భక్తజనవరం
సర్పవరం (కాకినాడ రూరల్):నాల్గో మాఘపాదివారం సందర్భంగా ఆదివారం సర్పవరం భావనారాయణస్వామి ఆలయానికి భారీ ఎత్తున భక్తజనం తరలివచ్చారు. తెల్లవారు జామునుంచే పాతాళ భావనారాయణస్వామిని దర్శించుకోడానికి భక్తులు బారులు తీరారు. ఉత్తర ద్వారదర్శనం కల్పిస్తున్నట్టు ఆలయవర్గాలు ప్రకటించడంతో ఆలయం కిటకిటలాడింది. మూడు అర్చామూర్తులైన భావనారాయణస్వామి వార్లు ఒకేప్రాంగణంలో కొలువై ఉండడం మరెక్కడా లేకపోవడంతో వేలాది భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు, అభిషేకాలు చేశారు. మొక్కులున్న భక్తులు ఆలయం ఎదురుగా ఉన్న నారద గుండంలో పుణ్య స్నానమాచరించి స్వామిని దర్శించుకున్నారు. అధికసంఖ్యలో మహిళలు ఆలయ ప్రాంగణంలో పాలు పొంగించి సూర్యనమస్కారాలు చేశారు. మరి కొందరు కొత్త పాత్రల్లో తీపి వంటకాలను చేసి స్వామికి నైవేద్యాలు సమర్పించుకున్నారు. ఆలయ ఉత్సవ కమిటీ 25 వేల మంది భక్తులకు అన్నదానం చేసింది. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణమూర్తి దంపతులు, రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, ఎంపీపీ పుల్ల సుధాచందు, జెడ్పీటీసీ సభ్యురాలు కాకరపల్లి సత్యవతి, ఆలయ ఉత్సవకమిటీ చైర్మన్ పుల్లా చక్రరావు, పుల్ల ప్రభాకరరావు దంపతులు వడ్డన చేశారు.
పర్యాటక కేంద్రంగా తీర్చుదిద్దుతా
సర్పవరం భావనారాయణస్వామి ఆలయ ప్రాంతాన్ని ప్రత్యేక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్టు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక విశ్రాంతి గదులు ఏర్పాటు చేశారని, రానున్న రోజుల్లో అన్ని హంగులతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. గ్రామపెద్దలు, ఉత్సవకమిటీ సభ్యులుభక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేశారు. ఉత్సవ కమిటీ సభ్యులు భక్తులకు తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు పంచారు.