అనుకోని అతిథి... ఒబామా!
అనుకోని అతిథి వస్తే ఆ నందమే వేరు... ఆ వచ్చింది ఏకంగా ఓ దేశానికి ప్రెసిడెంట్ అయితే.. ఇక చెప్పాల్పిందేముంటుందీ? శాన్ ఫ్రాన్సిస్కో లోని గోల్ఫ్ కోర్స్ వెడ్డింగ్ లో అదే జరిగింది. స్టెఫానీ, బ్రియాన్ టోబ్స్ పెళ్ళికి... అనుకోకుండా వచ్చి.. ఏకంగా అమెరికా ప్రెసిడెంట్ ఒబామా సందడి చేయడం అక్కడి వారందరినీ ఆనందంలో ముంచెత్తింది.
కాలిఫోర్నియా పర్యటనలో ఉన్న ప్రెసిడెంట్ బారాక్ ఒబామా పుణ్యం, పురుషార్థం కలసి వస్తుందనుకున్నారో ఏమో... లాజొల్లాలోని టొర్రే పైన్స్ గోల్ఫ్ కోర్స్ లో ఉన్నట్టుండి ప్రత్యక్షమయ్యారు. మరి కాసేపట్లో పెళ్ళి ముహూర్తం దగ్గర పడుతుండగా... అమెరికా అధ్యక్షుడి రక్షణ సిబ్బంది హడావుడి మొదలు పెట్టారు. జరుగుతున్న కార్యక్రమం త్వరగా ముగించండి... లేదా కాసేపాగి జరుపుకోండి అంటూ హంగామా చేశారు. ఇంతట్లో అక్కడకు చేరిన ప్రెసిడెంట్ గారు వధూ వరులకు బ్లెస్సింగ్స్ చెప్పి, మంచి బహుమతిని అందజేశారు. అదే చేత్తో ఓ రౌండ్ గోల్ఫ్ ఆడి.. పెళ్ళివారిని ఆశ్చర్యంలో ముంచెత్తారు.
ముందుగా ఆ హడావుడి అంతా ఎందుకు జరుగుతోందో అర్థంకాని ఫొటో గ్రాఫర్లు.. సీక్రెట్ సర్వీసెస్ కు చెందిన రెండు ఎస్ యు వీలను చూసిన తరువాత వస్తున్నది ఎవరూ అన్న విషయం తెలిసిందని చెప్తున్నారు. మొత్తానికి అక్కడికి వచ్చిన ఆ అనుకోని అతిథి ఒబామా అందరితో ఫొటోలు దిగి, వధూవరులను ఆశీర్వదించారు. వివాహం ప్రతి దంపతులకు గుర్తుండిపోయే తీపి జ్ఞాపకం. అయితే స్టెఫానీ, బ్రియాన్ టోబ్స్ మాత్రం ఒబామా రాకను ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకం అంటూ ఆనందంతో చెప్తున్నారు.
అయితే గత సంవత్సరం గోల్ఫ్ కోర్స్ లో ఒబామాకోసం భద్రతా సిబ్బంది ఓ పెళ్ళిని బలవంతంగా ఆపడం... అప్పట్లో విమర్శలకు కూడ దారి తీసింది. ఆ తర్వాత వారి ఆనందానికి అడ్డొచ్చినందుకు సదరు అమెరికా అధ్యక్షుడు క్షమాపణలు కూడ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో ఘటన గుర్తుండిపోయిందో ఏమో.. ఒబామా ఈసారి పెళ్ళికి ఆటంకం కలగకుండా కాస్త జాగ్రత్త పడినట్లు కనిపిస్తోంది.