నాపై కుట్ర
నాపై కుట్ర పన్నుతున్నారని నటి లక్ష్మీమీనన్ ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ కేరళ కుట్టి ఆరోపణలకు అర్థం లేకపోలేదు. ఇటీవల నటీమణుల ముఖాల మార్ఫ్‌తో కూడిన బాత్రూమ్ సన్నివేశాలు నెట్లో హల్చల్ చేస్తున్న సంస్కృతి అధికం అవుతోంది. ఈ వ్యవహారంలో నటి లక్ష్మీమీనన్ బాధితురాలే. ఆమె స్నానాల గదిలోని సన్నివేశాలు సోషల్ నెట్వర్కులో హల్చల్ చేస్తున్నాయి. దీనిపై స్పందించిన నటి లక్ష్మీమీనన్ తనపై కుట్ర పన్నుతున్నారని ఆరోపణ చేశారు.
కుంకీ చిత్రం నుంచి ఇప్పటి వరకు తనపై ఇలాంటి దుష్ర్పచారానికి ఎవరూ పాల్పడలేదన్నారు. ప్రస్తుతం కార్తీ సరసన నటిస్తున్న కొంభన్ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోందన్నారు. తదుపరి పలు అవకాశాలు వచ్చినా నిరాకరిస్తున్నానని తెలిపారు. కారణం ప్రస్తుతం తాను ప్లస్-2 పరీక్షలకు సిద్ధం అవుతున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని తాను కొంభన్ చిత్ర నిర్మాతలకు ముందే చెప్పి షూటింగ్ మధ్యలో పరీక్షలకు వెళ్లిపోవడానికి అనుమతి పొందానన్నారు.
అదే విధంగా తానిప్పుడు ప్లస్-2 పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నట్లు తెలిపారు. ఇలాంటి సమయంలో తనదృష్టిని మరల్చడానికే ఇలాంటి తన ఫొటోలతో కూడిన మార్ఫింగ్ బాత్రూమ్ సన్నివేశాలను నెట్లో ప్రచారం చేస్తూ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. అయినా ఇలాంటి చీప్ ట్రిక్స్‌ను తానేమీ లెక్కచేయనని అయితే పరీక్షలు పూర్తి అయిన తరువాత దీనిపై దృష్టి సారించి కుట్ర దారులెవరన్నది కనిపెట్టి తగిన బుద్ధి చెబుతానని ఆవేశంగా అంటున్నారు లక్ష్మీమీనన్.