Bapu-ramanalu
-
ఆమె విజయానికి మీసాల కృష్ణుడే సాక్షి
సాక్షి, కొత్తపేట(తూర్పు గోదావరి) : కథానాయకుడు కృష్ణ – కథానాయకి విజయనిర్మల మధ్య ప్రేమకు పునాది పడింది ఆత్రేయపురం మండలం పులిదిండి గ్రామంలోనే. 1967 సంవత్సరంలో నందనా ఫిలిమ్స్ (శ్రీరమణ చిత్ర) పతాకంపై బాపు దర్శకత్వంలో సురేష్‌కుమార్, శేషగిరిరావు నిర్మించిన ‘సాక్షి’సినిమాలో వారిద్దరూ తొలిసారిగా కలిసి నటించారు. ఆ సినిమా అవుట్డోర్ షూటింగ్ ఆత్రేయపురం మండలంలో పులిదిండి జరిగింది. ఈ సినిమా చిత్రీకరణకు ముందు కథా రచయిత ముళ్లపూడి వెంకటరమణ, దర్శకుడు బాపు సినిమాకు అనుకున్న గ్రామం గురించి ఓ మ్యాప్ గీసుకున్నారు. అందులో ఓ బల్లకట్టు ఉన్న ఓ కాలువ, కాలువ దగ్గర రేవులో ఓ పెద్ద చెట్టు, రేవు నుంచి ఊరికి చిన్న బాట, ఊళ్లో ఓ చిన్న గుడి, గుడికో మండపం ఉండాలి. గోదావరి పరిసరాల్లో ఇరిగేషన్ శాఖలో పనిచేసి సీలేరు ప్రాజెక్టు ఇంజినీర్‌గా పనిచేస్తున్న బాపు, రమణల బాల్యమిత్రుడు, రచయిత బీవీఎస్ రామారావును తమ మ్యాప్‌ను పోలిన ఊరును వెతకాల్సిందిగా కోరారు. రామారావు ఉద్యోగానికి సెలవు పెట్టి అలాంటి ఊరికోసం రాజమండ్రి వచ్చి ఇరిగేషన్ కాంట్రాక్టర్‌గా పరిచయస్తులైన కలిదిండి రామచంద్రరాజును ఊరిని వెతికేందుకు సాయమడిగారు. ఆ మ్యాప్‌లో ఊరిని పోలినట్టుగా తమ ఊరు పులిదిండే వుందన్నారు. ఆ సమాచారంతో బాపు, రమణలు పులిదిండి రాగా వారికి రాజు తమ ఇంట్లోనే బస ఏర్పాటుచేశారు. పులిదిండితో పాటు బొబ్బర్లంక, పిచ్చుక లంక, ఆత్రేయపురం, ఆలమూరు, కట్టుంగ తదితర గ్రామాలను పరిశీలించారు. చివరికి పులిదిండి గ్రామాన్నే ఎంచుకున్నారు. ఆ గ్రామంలో చాలా వరకూ షూటింగ్ చేశారు. గ్రామంలోని మీసాల కృష్ణుడి ఆలయంలో కూడా చిత్రీకరించారు. అది 1965 ప్రాంతం.. కథలో బాగంగా దర్శకుడు బాపు తొలిసారిగా దర్శకత్వం వహిస్తున్న సాక్షి సినిమా పూర్తిగా జిల్లాలో పులిదిండి గ్రామంలో చిత్రీకరిస్తున్నారు. తొలిరోజు కథానాయిక విజయనిర్మల, కథానాయకుడు కృష్ణలమీద ఒక పాట చిత్రీకరిస్తున్నారు. నేపథ్యం ఇదీ.. విజయనిర్మల అన్న ఫకీర్ పేరుమోసిన రౌడీ. వాడికి వ్యతిరేకంగా ఒక హత్యకేసులో కృష్ణ సాక్ష్యం చెబుతాడు. జైలు నుంచి రాగానే కృష్ణను చంపుతానని ఫకీర్ ప్రతిజ ్ఞచేస్తాడు. ఫకీర్ చెల్లెలు విజయనిర్మల కృష్ణను పెళ్ళి చేసుకోమంటుంది. ఫకీర్ జైలు నుంచి విడుదలయ్యాడని వార్త గ్రామంలో పొక్కింది. విజయనిర్మల తాళిబొట్టును తీసుకువచ్చి, తన మెడలో కట్టమంటుంది. మరి కొద్దిసేపటికి చచ్చిపోయేవాడికి పెళ్లేమిటి? అని కృష్ణ కంటనీరు పెట్టుకుంటాడు... ‘అమ్మ కడుపు చల్లగా అత్త కడుపు చల్లగా బతకరా బతకరా నూరేళ్ళు పచ్చగా..అన్న ఆరుద్ర పాటను బాపు ఒక్కరోజులో చిత్రీకరించారు. షూటింగ్ జరిగిన ఆలయానికి మీసాల కృష్ణుడి ఆలయమని పేరు.. రాజబాబు వచ్చి, ఇది పవర్ఫుల్ టెంపుల్, నిజ జీవితంలో కూడా మీరు దంపతులు అవుతారని ఆయన అన్నాడు. ఆ సమయంలో రాజబాబు ఆ మాటంటే ఏమిటా పిచ్చిమాటలు అని విజయనిర్మల కసిరారు. మూడు నాలుగు సినిమాల తరువాత వారు నిజంగానే దంపతులు అయ్యారు. గోదారమ్మవారిని కలిపింది. ఆ తరువాత బాపు దర్శకత్వంలోనే విజయనిర్మల అక్కినేని సరసన బుద్ధిమంతుడు సినిమాలో నటించారు. రెండు విజయవంతమైన సినిమాలే! విజయనిర్మల దర్శకత్వానికి కోనసీమలోనే బీజం విజయనిర్మల దర్శకత్వానికి కోనసీమలోనే బీజం పడిందని కొత్తపేటకు చెందిన కవి, రచయిత షేక్ గౌస్ తెలిపారు. బాపు దర్శకత్వంలో చిత్రీకరించిన సాక్షి సినిమాలో కృష్ణతో, బుద్ధిమంతుడు సినిమాలో అక్కినేని నాగేశ్వరరావుతో విజయనిర్మల హీరోయిన్గా నటించారు. ఆ రెండు సినిమాలు కోనసీమలోనే చిత్రీకరించారు. ఆమె బాపు దర్శకత్వాన్ని గమనించి దర్శకత్వంలో మెళకువలు తెలుసుకున్నారు. ‘సాక్షి’ సినిమా పరిచయం ద్వారా కృష్ణ – విజయనిర్మల ఒకటైనదీ, ఆమె దర్శకత్వానికి బీజం పడినదీ కోనసీమలోనే అని గౌస్ తెలిపారు. -
శ్రీదేవీ రమణీయం
♦ సోల్ మేట్ బాపు-రమణల జంటలో ఒకరైన ముళ్లపూడి వెంకటరమణ జయంతి నేడు. రమణగారు చిన్నతనంలో చాలా కష్టాలు పడ్డారు. పదో యేటే తండ్రిగారు గతించడంతో రమణగారి తల్లిగారు పిల్లలను తీసుకుని మద్రాసు వచ్చారు. అక్కడే రమణగారు ఎస్ఎస్ఎల్సి వరకు చదివారు. చదువు అయిపోయాక మళ్లీ రాజమండ్రి వచ్చేశారు. కొన్నాళ్లు చిన్నాచితకా పనులు చేశారు. ఖాళీ సమయంలో ఇంగ్ల్లీషు పుస్తకాలు చదువుతుండేవారు. అది చూసి అక్కడి ఇంగ్లీషు దొరగారు రమణగారిని అభిమానించి ‘ఇక్కడ పని మానేసి వెళ్లి మంచి ఉద్యోగం చూసుకో’ అని పది రూపాయలు చేతిలో పెట్టి పంపించారట. ఆ పది రూపాయలు, ఒక జత బట్టలు తీసుకుని, ఇంట్లో ఎవరికీ చెప్పకుండా రమణగారు మద్రాసు బయలుదేరారు. ఈ వివరాలన్నీ మనకు ఆయన ఆత్మకథలో దొరకుతాయి. అందులో లేని విషయాలు కొన్ని ఇప్పుడు ఆయన సతీమణి శ్రీదేవి మాటల్లో విందాం. సినిమాలలోకి రావడానికి ముందు రమణగారు ఏదో చిన్న పత్రికలో ప్రూఫ్ రీడర్‌గా పనిచేశారు. అదేం దురదృష్టమో ఆ పత్రికను నెల్లాళ్లకే మూసేశారు. ఆ తరవాత ఆంధ్రపత్రికలో చేరారు. అక్కడ పనిచేయడం ప్రారంభించాక చాలా కథలు రాశారు. అయితే ఆంధ్రపత్రికలో కొంతకాలం పనిచేశాక రమణగారు ‘నేను ఒకరి కింద పనిచేయలేను’ అని పత్రిక నుంచి బయటకు వచ్చేశారు. ఉద్యోగం లేకపోయినా బతకగలను. జీతం కంటె విడిగానే ఎక్కువ సంపాదిస్తానని వారితో చెప్పి ఉద్యోగం మానేశారట. ఆయన అనుకున్నట్టుగానే డబ్బు కొద్దికొద్దిగా సంపాదించడం ప్రారంభించారు. మహానటులు గోవిందరాజుల సుబ్బారావు గారి దగ్గరకు చాలామంది వస్తుండేవారు. ఆయన హోమియో వైద్యులు. ఆయన తమ్ముడి కొడుకు శ్రీనివాసరావు గారే వెంకటరమణగారిని చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. అప్పట్లో అజంతా గారు, విఏకె రంగారావుగారు, రావి కొండలరావు గారు వీరంతా స్నేహితులు. అందరూ కలిస్తే సరదాగా గడిపేవారట. ఆ తరవాత నెమ్మదిగా డబ్బింగ్ సినిమాలకి పనిచేశారు. తెలుగులో డూండీ గారి ‘రక్తసంబంధం’ మొట్టమొదటి సినిమా. అప్పటికే రమణగారు బాపుగారు అర్ధనారీశ్వరులయ్యారు. సినిమా కోసం ఏ కథ రాసినా ముందుగా బాపు గారితో చర్చించాక నాకు చెప్పేవారు. నాకు నచ్చితే బావుందని చెప్పేదాన్ని. లేకపోతే నా అభిప్రాయం నేను చెప్పేదాన్ని అంతే. గోదావరి ప్రాణాధారం రమణగారి సినిమాల్లో గోదావరి నేపథ్యం ఎక్కువగా ఉంటుంది. అందుకు కారణం లేకపోలేదు. రమణగారు బాల్యంలో ధవళేశ్వరం దగ్గర రాయవరంలో ఉండేవారు. అక్కడ లాంచీలు, పడవలు నడిపే వాళ్లు చాలామంది ఉండేవారు. రమణ గారి తల్లి వారందరికీ తలలో నాలుకలా ఉండేవారు. పడవ వాళ్లు దుంగలు అవీ తెచ్చి ఇస్తుంటే ఆవిడ అన్నం వండి, ఆవకాయ వేసి వాళ్లకి అన్నం పెట్టేవారు. వాళ్లు నిత్యం ఇంటికి వచ్చి వెళ్తుండటంతో రమణగారు నది ఒడ్డుకి వెళ్లి వాళ్లతోనే ఎక్కువగా ఆడుకునేవారు. ఆ పడవ వాళ్లకు రమణగారంటే చాలా ఇష్టం. వారు ఈయన్ని ఎత్తుకుని ఆడించేవారు. ఆ తరవాత మద్రాసు రావడం, మూగమనసులు చిత్రానికి ఆదుర్తి సుబ్బారావుగారితో పని చేయడం, ఆ కారణంగా గోదావరికి మళ్లీ రావడం జరిగింది. గోదావరిలో మొట్టమొదటి ఔట్‌డోర్ షూటింగ్ జరుపుకున్న చిత్రం మూగమనసులే. ఆ తరవాత చాలా సినిమాలు గోదావరిలో తీశారు. నాకు ఆయన చిత్రాలలో అందాల రాముడు అంటే చాలా ఇష్టం. ఆ సినిమా గోదావరి మీద తీసిందే. బాపూ జోడీ రమణ గారి గురించి మాట్లాడేటప్పుడు బాపు దంపతుల గురించి ప్రస్తావించకపోవడం సాధ్యం కాదు. మా జీవితంలో ఆ దంపతులు నిత్యం ఉంటారు. బాపుగారికి మా అన్నయ్య (నండూరి రామమోహనరావు) నా ఫొటో చూపిస్తే, ఆయన వెంటనే ‘మా రమణ ఉన్నాడుగా’ అన్నారట. అలా నన్నిచ్చి వివాహం చేయడానికి అంగీకరించేశారు. మా పెళ్లినాటికి నా వయసు 20, రమణగారి వయసు 32. నేను అంతవరకు ఇల్లు కదిలిందే లేదు. అటువంటిది అందరినీ వదిలేసి ఆ చిన్న పల్లెటూరు నుంచి మద్రాసు మహానగరానికి వచ్చాను. పెళ్లయిన మొదట్లో అప్పుడప్పుడు పుట్టింటికి వెళ్లేదాన్ని. ఆ తరవాత కొంత కాలానికి నేను ఇంటికి వెళ్లడమే తగ్గిపోయింది. బాపుగారి తల్లి సూర్యకాంతమ్మగారు... రమణగారిని, నన్ను సొంతమనుషుల్లా చూసుకున్నారు. మా అత్తగారు ఆదిలక్ష్మికి అందరి కంటె నేనంటేనే చాలా ఇష్టం. కోపం వస్తే మాట అనేసేవారు. అంతలోనే ప్రేమగా చూసేవారు. బంగారు భాగ్యవతి... బాపుగారి భార్య భాగ్యవతి నన్ను ఎంతో ఆప్యాయంగా ఆదరించింది. ఆవిడ నా కంటె నాలుగేళ్లు పెద్ద. పెళ్లయి వచ్చిన కొత్తలో నాకు ఎలా మసలుకోవాలో తెలియక మా ఇద్దరి మధ్య మాటా మాటా వచ్చినా భాగ్యవతి పెద్ద మనసుతో సద్దుకుపోయేది. ఆ తరవాత నాకే తెలిసేది నేను చేసిన తప్పేంటో. ఏదైనా సరే భాగ్యవతి కరెక్ట్‌గా చేస్తుందని కొంతకాలానికి అర్థం చేసుకున్నాను. ఇద్దరికీ మాట వచ్చినా, ఇబ్బంది వచ్చినా... జరిగిన తప్పును ఒప్పుకోవడం వల్ల వచ్చే సుఖం నాకు తెలుసు. ధైర్యం ఎక్కువ చిత్రాలు నిర్మించినప్పుడు ఎంత ఆస్తి కరిగిపోయినా, వెంకటరమణగారు ధైర్యంగా ఉండటంతో నేను కూడా ధైర్యంగానే ఉన్నాను. బాపు గారి అండ వల్ల అంత ధైర్యంగా ఉండగలిగామేమో అనిపిస్తుంది. ఇల్లు అమ్మేసినప్పుడు ఎక్కడ ఉందామా అని ఆలోచిస్తుంటే, బాపు గారు ‘నాతో పాటే ఉండాలి’ అన్నారు. భాగ్యవతి అయితే మారు మాట్లాడనివ్వలేదు. ఇప్పుడు నేను ఉంటున్న ఇల్లు భాగ్యవతి వల్లే వచ్చింది. ఇంతకంటె మించింది లేదు. ఆ విషయం గురించి ఎవ్వరూ ఒక్కమాట కూడా అడ్డు చెప్పలేదు. నా జీవితంలో నేను ఎప్పటికీ జ్ఞాపకం పెట్టుకునే విషయం ఇది. రమణగారి పుట్టినరోజు సందర్భంగా ఒకసారి అందరినీ స్మరించుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. - సంభాషణ: డా. పురాణపండ వైజయంతి బుడుగు... బాపుగారి మేనల్లుడు బాగా అల్లరి చేస్తుండేవాడు. ఇకనేం డెన్నిస్ ద మినేస్ పాత్రల ఆధారంగా బుడుగు పాత్ర పుట్టుకు వచ్చింది. రమణగారిని వాళ్ల నాన్నగారు వాళ్లు బుడుగు అని, మా పెద్ద ఆడపడుచుని బుల్లులు అని పిలిచేవారు. అలా ఆ పాత్ర పేరు నిలబడిపోయింది. మూత ఉండకూడదు... రమణ గారికి భోజనం చేసేటప్పుడు గిన్నె మీద మూత పెట్టకూడదు. అలా ఉంటే ఆయన అన్నం తినడానికి ఇష్టపడరు. మూత తీసి ఉంచి, కొద్ది కొద్దిగా వడ్డిస్తూ ఉంటే తింటారు. అప్పుడే తనకు తృప్తిగా భోజనం చేసినట్టు అనిపిస్తుందనేవారు. -
అదో తుత్తి!
బాపు-రమణలు తీర్చిదిద్దిన సుందరచిత్రం ‘మిష్టర్ పెళ్లాం’. ఇందులో గోపాలకృష్ణ పాత్రకు నత్తి పెట్టకపోయుంటే ఎలా ఉండేదో ఒకసారి ఊహించుకోండి. చాలా వెలితిగా ఉండేది కదూ! ఆ నత్తే మనకింత తుత్తినిచ్చింది మరి. మైనస్ అనుకున్న దాన్ని కూడా ప్లస్సుగా చూపడమంటే ఇదే. ఏవీయస్ చనిపోయి ఏడాది గడిచినా చిరంజీవిగా మిగిలిపోయారంటే ఇలాంటి తుత్తి పాత్రల వల్లనే! ఈ పాత్ర పేలుతుందని ముందే అనుకున్నా! బాపు-రమణలకు సన్నిహితుడైన శ్రీరమణ ద్వారా ఏవీయస్ సినిమా ఇండస్ట్రీకి వచ్చినట్టు గుర్తు. నటనతో పాటు రచయితగా కూడా ప్రయత్నాలు చేస్తుండేవారు. మా ‘మిష్టర్ పెళ్లాం’ సిట్టింగ్స్‌కి కూడా వచ్చేవారు. ఏవీయస్ ఓ నాటకంలో తుత్తి పాత్ర చేశారట. ఆ ట్రాక్ బాపు-రమణలకు చెబితే, ఇంప్రెస్ అయ్యి ఈ స్క్రిప్టులో అందంగా ఇమిడ్చారు. ఆ తర్వాత ఆ పాత్రను ఏవీయస్నే చేయమన్నారు. ఈ పాత్ర బాగా పేలుతుందని షూటింగ్ దశలోనే అనుకున్నా. - గవర పార్థసారథి, నిర్మాత జామకాయలు ఇస్తే ఒకరోజు గుర్తుపెట్టు కుంటారు. మామిడి కాయలు ఇస్తే మాసమంతా తలచుకుంటారు. మరి - లెంపకాయలు ఇస్తే జీవితాంతం జ్ఞాపకం పెట్టుకుంటారు. ఎనీ డౌట్స్! ఆ రోజు గోపాలకృష్ణ చాలా బిజీగా ఉన్నాడు. మరి కాస్సేపట్లో బోర్డ్ ఆఫ్ డెరైక్టర్స్ మీటింగాయె! తను మేనేజింగ్ డెరైక్టరు. తండ్రి చైర్మను. ఇలాంటి గజిబిజీ టైములో ఫోను మోగింది. అవతల పి.ఎ.... ‘‘సార్ మీ కోసం లేడీసొచ్చారు’’. గోపాలకృష్ణ అవాక్కయ్యాడు. ‘‘ఎ... ఎంతమంది?’’ అనడిగాడు. పి.ఎ. ఫకాలున నవ్వేసి ‘‘ఓహో... లేడీసంటే బోలెడంత మంది అనుకున్నారా? ఒక్కరే’’ అని చెప్పాడు. ‘‘ఏ... ఏం పేరు... ఎందుకొచ్చారో కనుక్కో?’’ ఆర్డరేశాడు గోపాలకృష్ణ. ‘‘ఎవరో శివంగి అట సార్’’ అని పి.ఎ. చెప్పగానే గోపాలకృష్ణ ఒక్కసారి తన కుడి చెంప తడుముకున్నాడు. అతని కళ్ల ముందు ఓ పిక్చర్ కనబడింది. శివంగి అంటే ఝాన్సీలక్ష్మి. ఇంటర్లో క్లాసుమేటు. ‘‘ఆమెను తీసుకుని నా చా... ఛాంబర్‌కి రా!’’ అని పురమాయించేశాడు. శివంగిని చూడగానే గోపాలకృష్ణ కళ్లు మెరిశాయి. ఒక్కసారి కాలేజీ డేస్ అన్నీ గిర్రున గుర్తొచ్చాయి. అతని ఉత్సాహం, చిన్నపిల్లాడిలా సంబరపడటం చూసి ‘‘నువ్వేం మారలేదు గోపాల్’’ అంది శివంగి అనబడే ఝాన్సీలక్ష్మి. ఈలోగా కాఫీ వచ్చింది. ‘‘ఎ... ఎన్నాళ్లయ్యింది శివంగీ... నిన్ను చూసి! ఎక్కడున్నావ్? మీ ఆయనేం చేస్తుంటాడు? పిల్లలా?’’ అని టకటకా ప్రశ్నలు సంధించాడు గోపాలకృష్ణ. కాఫీ సిప్ చేస్తూనే తన గురించి చెప్పింది శివంగి. అలా ఇద్దరూ కాసేపు పాత జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయారు. ‘‘శివంగి అనగానే టక్కున గుర్తుపట్టేశావ్?’’ అంది శివంగి చిలిపిగా. ‘‘ఎ... ఎందుకు పట్టను శివంగీ. నువ్విచ్చిన లెంపకాయ అంత ఈజీగా మరిచిపోతానా? నన్ను గుర్తుంచుకుని ఇంత దూరం వచ్చావ్. నాకదే తుత్తి’’ చెప్పాడు గోపాలకృష్ణ. శివంగి కొంచెం కన్ఫ్యూజింగ్గా ‘‘తుత్తి ఏంటి?’’ అడిగింది. ‘‘తుత్తి... తుత్తి... శాటిస్ఫేక్షన్’’ చెప్పాడతను. ‘‘ఓహో... యూ మీన్ తృప్తి’’ అందామె నవ్వుతూ. చిన్నప్పటి ఈ క్లాస్మేట్ తన కంపెనీలో ఉద్యోగాని కొచ్చిందని తెలియగానే గోపాలకృష్ణ అగ్గగ్గలాడిపోయాడు. ఫ్రెండ్‌కు ఏ ఉద్యోగం ఇవ్వడానికైనా తాను రెడీ. ఈలోగా మీటింగు మొదలైంది. చైర్మన్, ఇంకొందరు డెరైక్టర్లు రెడీ. కంపెనీ సేల్స్ పెంచడానికి ఎవడో ఒకతను బోడి సలహా ఇచ్చేసరికి, శివంగి పగలబడి నవ్వేసింది. చైర్మన్‌కి కోపం వచ్చింది. మిగతా డెరైక్టర్లూ సేమ్ టూ సేమ్. ‘‘నా ఫ్రెండు’’ అంటూ గోపాలకృష్ణ ఏదో కవర్ చేయబోయాడు. చైర్మన్ ఊరుకోలేదు. ‘‘నువ్వీ మీటింగ్‌కి ఎందుకొచ్చావని అడగడం లేదు. ఎందుకు నవ్వావో చెప్పు’’ అని చైర్మన్ గద్దించాడు. ‘‘మీ కంపెనీ సేల్స్ పెంచడానికి మీరు పడుతున్న తిప్పలు చూసి నవ్వొచ్చింది. ఓ మధ్య తరగతి గృహిణిగా నేను కొన్ని సలహాలు చెప్తాను. ఇలా పాటించి చూడండి’’ అంటూ శివంగి చకచకా చిట్కాలు చెప్పేసింది. చైర్మన్ వండరైపోయాడు. ‘‘మా అన్నపూర్ణ ఫుడ్ కార్పొరేషన్ సేల్స్ డిపార్ట్మెంట్కి నిన్ను వైస్ ప్రెసిడెంట్‌గా నియమిస్తున్నా. వన్ ఇయర్ కాంట్రాక్ట్. నెలకు పదివేల జీతం... క్వార్టర్స్... ఫోను... కారు... ఇస్తాం’’ అని చెప్పి అప్పటికప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్ రెడీ! ఆ తర్వాత రోజు - శివంగిని ఆఫీసుకు తీసుకు రావడానికి స్వయంగా ఇంటికి వెళ్లాడు గోపాలకృష్ణ. శివంగి భర్త బాలాజీని పరిచయం చేసుకున్నాడు. భార్యకు ఇంత పెద్ద ఉద్యోగం రావడం బాలాజీకి కడుపుమంటగా ఉంది. దానికి తోడు గోపాలకృష్ణ ఇంటికి రావడంతో ఒళ్లు మంటగా ఉంది. అందుకే గోపాలకృష్ణపై ఎన్నో చెణుకులు. చివరకు అతని నత్తిని కూడా అనుకరించాడు. పాపం గోపాలకృష్ణ కల్మషం లేనివాడు. ఈ కడుపుమంటలు, ఉక్రోషాల గురించి అస్సలు తెలియవు. ఝాన్సీ తన ఫ్రెండు. ఝాన్సీ భర్త కూడా తన ఫ్రెండే. ఫ్రెండ్ కాకపోతే ఇంకెవరు కామెంట్ చేస్తారు. గోపాలకృష్ణ ఆఫీసు ఎంత విశాలమో, అతని హృదయమూ అంతే విశాలం! గోపాలకృష్ణ కంపెనీలో కృష్ణాష్టమిని ప్రతి ఏటా గ్రాండ్‌గా నిర్వహిస్తారు. ఆఫీసు వాళ్లంతా కుటుంబ సభ్యులతో సహా రావాల్సిందే! శివంగికి చెబితే సరిపోతుంది. కానీ కర్టెసీ కొద్దీ బాలాజీని తనే స్వయంగా ఫోన్ చేసి మరీ ఇన్వైట్ చేశాడు గోపాలకృష్ణ. బాలాజీ నిజానికి మంచివాడే. కానీ అసూయ ఆ మంచితనాన్ని డామినేట్ చేసేస్తోంది. దానికి తోడు గోపాలకృష్ణ-ఝాన్సీల ఫ్రెండ్షిప్ పుండు మీద కారం చల్లుతోంది. గోపాలకృష్ణ కూడా సతీసమేతంగా ఆ ఫంక్షన్కొచ్చాడు. శివంగిని తన శ్రీమతికి ఇంట్రడ్యూస్ చేశాడు. ‘‘నన్ను లెంపకాయ కొట్టిందని చెప్పానే... తనే... శివంగి. కొంచెం ఉంటే నీ ప్లేసులోకి రావాల్సింది’’ అన్నాడు గోపాలకృష్ణ నవ్వుతూ. గోపాలకృష్ణ శ్రీమతి కోమలాదేవి కూడా అంతే ఇదిగా నవ్వుతూ, ‘‘ఇప్పటికి 972 సార్లు చెప్పారు మీ లెంపకాయ గురించి’’ అంది. గోపాలకృష్ణ కేరెక్టర్ అంతే. ఏదీ మనసులో దాచుకోడు. అంతా ఓపెనే. వాళ్ల కంపెనీ ప్రొడక్ట్స్‌లో కల్తీ ఉండనట్టే, ఇతని ఆలోచనల్లోనూ, మనసులోనూ కల్తీనే ఉండదు. శివంగి ఫ్యామిలీలో ఏదో డిస్ట్రబెన్స్ ఉందని గోపాల కృష్ణ కనిపెట్టాడు. కానీ బయటపడలేదు. పడితే శివంగి ఫీలవుతుంది. అందుకే శివంగికి ఓ ఫ్రెండ్‌లాగా... ఓ బ్రదర్‌లాగా వెన్నుదన్నుగా నిలబడ్డాడు. బాలాజీ విషయంలో శివంగి తొందరపడితే క్లాసు పీకాడు. మార్గం చూపాడు. ఇప్పుడు బాలాజీ - శివంగి ఒకటయ్యారు. వాళ్ల చుట్టూ ముసురుకున్న మేఘాలన్నీ తొలగిపోయాయి. ‘‘మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకెంతో ‘తుత్తి’గా ఉంది’’ అన్నాడు గోపాలకృష్ణ. బాలాజీ కూడా తుత్తిగా నవ్వాడు. అవును... తుత్తి తోడుంటే ఆనందం మీ వెంటే! - పులగం చిన్నారాయణ తుత్తి... నా పాలిట అదృష్టం! - ఏవీఎస్ ‘అతలు కిత్నాత్తమి అంతే ఏంతంతే... (అసలు కృష్ణాష్టమి అంటే ఏంటంటే...) డైలాగ్‌ని ఫస్ట్‌షాట్‌గా తీశారు. కొద్దిసేపట్లో సీన్ తీస్తారనగా... విజయవాడలో ఉండే మా అక్కయ్య చనిపోయిందని కబురొచ్చింది. నా వల్ల షూటింగ్ క్యాన్సిల్ కాకూడదు. అందుకే బాధ దిగమింగుకుని, కన్నీళ్లు ఆపుకుని సీన్ పూర్తి చేశాను. 1993 ఆగస్టు 5న ‘మిష్టర్ పెళ్లాం’ రిలీజైంది. నా జీవితం తుత్తిగా సాగడానికి మార్గం ఏర్పడింది. నాకు ఈ పాత్ర ఎనలేని గుర్తింపునూ, స్థిరత్వాన్నీ తెచ్చిపెట్టింది. అందుకే ‘తుత్తి’ నా పాలిట అదృష్టం. (‘తుత్తి’ పాత్ర గురించి గతంలో ఏవీయస్ చెప్పిన మాటలు ) హిట్ క్యారెక్టర్ సినిమా పేరు: మిష్టర్ పెళ్లాం (1993); డెరైక్ట్ చేసింది: బాపు సినిమా తీసింది: గవర పార్థసారథి; మాటలు రాసింది: ముళ్లపూడి వెంకటరమణ