కమెడియన్‌గా తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేక పేరు సంపాదించుకున్నాడు ఏవీఎస్. ఆయన పూర్తి పేరు ఆమంచి వెంకటసుబ్రహ్మణ్యం. రంగస్థల కళాకారుడిగా, మిమిక్రీ ఆర్టిస్టుగా, జర్నలిస్టుగా పేరు తెచ్చుకున్న ఆయన మిస్టర్ పెళ్లాం చిత్రంతో నటుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. తొలి సినిమాతోనే నంది అవార్డు అందుకున్నాడు. మాయలోడు, మా విడాకులు, శుభలగ్నం, ఘటోత్కచుడు, శుభలగ్నం, యమలీల, సమరసింహారెడ్డి, ఇంద్ర, యమగోల మల్లీ మొదలైంది.. ఇలా ఎన్నో చిత్రాలు చేశాడు. దాదాపు 500 చిత్రాల్లో నటించి ప్రేక్షక హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాడు. 2013లో ఏవీఎస్ మరణించాడు.
ఇటీవలే అమ్మ కూడా..
తాజాగా ఏవీఎస్ (AVS) కూతురు శాంతి- అల్లుడు చింటూ ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా శాంతి (Comedian AVS Daughter Shanthi) మాట్లాడుతూ.. మా నాన్న 57 ఏళ్ల వయసులో మరణించాడు. అమ్మ 62 ఏళ్ల వయసులో (గతేడాది నవంబర్‌లోనే) కన్నుమూసింది. నిరంతరం షూటింగ్‌లోనే ఉంటూ నిద్రను పట్టించుకోకపోవడం వల్లే నాన్న ఆరోగ్యం దెబ్బతింది. కానీ బయటి వారు మాత్రం తాగడం వల్లే ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడని అపోహపడుతుంటారు.
మందు అలవాటే లేదు
మాది బ్రాహ్మణ కుటుంబం. నాన్న ఎగ్ కూడా తినేవారు కాదు. ఎగ్ ఉంటుందని కేక్ కూడా ముట్టుకోరు. సోడా కూడా పెద్దగా తాగకపోయేవారు. మందు జోలికి వెళ్లిందే లేదు. కానీ 2008లో నాన్న కాలేయం పాడైపోయింది. రక్తపు వాంతులు చేసుకున్నాడు. డాక్టర్స్ ఆయన్ను పరీక్షించి కాలేయం మార్పిడి చేయాలన్నారు. నేను కాలేయం ఇవ్వడానికి రెడీ అయ్యా.. కానీ లావుగా ఉన్నానని నాది సెట్టవదన్నారు.
(చదవండి: సౌత్ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం.. ఇప్పుడు దేశంలోనే టాప్!)
1% మాత్రమే బతికే ఛాన్స్
దాత దొరకాలంటే ఏడాది పడుతుందన్నారు. నాకేం అర్థం కాలేదు. ఏం చేయాలో తోచలేదు. ఇంతలో సడన్‌గా ఆయన జ్ఞాపకశక్తి కోల్పోయారు. మా అమ్మను కూడా గుర్తు పట్టలేదు. కేవలం నా ఒక్క పేరు మాత్రమే గుర్తుంది. నాన్న బతకడానికి ఒక్క శాతమే ఛాన్స్ ఉందన్నారు. ఆయన్ను ఐసీయూలో ఉంచి మమ్మల్ని ఇంటికి వెళ్లిపోమన్నారు. రాత్రంతా నిద్రపోకుండా దేవుడికి దండం పెట్టుకుంటూనే ఉన్నాం. తర్వాతి రోజు ఉదయం 6.30 గంటలకు నాన్న స్వయంగా కాల్ చేశాడు.
నా భర్తే ఒప్పించాడు
ఎవరూ రాలేదేంట్రా? ఇక్కడ నేను ఒక్కడినే ఉన్నాను అని మాట్లాడాడు. ఒక్క రాత్రిలో తనకు పోయిన జ్ఞాపకశక్తి ఎలా తిరిగొచ్చిందో అర్థం కాలేదు. అయితే 20 రోజుల్లో కాలేయం ఆపరేషన్ చేయాలన్నారు. దాతల కోసం వెతికేంత సమయం లేదని నేనే రెడీ అయ్యాను. నాకు ఆరోగ్య పరీక్షలు చేసి అంతా బాగుందన్నారు. కానీ, నాన్న ఒప్పుకోలేదు. భవిష్యత్తులో ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ వస్తాయమోనని సందేహించాడు. అప్పుడు నా భర్తే దగ్గరుండి తనను ఒప్పించాడు. ఆయన సరే చెప్పేందుకు వారం రోజులు పట్టింది.
(చదవండి: ఈ విషయం తెలిసుంటే 'బేబీ జాన్'లో నటించేదానినే కాదు: కీర్తి సురేష్)
ఆరు నెలలు విశ్రాంతి తీసుకోమంటే..
అలా నా కాలేయంలో 60 శాతం దానం చేశాను. ఆపరేషన్ తర్వాత నా శరీరంలో రక్తకణాల సంఖ్య పడిపోవడంతో ఒకరోజంతా అపస్మారక స్థితిలో ఉన్నాను. ప్లేట్‌లెట్స్ ఎక్కించడంతో కోలుకున్నాను. ఆపరేషన్ తర్వాత కనీసం ఆరు నెలలైనా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు నాన్నకు సూచించారు. కానీ ఆయన వింటేగా! ఆపరేషన్ అయిన రెండో నెలకే మళ్లీ పనిలో పడిపోయాడు. సరిగా విశ్రాంతి తీసుకోలేదు.
నా చేతిలో ప్రాణం పోయింది
కాలేయం పెరగడం కోసం దాదాపు నాలుగేళ్లు గ్యాప్ ఇచ్చాక పిల్లల్ని ప్లాన్ చేసుకున్నాం. నాకు పిల్లలు పుడతారో, లేదోనని నాన్న భయపడిపోయాడు. అలాంటిది నాకు పాప పుట్టగానే నాన్న సంతోషంతో ఏడ్చేశాడు. ఆపరేషన్ అయిన ఆరేళ్లకు నాన్న పరిస్థితి విషమించి నా చేతిలోనే రక్తం కక్కుకుని చనిపోయాడు. ఆపరేషన్‌కు రూ.65 లక్షలదాకా ఖర్చయింది. అప్పుడు తెలుగు ఇండస్ట్రీ (Tollywood) చాలా సపోర్ట్ చేసింది అని శాంతి చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment