అన్నింటికీ అవతలికే..
ఆదిలాబాద్/ఆదిలాబాద్‌టౌన్, న్యూస్‌లైన్ : ‘డీఈవో, ఆర్వీఎం జిల్లా కార్యాలయాలు ఉన్న జిల్లాకేంద్రంలోని గెజిటెడ్ నెంబర్ 1 ప్రభుత్వ పాఠశాలో 600లకుపైగా విద్యార్థులు చదువుతున్నారు. ఆదిలాబాద్‌లో పురాతన పాఠశాలల్లో ఇదొక్కటి. ప్రస్తుతం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న బి.చంద్రకుమార్ కూడా ఇదే పాఠశాలలో చదువుకున్నారు. అంతటి చరిత్ర ఉన్న ఈ పాఠశాలలో ఇంతవరకు విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు లేవు. దీంతో వారు బయటకు వెళ్లాల్సి వస్తోంది. జిల్లాలోని అనేక పాఠశాలల్లో ఇదే దుస్థితి నెలకొంది.’ జిల్లాలో దాదాపు 4 వేల పాఠశాలలుండగా.. అందులో 2.60 లక్షలకు పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తునానరు. వీరందరికీ మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత రాజీవ్ విద్యామిషన్, ఆర్డబ్ల్యూఎస్ శాఖలకు అప్పగించినా.. వారు పట్టించుకోవడంలేదు. ఏ పాఠశాలలో ఎన్ని ఉన్నాయో కూడా వారికే తెలియడం లేదు.
కాకి లెక్కలు..
2011-12 విద్యా సంవత్సరంలో 1,114 మం జూరు కాగా 1,054 మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేసినట్లు, 60 నిర్మాణ దశలో ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. క్షేత్రస్థాయిలో మాత్రం వాటి వినియోగం అంతంత మాత్రంగానే ఉంది. 2012-13 విద్యా సంవత్సరంలో వైకల్యం గల విద్యార్థుల సౌకర్యార్థం 261 మంజూరు కాగా 24 పూర్తయ్యాయి. 105 నిర్మాణ దశలో, 132 ఇంకా ప్రారంభం కానట్లు ఆర్వీఎం అధికారులు పేర్కొంటున్నారు. అలాగే జిల్లాలో మొత్తం పాఠశాలలు కలిపి 3,534 మరుగుదొడ్లు ఉన్నాయని, మరో 4,235 మరుగుదొడ్లు అవసరం ఉన్నట్లు ఆయా మండల విద్యాధికారులు పేర్కొంటున్నారు.
పెరుగుతున్న విద్యార్థినుల డ్రాపౌట్లు..
పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కరువవ్వడంతో విద్యార్థినులు అనేక అవస్థలు పడుతున్నారు. పాఠశాలల్లో మూత్రశాలలు, మరుగుదొడ్లు లేక విద్యార్థినులు సక్రమంగా పాఠశాలలకు రాలేకపోతున్నారు. మరికొంత మంది పాఠశాల రావడం మానేస్తున్నారు. పాఠశాల వేళల్లో విద్యార్థినులు మరుగుదొడ్లు వినియోగించాల్సి వస్తే ఆరుబయటే పోవాల్సిన పరిస్థితి. కొన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు ఉన్నా అవి శిథిలావస్థకు చేరడం, మరికొన్ని నిరుపయోగంగా ఉండడంతో విద్యార్థినులకు ఇబ్బందులు తప్పడం లేదు. మరికొన్ని పాఠశాలల్లో మరుగుదొడ్ల వద్ద పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగాయి. అందులో విషపురుగులు ఉంటాయనే భయాందోళనతో వాటిని వినియోగించడం లేదు. ఉన్న కొన్ని మరుగుదొడ్లలో నీటి వసతి లేవు. దీంతో అవి కూడా నిరుపయోగంగానే ఉంటున్నాయి.