‘మా తెలుగు తల్లికి’ లక్ష గళార్చన
బాపులపాడు (పెదపాడు), న్యూస్‌లైన్ : బాపులపాడు హైస్కూల్లో గురువారం తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రైవేట్ పాఠశాలల సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులతో మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీత లక్షగళార్చన నిర్వహించారు. మండలంలోని అప్పనవీడు, ఏపూరు, బాపులపాడు, వీరవల్లి గ్రామాలకు చెందిన 10 వేల మంది విద్యార్థులు పదిసార్లు గీతాన్ని ఆలపించి తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటారు. అనంతరం విశాలాంధ్ర మహాసభ నాయకుడు వాసిరెడ్డి వెంకటకృష్టారెడ్డి మాట్లాడుతూ సమైక్య రాష్ట్రం కోసం అందరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. దేశంలో హిందీ తరువాత అత్యధికులు మాట్లాడే భాష తెలుగేనని, ఒకే భాష.. ఒకే రాష్ట్రంగా ఉండాలని ఆకాంక్షించారు. ఎంఈవో లూథర్‌పాల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థుల తెలుగుతల్లి నృత్యరూపకం ఆకట్టుకుంది.