బీసీ సబ్‌ప్లాన్ చట్టం చేయాలి : రమణ
నల్లగొండ టౌన్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ సబ్‌ప్లాన్ చట్టం చేయాలని దీని వల్ల కల్లుగీత కార్మికుల జీవనం మెరుగుపడుతుందని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.వి.రమణ అన్నారు. బుధవారం స్థానిక దొడ్డి కొమురయ్య భవన్లో జరిగిన సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ లక్షా 15 వేల కోట్ల రూపాయల రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు కేవలం రూ. 2,179 కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. దాంట్లో కల్లుగీత కార్పొరేషన్‌కు రూ. 9 కోట్లు మాత్రమే కేటాయించడం వల్ల గీత కార్మికుల అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. కల్లుగీత కార్పొరేషన్‌కు కనీసం రూ. 1000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.
గుడుంబాను అరికట్టడానికి చీఫ్ లిక్కర్‌ను ప్రజలకు చేరువ చేస్తామని ప్రభుత్వం చెప్పడం సిగ్గుచేటన్నారు. మద్యపాన విధానం కల్లుగీత కార్మికుల పొట్టలు కొట్టే విధంగా ఉందని, వేలం పాటల విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వమే కొన్ని దుకాణాలు నిర్వహించాలన్నారు. సంఘం జిల్లా కార్యదర్శి మాటూరి బాలరాజుగౌడ్ మాట్లాడుతూ కల్లుగీత వృత్తిలో ప్రమాదానికి గురైన వారి కుటుంబాలకు రూ. 5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం హర్షణీయమన్నారు. సమావేశంలో నాయకులు బీమాగాని శ్రీనివాస్, రాచకొండ వెంకట్‌గౌడ్, పొట్ట నగేష్, ఎ.గోవింద్, పి.అచ్చాలు తదితరులు పాల్గొన్నారు.