ 2014లో ఒకేసారి ఎస్ఐలుగా ఎంపికయ్యారు.
రాణా మహబూబాద్ జిల్లాలో యస్వోటీ ఎస్ఐగా, మహేష్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో స్పెషల్ పార్టీలో ఎస్ఐగా పనిచేస్తున్నారు. ఐదు రోజుల క్రితం మహేష్ ఖమ్మం బస్టాండ్‌లో బస్సు దిగి అదే కాంప్లెక్స్‌లో ఉన్న బాంబే ఫుట్‌వేర్ షాపులోనుంచి మున్సిపల్ రోడ్డు వైపునకు వస్తుండగా షాప్ యజమాని ఖాద్రీ... సివిల్ దుస్తుల్లో ఉన్న ఎస్ఐను గుర్తించక అభ్యంతరం వ్యక్తం చేశాడు. వ్యాపార సమయంలో ఇటునుంచి రాకూడదనడంతో.. వాదులాట జరిగింది. శని వారం మహేష్ తన సోదరుడైన మరోఎస్ఐ రాణాను తీసుకుని ఆ షాపు వద్దకు చేరి యజమానిని కొట్టారు. సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాల ఆధారంగా వీరిని గుర్తించారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు వీరిద్దరిపై సస్పెన్షన్ వేటు వేశారు.