ఇదేం ‘పరీక్ష’ !
బీసీ గురుకుల గెస్ట్‌టీచర్ల స్క్రీనింగ్ టెస్ట్‌లో గందరగోళం
సకాలంలో అందని ప్రశ్నపత్రాలు
సెంటర్ల మార్పుతో ఉరుకులు పరుగులు
భగీరథ కాలనీ(మహబూబ్‌నగర్): బీసీ గురుకుల గెస్ట్ టీచర్ల స్క్రీనింగ్ టెస్ట్‌లో శుక్రవారం గందరగోళ పరిస్థితి నెలకొంది. మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల పరిధిలోని మంజూరైన 12 బీసీ గురుకులాలతోపాటు గతంలో ఉన్న బీసీ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో గెస్ట్ టీచర్లను భర్తీ చేసేందుకు నిర్ణయించారు. దీంతో సబ్జెక్టు వారీగా భర్తీ చేసేందుకు మహత్మా జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల గురుకుల విద్యాలయల సంస్థ శుక్రవారం స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించింది.
నాలుగు జిల్లాల పరిధిలో సుమారు 2,437 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని 10 సెంటర్లలో పరీక్ష నిర్వహించేం దుకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు పరీక్షను నిర్వహించేందుకు అధికారులు నిర్ణయించారు. అయితే, ప్రశ్నపత్రాలు అందకపోవడంతో 11.30 గంటలు దాటినా ప్రారంభించలేదు.
స్థానికన్యూరిషి విద్యాలయంలోని పరీక్ష సెంటర్‌కు మధ్యాహ్నం 12.00 గంటల వరకు ప్రశ్నపత్రాలు అందకపోవడంతో అభ్యర్థులు టెస్ట్‌ను రాయలేకపోయారు. హాల్టికెట్లలో తప్పులు దొర్లడంతో అభ్యర్థులు పరీక్ష కేంద్రాల చుట్టూ ఉరుకులు పరుగులు తీశారు. దీంతో దాదాపు 300 మంది అభ్యర్థులు అధికారుల తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తూ కలెక్టరేట్‌ను ముట్టడించారు. జేసీ హామీతో అభ్యర్థులు ఆందోళన విరమించారు.