నెక్ట్స్ జేమ్స్ బాండ్ అతడేనా !.. మేకర్స్ ఏమంటున్నారంటే ?
జేమ్స్ బాండ్‌గా డేనియల్ క్రేగ్ నటించిన చివరి బాండ్ చిత్రం 'నో టైమ్ టు డై'. ఈ సిరీస్‌లో 25వ బాండ్ చిత్రంగా వచ్చిన ఈ సినిమాలో ఏజెంట్ బాండ్ చనిపోవడంతోపాటు చక్కని భావోద్వేగపు వీడ్కోలు ఇచ్చారు మేకర్స్. అయితే డేనియల్ తర్వాత జేమ్స్ బాండ్‌గా సందడి చేయనుంది ఎవరా అనే అంశం ఆసక్తిగా మారింది. అనేక మంది హాలీవుడ్ స్టార్స్ సైతం ఆ పాత్రను చేయాలని ఉత్సుకతతో ఉన్నారు. ఈ క్రమంలో తర్వాతి జేమ్స్ బాండ్‌గా 'మండేలా: లాంగ్ వాక్ టు ఫ్రీడమ్' యాక్టర్ 'ఇడిస్ ఎల్బా' (Idris Elba) నటించనున్నాడని ప్రచారం జరుగుతోంది.
ఈ విషయంపై జేమ్స్ బాండ్ ఫ్రాంచైజీ నిర్మాతలు బార్బరా బ్రోకలీ, మైఖేల్ జీ విల్సన్‌లు స్పందించారు. స్క్రీన్రాంట్కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నిర్మాతలు ఇలా చెప్పుకొచ్చారు. 'మాకు ఇడిస్ చాలా బాగా తెలుసు. మాకు అతను మంచి స్నేహితుడు. అలాగే అద్భుతమైన నటుడు. కానీ జేమ్స్ బాండ్ గురించి ఇలా మాట్లాడటం ఎప్పుడూ కష్టమే. మీకు తెలుసా. నో టైమ్ టు డై సినిమా విడుదల వరకు డేనియల్నే బాండ్‌గా నిర్ణయించుకున్నాం. అలాగే అతను బాండ్‌గా ఎంతగా అలరించాడో చూశాం. తర్వాత బాండ్ గురించి మేము ఇంకా ఎవరి గురించి ఆలోచించలేదు. ఎవరితో మాట్లాడలేదు.'
గతేడాదే తదుపరి జేమ్స్ బాండ్ తానే అనే పుకార్లకు చెక్ పెట్టాడు ఇడిస్. లండన్‌లో ఒక సంభాషణల మధ్య 'కాదు. నేను జేమ్స్ బాండ్‌ను కాను. మార్పును కోరుకున్నట్లయితే నలుపు, తెలుగు వంటి వర్ణం గురించి మాట్లాడనప్పుడే ఆ పాత్ర చేస్తాను.' అని ఇడిస్ తెలిపాడు. అయితే ఈ తర్వాతి బాండ్ కోసం నాన్-బ్రిటిష్ ఆర్టిస్ట్, బ్లాక్ ఆర్టిస్ట్‌ను తీసుకోనుట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తల నేపథ్యంలో ఇడిస్ అలా మాట్లాడి ఉండోచ్చని తెలుస్తోంది.