ఒబేసిటీ కౌన్సెలింగ్
లైపోసక్షన్, బేరియాట్రిక్... ఈ రెండు ఆపరేషన్లు బరువు తగ్గిస్తాయా? ఈ రెండూ ఒకే పని చేసేటప్పుడు రెండు ప్రక్రియలు ఎందుకు? ఒకవేళ తేడా ఉంటే అదేమిటి? కాస్త వివరించండి.
- రమణ, కర్నూలు
లైపోసక్షన్, బేరియాట్రిక్... ఈ రెండూ వేర్వేరు ప్రక్రియలు. ఇందులో లైపోసక్షన్ శరీర అందాన్ని మెరుగుపరచుకోడానికి చేసే ప్రక్రియ. అయితే ఇది స్థూలకాయ సమస్యను పరిష్కరించలేదు. ఈ విధానం వల్ల శరీరం తను కొవ్వు సెట్ చేసుకునే పాయింట్లో మార్పు ఉండదు. అందువల్ల లైపోసక్షన్ ప్రక్రియ ద్వారా శాశ్వతంగా బరువు తగ్గడం సాధ్యం కాదు. అయితే బేరియాట్రిక్ సర్జరీ... తీవ్ర స్థూలకాయ సమస్యతో బాధపడుతున్నవారు శాశ్వతంగా బరువు తగ్గడానికి చేసే ఆపరేషన్.
ఒకసారి తీవ్రమైన స్థూలకాయం వస్తే కేవలం ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం ద్వారానే బరువు తగ్గడం సాధ్యం కాదు. మొదట్లో కొంచెం బరువు తగ్గినప్పటికీ, శరీరంలోని ‘కొవ్వు సెట్ పాయింట్’ను నియంత్రించే హార్మోన్ల ప్రభావం కారణంగా, ఆర్నెల్ల నుంచి ఐదేళ్ల లోపల కోల్పోయిన బరువు తిరిగి పెరుగుతారు. లావుగా ఉన్నవారు శాశ్వతంగా బరువు తగ్గడానికి శాస్త్రీయంగా రుజువైన, సురక్షితమైన ప్రక్రియ బేరియాట్రిక్ సర్జరీ. ఇందులో బరువు తగ్గడానికి అసలు కారణం... కొవ్వును నియంత్రించే హార్మోన్లలో మార్పులు వచ్చి శరీరంలోని ‘కొవ్వు సెట్ పాయింట్’ తగ్గడమే. స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ, గ్యాస్ట్రిక్ బైపాస్, స్లీవ్ బైపాస్, డియోడినల్ స్విచ్ వంటి డైవర్షన్ పద్ధతుల తర్వాత గ్రెలిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గడం, జీఎల్పీ-1, పెప్టైడ్ వైవై మొదలైన హార్మోన్ల ఉత్పత్తి పెరగడం వల్ల శరీరంలోని ‘కొవ్వు సెట్ పాయింట్’ తగ్గుతుంది. ఫలితంగా ఆకలి తగ్గుతుంది. ఆరోగ్యకరమైన ఆహారపదార్థాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మెటబాలిజం పెరుగుతుంది. కాబట్టి శాశ్వతంగా బరువు తగ్గుతారు.
డాక్టర్ వి.అమర్
బేరియాట్రిక్ సర్జన్,
సిటిజన్స్ హాస్పిటల్,
నల్లగండ్ల, హైదరాబాద్