పురుడుకని వెళ్తే.. ప్రాణం తీశారు!
డాక్టర్‌కు బదులు కాన్పు చేసిన నర్సులు..
- పురుడు పోసిన వెంటనే శిశువు మృతి
- సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటున్న బంధువులు
- తల్లి పరిస్థితి విషమం
చిన్నచింతకుంట: స్థానిక ప్రాథమిక వైద్యశాలలో నర్సులే డాక్టర్ అవతారమెత్తారు. ఈ క్రమంలో శుక్రవారం ఓ గర్భిణికి ప్రసవం చేయగా.. శిశువు చనిపోవడంతోపాటు తల్లి పరిస్థితి విషమంగా మారింది. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన ఉమారాణి మొదటి కాన్పు కోసం ఉదయం ఆస్పత్రికి వచ్చింది. ఓ సీనియర్ నర్సు ఉమారాణికి కాన్పు చేసింది. మధ్యాహ్నం 2గంటల తరువాత మగ శిశువు జన్మిం చాడు. వెంటనే శిశువు మృతి చెందాడు. ఈ విషయం ఉమారాణికి తెలియకుండా చూశారు. కాన్పు చేసిన నర్సు ఇంటికి వెళ్లిపోయింది. శిశువు మృతిని ఆలస్యంగా గమనించిన బంధువులు లబోదిబోమన్నారు. ఇంతలోనే బాలింత ఆరోగ్యం కూడా బాగలేకపోవడంతో ఆస్పత్రి సిబ్బంది తీరుపై మండిపడ్డారు. విషయం గ్రామస్తులకు తెలియడంతో రాత్రి 8 గంటలకు పెద్ద ఎత్తున ఆస్పత్రికి చేరుకున్నారు.
ఈ ఆస్పత్రికి డాక్టర్ లేడు
చిన్నచింతకుంట ప్రభుత్వ ఆస్పత్రిలో ఇద్దరు డాక్టర్లు ఉండేవారు. నెల క్రితం డాక్టర్ సంధ్యారాణిని బాదేపల్లికి బదిలీ చేశారు. మరో డాక్టర్ రాఘవేంద్రను ఆత్మకూర్‌కు బదిలీ చేశారు. అప్పటినుంచి కొత్త డాక్టర్‌ను ఎవరినీ నియమించలేదు. నర్సులే ఆస్పత్రికి వచ్చిన రోగులకు తెలిసిన వైద్యం చేస్తూ నెట్టుకొస్తున్నారు.
ఇలాంటి ఆస్పత్రి మాకొద్దు
డాక్టర్ లేని ఆస్పత్రి మాకొద్దంటూ బాధితురాలి బంధువులు ఆందోళనకు దిగారు. కొత్తగా డాక్టర్లని నియమించకపోవడంతోనే ఘటన జరిగిందన్నారు. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఘటన జరిగింద న్నారు. ఉన్నతాధికారులనుంచి హామీ వచ్చేవరకు ఆందోళన విరమించేది లేదన్నారు. స్థానిక ఎస్ఐ ఆస్పత్రికి చేరుకుని బాధితులకు సర్దిచెప్పారు.