‘టీ’కి గుజరాత్ పాలు
అక్కడి రైతుల నుంచి సేకరించి.. ఇక్కడ అమ్మకాలు
* తెలంగాణ పాడి రైతుపై తీవ్ర ప్రభావం
* వచ్చేనెల 4 లేదా 10 నుంచి ‘అమూల్ బ్రాండ్’తో మార్కెట్లోకి
* అడ్డుకోవాలని ప్రభుత్వానికి విజయ డెయిరీ ఎండీ విన్నపం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గుజరాత్ పాలు ‘పొంగి’పొర్లనున్నాయి. ఆ రాష్ర్టం లోని రైతుల నుంచి సేకరించిన పాలను హైదరాబాద్‌లో విక్రయించాలని గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ (జీసీఎంఎంఎఫ్) నిర్ణయించింది. వచ్చే నెల 4 లేదా 10వ తేదీ నుంచి విక్రయాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకుంది. మొదటగా 50 వేల లీటర్లతో ప్రారంభించి రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలనేది జీసీఎంఎంఎఫ్ లక్ష్యంగా కనిపిస్తోంది.
పాల సరఫరాకు టెండర్లు ఆహ్వానించిన ఆ కంపెనీ నాచారం సమీపంలోని మల్లాపూర్‌లో కార్యాలయాన్ని ప్రారంభించింది. గుజరా త్ నుంచి ట్యాంకర్ల ద్వారా తీసుకొచ్చిన పాలను ప్యాకింగ్ చేసేందుకు నల్లగొండ-రంగారెడ్డి మి ల్క్ యూనియన్ (నార్మాక్)తో జీసీఎంఎంఎఫ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ప్రకారం హయత్‌నగర్‌లో ఉన్న యూనిట్లో ప్యాకింగ్ చేసి వినియోగదారులకు సరఫరా చేయనున్నారు.
రాష్ట్ర రైతులకు శరాఘాతం...
తెలంగాణలో ప్రస్తుతం రోజుకు 20 లక్షల లీటర్ల పాలు సరఫరా అవుతున్నాయి. అందులో విజయ డెయిరీ వాటా 4.5 లక్షల లీటర్లు మాత్రమే. మిగిలినదంతా ప్రైవేటు డెయిరీలే సరఫరా చేస్తున్నాయి. ప్రైవేటు డెయిరీల ఆధిపత్యం మూలంగా దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో పాల ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయాయి. డీలర్లకు, రైతులకు కమిషన్లు ఎక్కువగా ఇచ్చి ప్రభుత్వ ఆధ్వర్యంలోని విజయ డెయిరీని మూలన పడేశారు.
దీంతో విజయ డెయిరీకి పాలు పోసే రైతులు తగ్గిపోవడంతో లక్షన్నర లీటర్లను కర్ణాటక సహా ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేస్తున్నారు. పరిస్థితిని గమనించిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా రైతులకు పాల సేకరణ ప్రోత్సాహం కింద లీటరుకు రూ. 4 అదనంగా ఇస్తుండడంతో ఇటీవలే విజయ డెయిరీకి ప్రాణం పోసినట్లయింది. అయితే ఇప్పుడు గుజరాత్ పాలు రాష్ట్రంలోకి అడుగుపెడితే ప్రధాన ప్రభావం విజయ డెయిరీపైనే పడుతుంది.
పైగా ఎక్కువ కమిషన్ ఇస్తామని విజయ డెయిరీ డీలర్లకే జీసీఎంఎంఎఫ్ వారు గాలం వేస్తున్నారు. మరోవైపు నేరుగా గుజరాత్ రైతుల పాలనే ఇక్కడ అమ్మాలని నిర్ణయించడం వల్ల మన చిన్న సన్నకారు రైతులు ఉత్పత్తి చేసే పాలకు గిరాకీ లేకుండా చేసే కుట్ర జరుగుతోందన్న విమర్శలు వస్తున్నాయి. ఇదే గుజరాత్ సంస్థ అమూల్ బ్రాండ్ మహారాష్ట్రలో అడుగుపెట్టాక అక్కడి ప్రభుత్వ పాల సహకార సంస్థ ‘గోకుల్’ నిర్వీర్యం అయిందని అధికారులు అంటున్నారు.
అమూల్ బ్రాండ్‌ను అడ్డుకోండి...
గుజరాత్ ప్రభుత్వానికి చెందిన అమూల్ బ్రాండ్ పాలను రాష్ట్రంలోకి రానీయకుండా అడ్డుకోవాలని విజయ డెయిరీ అధికారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విజయ డెయిరీ ఎండీ శ్రీనివాస్ ఈ మేరకు లిఖిత పూర్వకంగా విన్నవించినట్లు తెలిసింది. గుజరాత్ అమూల్ బ్రాండ్ పాలు రాష్ట్రంలోకి అడుగుపెడితే ఇక్కడి పాడి రైతులకు కష్టాలు తప్పవని పేర్కొన్నట్లు సమాచారం. మ్యూచువల్లీ ఎయిడెడ్ సహకార సొసైటీలో ఉన్న నార్మాక్ యూనిట్ ప్రభుత్వ డెయిరీకి చెందిన 72 ఎకరాల స్థలంలోనే ఉంద ని.. ఈ నేపథ్యంలో గుజరాత్‌తో ఆ సంస్థ ఒప్పందం కుదుర్చుకోవడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు.
అమూల్ పాల కారణంగా తెలంగాణ రైతులకు నాణ్యమైన ధర రాదని.. మొత్తం వ్యవస్థ వారి చేతుల్లోకి పోతుందని విజయ డెయిరీ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి వి.అశోక్, అధ్యక్షుడు మోహన్‌మురళీ అన్నారు. గుజరాత్లో సేకరించిన పాలను ఇక్కడకు తరలించాలంటే లీటరుకు రూ. 3.50 అవుతుందని.. మున్ముందు పాల ధరలు పెరిగే ప్రమాదం పొంచి ఉందని వారు అభిప్రాయపడ్డారు.