ఎంతిచ్చినా ఓయూ రుణం తీరదుపేదింటి నుంచి అమెరికాకు వెళ్లాను..  | Donation by Alumni of OU College of Engineering | Sakshi
Sakshi News home page

ఎంతిచ్చినా ఓయూ రుణం తీరదుపేదింటి నుంచి అమెరికాకు వెళ్లాను.. 

Published Wed, Feb 28 2024 4:45 AM | Last Updated on Wed, Feb 28 2024 4:45 AM

Donation by Alumni of OU College of Engineering - Sakshi

ఇక్కడ చదివిన చదువే నా జీవితాన్ని మార్చేసింది.. 

అందుకే రూ.5 కోట్లు విరాళంగా ఇచ్చా 

ఓయూ పూర్వవిద్యార్థి గోపాల్‌ టీకే కృష్ణ 

ఉస్మానియా యూనివర్సిటీ: తండ్రి స్కూల్‌ టీచర్‌. అయినా..8 మంది కుటుంబ సభ్యుల కారణంగా పేదరికం..పస్తులు తప్పలేదు. ఇంటర్‌ వరకు కాళ్లకు చెప్పులు కొనుక్కునే పరిస్థితి కూడా లేదు. అయినా ఎక్కడా రాజీపడకుండా బాగా కష్టపడి చదువుకొని..లక్ష్యాన్ని సాధించి అమెరికాలో ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు ఓయూ ఇంజినీరింగ్‌ కాలేజీ పూర్వవిద్యార్థి గోపాల్‌ టీకే కృష్ణ.  77వ ఏట ఓయూలో తను చదివిన ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ విభాగం విద్యార్థుల తరగతి గది భవన నిర్మాణం కోసం రూ.5 కోట్ల విరాళాన్ని అందచేసి చరిత్ర సృష్టించారు.

107 ఏండ్ల ఓయూలో సుమారు కోటి మందికి పైగా విద్యార్థులు చదవుకున్నారు. దేశ ప్రధాని మొదలు సీఎంలు, మంత్రులు, ఇతర పెద్ద హోదాలలో స్థిరపడ్డారు. కానీ ఇంత వరకు ఎవరు కూడా వ్యక్తిగతంగా రూ.5 కోట్లను విరాళంగా ఇవ్వలేదు. గోపాల్‌ టీకే కృష్ణ తొలిసారి ఓయూకు రూ.5 కోట్ల చెక్కును అందచేసి ‘ఎంతిచ్చినా ఓయూ రుణం తీర్చుకోలేను. ఇక్కడ చదివిన చదువే నాకు ఎంతగానో తోడ్పడింది’ అని చెప్పడం ఆయన గొప్పతనానికి నిదర్శనం. 

పేదరికం నుంచి ఎదిగి.. 
గోపాల్‌ టీకే కృçష్ణ పూర్వీకులది ఏపీలోని ఏలూరు జిల్లా. కానీ  తమిళనాడులోని కోయంబత్తూరులో స్థిరపడ్డారు. కొన్నేళ్లు వారి కుటుంబం హైదరాబాద్‌లోని నారాయణగూడలో నివాసం ఉన్నారు. గోపాల్‌ కృష్ణ తండ్రి టీకే శ్రీనివాస చారి, తల్లి లక్ష్మీరాజమళ్‌. వీరికి 6 మంది సంతానం. అందులో నలుగురు అబ్బాయిలు. ఇద్దరు అమ్మాయిలు. శ్రీనివాసచారి తల్లిదండ్రులు కూడా కలిసి మొత్తం ఎనిమిది మంది కుటుంబ సభ్యులు ఒకే ఇంట్లో ఉండేవారు. శ్రీనివాస చారి అబిడ్స్‌లో మెథడిస్ట్‌ హైసూ్కల్‌లో టీచర్‌గా పని చేశారు.

రెండో సంతానం అయిన గోపాల టీకే కృష్ణ దేశ స్వాతంత్య్ర పోరాటం సమయంలో 1947, ఫిబ్రవరి 16న జమ్మించారు. ఆ సమయంలో  స్వాతంత్య్రం కోసం జరిగే ఉద్యమాలు, అల్లర్ల కారణంగా నారాయణగూడలోని ఇంటికి వెళ్లకుండా మెథడిస్ట్‌ స్కూల్‌లోనే 18 నెలల పాటు తలదాచుకున్నారు. తండ్రికి నెలకు రూ.270 వేతనం వలన కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. అయినా  కుటుంబంలో ముగ్గురు ఇంజినీర్లు, ఒకరు డాక్టర్‌ కోర్సు చదువుకొని విదేశాల్లో స్థిరపడ్డారు.  

నిజాం ట్రస్ట్‌ ఫండ్‌తో అమెరికాకు  
ఓయూ క్యాంపస్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసి 1969లో అమెరికాకు వెళ్లినట్లు గోపాల్‌ టీకే కృష్ణ తెలిపారు. సెమిస్టర్‌కు రూ.99 ఫీజు, నెలకు రూ.100  నేషనల్‌ ఫెలోషిప్‌తో సెమిస్టర్‌కు రూ.99 ఫీజుతో ఇంజినీరింగ్‌ పూర్తి చేసి, రూ.10 వేల అప్పుతో పాటు నిజాం ట్రస్ట్‌ ఫండ్‌ రూ.1500 ఆరి్థక సహాయంతో అమెరికాకు వెళ్లినట్లు చెప్పారు. తర్వాత రూ.5 లక్షలను నిజాం ట్రస్ట్‌కు తిరిగి  ఇచ్చినట్లు తెలిపారు.

రిపబ్లికన్‌ పార్టీ చైర్మన్‌గా.. 
అమెరికాలోని అయోవా స్టేట్‌లో రిపబ్లికన్‌ పార్టీకి మూడు సార్లు చైర్మన్‌గా ఎన్నికయినట్లు తెలిపారు. ఎనిమిది భాషలు తెలిసిన గోపాల్‌ కృష్ణ అయోవాలో కంపెనీ ప్రారంభించి అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చారు. తన ముగ్గురు కొడుకులు డీన్‌ లాయర్‌గా, గోల్డెన్‌ గూగుల్‌ ఉద్యోగిగా, ఆల్విన్‌ నిర్మాణ రంగంలో పని చేస్తున్నట్లు తెలిపారు. తన పిల్లలకు రూపాయి కూడా ఇవ్వకుండా ఓయూకు రూ.5 కోట్లను అందచేసినట్లు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement