పటేళ్లను బీసీల్లో చేరిస్తే అంతర్యుద్ధమే
రిజర్వేషన్లు ఎత్తివేయడానికి కుట్ర చట్టసభల్లో రిజర్వేషన్లు సాధించి తీరుతాం: ఆర్.కృష్ణయ్య
హైదరాబాద్: ఓబీసీ రిజర్వేషన్లను ఎత్తివేయాలని కోరుతున్న పటేళ్లకు రిజర్వేషన్లు కోరే నైతిక అర్హత లేదని జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య మండిపడ్డారు. శనివారం హైదరాబాద్ అబిడ్స్‌లోని తాజ్‌మహల్ హోటల్లో బీసీ సంక్షేమ సంఘం జాతీ య సెక్రటరీ జనరల్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు అధ్యక్షతన జాతీయ ఓబీసీ కుల సంఘాల ప్రతినిధుల మహాసభ నిర్వహించా రు. ఈ సభకు 12 రాష్ట్రాల నుంచి సుమారు 300 మంది కులసంఘ ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాలలో దేశవిదేశాల్లో ఆధిపత్యాన్ని కొనసాగి స్తున్న పటేళ్లు ఎలా రిజర్వేషన్లకు అర్హులో చెప్పాలన్నారు. ప్రైవేటు రంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కావాలని కోరుతున్న సమయంలో దానికి భిన్నంగా రిజర్వేషన్లే ఎత్తివేయాలనే కుట్రతో అగ్రకుల పారిశ్రామికవేత్తలు పటేళ్ల ఓబీసీ కోటా ఉద్యమాన్ని ముందుకు తెచ్చారని కృష్ణయ్య మండిపడ్డారు.
ఇలాంటి కుట్రలను ఎంత మాత్రం సహించబోమని జాతీయ స్థాయిలో బలమైన ఉద్యమాన్ని బలోపేతం చేస్తామన్నారు. చట్టసభల్లో బీసీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు సాధించే వరకు విశ్రమించబోమని ఆయన తెలిపారు. జాతీయ స్థాయిలో ‘రాష్ట్రీయ ఓబీసీ అరక్షణ్ బచావో ఆందోళన్’ పేరిట బలమైన ఉద్యమాన్ని చేపట్టి ఛలో ఢిల్లీ ఆందోళనతో ఉన్నత వర్గాల వారికి తగిన గుణపాఠం నేర్పుతామన్నారు.
కర్ణాటక రాష్ట్ర ఓబీసీ సంఘటన్ అధ్యక్షుడు, మాజీ మంత్రి జేడీ. పుట్టస్వామి మాట్లాడుతూ ఉద్యమంలో తామూ పాల్గొంటామన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు సమన్వయ కర్త గుజ్జ కృష్ణ, ప్రజా గాయకురాలు విమలక్క, తెలంగాణ బీసీసంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌యాదవ్, అఖిల భారత గాండ్ల, తైలిక్ సాహు నాయకుడు పి. రామకృష్ణయ్య, సామాజిక తత్వవేత్త బి.ఎస్. రాములు, పలు రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు.
కృష్ణయ్య జన్మదినాన సేవా కార్యక్రమాలు
బీసీ ఉద్యమనేత ఆర్. కృష్ణయ్య పుట్టినరోజు సందర్భంగా ఆదివారం వివిధసేవా కార్యక్రమాలను చేపట్టనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. కృష్ణయ్య పుట్టినరోజును బీసీ కులసంఘాలు, బీసీ శ్రేణులు ‘బీసీడే’గా గుర్తించి సేవా కార్యక్రమాలను చేపట్టాలని కోరారు.