అదో తుత్తి! | AVS character on mr.pellam reviews chiranjeevi | Sakshi
Sakshi News home page

అదో తుత్తి!

Published Thu, Jun 4 2015 11:30 PM | Last Updated on Sun, Sep 3 2017 3:13 AM

అదో తుత్తి!

అదో తుత్తి!

బాపు-రమణలు తీర్చిదిద్దిన సుందరచిత్రం ‘మిష్టర్ పెళ్లాం’. ఇందులో గోపాలకృష్ణ పాత్రకు నత్తి పెట్టకపోయుంటే ఎలా ఉండేదో ఒకసారి ఊహించుకోండి. చాలా వెలితిగా ఉండేది కదూ! ఆ నత్తే మనకింత తుత్తినిచ్చింది మరి. మైనస్ అనుకున్న దాన్ని కూడా ప్లస్సుగా చూపడమంటే ఇదే. ఏవీయస్ చనిపోయి ఏడాది గడిచినా చిరంజీవిగా మిగిలిపోయారంటే ఇలాంటి తుత్తి పాత్రల వల్లనే!


పాత్ర పేలుతుందని ముందే అనుకున్నా!
బాపు-రమణలకు సన్నిహితుడైన శ్రీరమణ ద్వారా ఏవీయస్ సినిమా ఇండస్ట్రీకి వచ్చినట్టు గుర్తు. నటనతో పాటు రచయితగా కూడా ప్రయత్నాలు చేస్తుండేవారు. మా ‘మిష్టర్ పెళ్లాం’ సిట్టింగ్స్‌కి కూడా వచ్చేవారు. ఏవీయస్ ఓ నాటకంలో తుత్తి పాత్ర చేశారట. ఆ ట్రాక్ బాపు-రమణలకు చెబితే, ఇంప్రెస్ అయ్యి ఈ స్క్రిప్టులో అందంగా ఇమిడ్చారు. ఆ తర్వాత ఆ పాత్రను ఏవీయస్‌నే చేయమన్నారు. ఈ పాత్ర బాగా పేలుతుందని షూటింగ్ దశలోనే అనుకున్నా.         - గవర పార్థసారథి, నిర్మాత
 
జామకాయలు ఇస్తే ఒకరోజు గుర్తుపెట్టు కుంటారు. మామిడి కాయలు ఇస్తే మాసమంతా తలచుకుంటారు. మరి - లెంపకాయలు ఇస్తే జీవితాంతం జ్ఞాపకం పెట్టుకుంటారు. ఎనీ డౌట్స్!
ఆ రోజు గోపాలకృష్ణ చాలా బిజీగా ఉన్నాడు. మరి కాస్సేపట్లో బోర్డ్ ఆఫ్ డెరైక్టర్స్ మీటింగాయె! తను మేనేజింగ్ డెరైక్టరు.  తండ్రి చైర్మను. ఇలాంటి గజిబిజీ టైములో ఫోను మోగింది. అవతల పి.ఎ.... ‘‘సార్ మీ కోసం లేడీసొచ్చారు’’.
గోపాలకృష్ణ అవాక్కయ్యాడు. ‘‘ఎ... ఎంతమంది?’’ అనడిగాడు.
పి.ఎ. ఫకాలున నవ్వేసి ‘‘ఓహో... లేడీసంటే బోలెడంత మంది అనుకున్నారా? ఒక్కరే’’ అని చెప్పాడు. ‘‘ఏ... ఏం పేరు... ఎందుకొచ్చారో కనుక్కో?’’ ఆర్డరేశాడు గోపాలకృష్ణ. ‘‘ఎవరో శివంగి అట సార్’’ అని పి.ఎ. చెప్పగానే గోపాలకృష్ణ ఒక్కసారి తన కుడి చెంప తడుముకున్నాడు.
అతని కళ్ల ముందు ఓ పిక్చర్ కనబడింది. శివంగి అంటే ఝాన్సీలక్ష్మి. ఇంటర్‌లో క్లాసుమేటు. ‘‘ఆమెను తీసుకుని నా చా... ఛాంబర్‌కి రా!’’ అని పురమాయించేశాడు.
శివంగిని చూడగానే గోపాలకృష్ణ కళ్లు మెరిశాయి. ఒక్కసారి కాలేజీ డేస్ అన్నీ గిర్రున గుర్తొచ్చాయి. అతని ఉత్సాహం, చిన్నపిల్లాడిలా సంబరపడటం చూసి ‘‘నువ్వేం మారలేదు గోపాల్’’ అంది శివంగి అనబడే ఝాన్సీలక్ష్మి. ఈలోగా కాఫీ వచ్చింది.
‘‘ఎ... ఎన్నాళ్లయ్యింది శివంగీ... నిన్ను చూసి! ఎక్కడున్నావ్? మీ ఆయనేం చేస్తుంటాడు? పిల్లలా?’’ అని టకటకా ప్రశ్నలు సంధించాడు గోపాలకృష్ణ. కాఫీ సిప్ చేస్తూనే తన గురించి చెప్పింది శివంగి. అలా ఇద్దరూ కాసేపు పాత జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయారు. ‘‘శివంగి అనగానే టక్కున గుర్తుపట్టేశావ్?’’ అంది శివంగి చిలిపిగా. ‘‘ఎ... ఎందుకు పట్టను శివంగీ. నువ్విచ్చిన లెంపకాయ అంత ఈజీగా మరిచిపోతానా? నన్ను గుర్తుంచుకుని ఇంత దూరం వచ్చావ్. నాకదే తుత్తి’’ చెప్పాడు గోపాలకృష్ణ. శివంగి కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ‘‘తుత్తి ఏంటి?’’ అడిగింది.

‘‘తుత్తి... తుత్తి... శాటిస్‌ఫేక్షన్’’ చెప్పాడతను. ‘‘ఓహో...  యూ మీన్ తృప్తి’’ అందామె నవ్వుతూ.
చిన్నప్పటి ఈ క్లాస్‌మేట్ తన కంపెనీలో ఉద్యోగాని కొచ్చిందని తెలియగానే గోపాలకృష్ణ అగ్గగ్గలాడిపోయాడు. ఫ్రెండ్‌కు ఏ ఉద్యోగం ఇవ్వడానికైనా తాను రెడీ. ఈలోగా మీటింగు మొదలైంది. చైర్మన్, ఇంకొందరు డెరైక్టర్లు రెడీ. కంపెనీ సేల్స్ పెంచడానికి ఎవడో ఒకతను బోడి సలహా ఇచ్చేసరికి, శివంగి పగలబడి నవ్వేసింది. చైర్మన్‌కి కోపం వచ్చింది. మిగతా డెరైక్టర్లూ సేమ్ టూ సేమ్.

‘‘నా ఫ్రెండు’’ అంటూ గోపాలకృష్ణ ఏదో కవర్ చేయబోయాడు.  చైర్మన్ ఊరుకోలేదు. ‘‘నువ్వీ మీటింగ్‌కి ఎందుకొచ్చావని అడగడం లేదు. ఎందుకు నవ్వావో చెప్పు’’ అని చైర్మన్ గద్దించాడు. ‘‘మీ కంపెనీ సేల్స్ పెంచడానికి మీరు పడుతున్న తిప్పలు చూసి నవ్వొచ్చింది. ఓ మధ్య తరగతి గృహిణిగా నేను కొన్ని సలహాలు చెప్తాను. ఇలా పాటించి చూడండి’’ అంటూ శివంగి చకచకా చిట్కాలు చెప్పేసింది. చైర్మన్ వండరైపోయాడు. ‘‘మా అన్నపూర్ణ ఫుడ్ కార్పొరేషన్ సేల్స్ డిపార్ట్‌మెంట్‌కి నిన్ను వైస్ ప్రెసిడెంట్‌గా నియమిస్తున్నా. వన్ ఇయర్ కాంట్రాక్ట్. నెలకు పదివేల జీతం... క్వార్టర్స్... ఫోను... కారు... ఇస్తాం’’ అని చెప్పి అప్పటికప్పుడు అపాయింట్‌మెంట్ ఆర్డర్ రెడీ!

ఆ తర్వాత రోజు - శివంగిని ఆఫీసుకు తీసుకు రావడానికి స్వయంగా ఇంటికి వెళ్లాడు గోపాలకృష్ణ. శివంగి భర్త బాలాజీని పరిచయం చేసుకున్నాడు. భార్యకు ఇంత పెద్ద ఉద్యోగం రావడం బాలాజీకి కడుపుమంటగా ఉంది. దానికి తోడు గోపాలకృష్ణ ఇంటికి రావడంతో ఒళ్లు మంటగా ఉంది. అందుకే గోపాలకృష్ణపై ఎన్నో చెణుకులు. చివరకు అతని నత్తిని కూడా అనుకరించాడు.

పాపం గోపాలకృష్ణ కల్మషం లేనివాడు. ఈ కడుపుమంటలు, ఉక్రోషాల గురించి అస్సలు తెలియవు. ఝాన్సీ తన ఫ్రెండు. ఝాన్సీ భర్త కూడా తన ఫ్రెండే. ఫ్రెండ్ కాకపోతే ఇంకెవరు కామెంట్ చేస్తారు.

గోపాలకృష్ణ ఆఫీసు ఎంత విశాలమో, అతని హృదయమూ అంతే విశాలం!
గోపాలకృష్ణ కంపెనీలో కృష్ణాష్టమిని ప్రతి ఏటా గ్రాండ్‌గా నిర్వహిస్తారు. ఆఫీసు వాళ్లంతా కుటుంబ సభ్యులతో సహా రావాల్సిందే!
శివంగికి చెబితే సరిపోతుంది. కానీ కర్టెసీ కొద్దీ బాలాజీని తనే స్వయంగా ఫోన్ చేసి మరీ ఇన్వైట్ చేశాడు గోపాలకృష్ణ. బాలాజీ నిజానికి మంచివాడే. కానీ అసూయ ఆ మంచితనాన్ని డామినేట్ చేసేస్తోంది. దానికి తోడు గోపాలకృష్ణ-ఝాన్సీల ఫ్రెండ్‌షిప్ పుండు మీద కారం చల్లుతోంది. గోపాలకృష్ణ కూడా సతీసమేతంగా ఆ ఫంక్షన్‌కొచ్చాడు. శివంగిని తన శ్రీమతికి ఇంట్రడ్యూస్ చేశాడు. ‘‘నన్ను లెంపకాయ కొట్టిందని చెప్పానే... తనే... శివంగి. కొంచెం ఉంటే నీ ప్లేసులోకి రావాల్సింది’’ అన్నాడు గోపాలకృష్ణ నవ్వుతూ. గోపాలకృష్ణ శ్రీమతి కోమలాదేవి కూడా అంతే ఇదిగా నవ్వుతూ, ‘‘ఇప్పటికి 972 సార్లు చెప్పారు మీ లెంపకాయ గురించి’’ అంది.
గోపాలకృష్ణ కేరెక్టర్ అంతే. ఏదీ మనసులో దాచుకోడు. అంతా ఓపెనే. వాళ్ల కంపెనీ ప్రొడక్ట్స్‌లో కల్తీ ఉండనట్టే, ఇతని ఆలోచనల్లోనూ, మనసులోనూ కల్తీనే ఉండదు.

శివంగి ఫ్యామిలీలో ఏదో డిస్ట్రబెన్స్ ఉందని గోపాల కృష్ణ కనిపెట్టాడు. కానీ బయటపడలేదు. పడితే శివంగి ఫీలవుతుంది. అందుకే శివంగికి ఓ ఫ్రెండ్‌లాగా... ఓ బ్రదర్‌లాగా వెన్నుదన్నుగా నిలబడ్డాడు. బాలాజీ విషయంలో శివంగి తొందరపడితే క్లాసు పీకాడు. మార్గం చూపాడు. ఇప్పుడు బాలాజీ - శివంగి ఒకటయ్యారు. వాళ్ల చుట్టూ ముసురుకున్న మేఘాలన్నీ తొలగిపోయాయి.
‘‘మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకెంతో ‘తుత్తి’గా ఉంది’’ అన్నాడు గోపాలకృష్ణ. బాలాజీ కూడా తుత్తిగా నవ్వాడు.
అవును... తుత్తి తోడుంటే ఆనందం మీ వెంటే!
 - పులగం చిన్నారాయణ
 
తుత్తి... నా పాలిట అదృష్టం! - ఏవీఎస్
‘అతలు కిత్నాత్తమి అంతే ఏంతంతే... (అసలు కృష్ణాష్టమి అంటే ఏంటంటే...) డైలాగ్‌ని ఫస్ట్‌షాట్‌గా తీశారు. కొద్దిసేపట్లో సీన్ తీస్తారనగా... విజయవాడలో ఉండే మా అక్కయ్య చనిపోయిందని కబురొచ్చింది. నా వల్ల షూటింగ్ క్యాన్సిల్ కాకూడదు. అందుకే బాధ దిగమింగుకుని, కన్నీళ్లు ఆపుకుని సీన్ పూర్తి చేశాను. 1993 ఆగస్టు 5న ‘మిష్టర్ పెళ్లాం’ రిలీజైంది. నా జీవితం తుత్తిగా సాగడానికి మార్గం ఏర్పడింది. నాకు ఈ పాత్ర ఎనలేని గుర్తింపునూ, స్థిరత్వాన్నీ తెచ్చిపెట్టింది. అందుకే ‘తుత్తి’ నా పాలిట అదృష్టం.
 (‘తుత్తి’ పాత్ర గురించి గతంలో ఏవీయస్ చెప్పిన మాటలు )

 
హిట్ క్యారెక్టర్

సినిమా పేరు: మిష్టర్ పెళ్లాం (1993); డెరైక్ట్ చేసింది: బాపు
సినిమా తీసింది: గవర పార్థసారథి; మాటలు రాసింది: ముళ్లపూడి వెంకటరమణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement