ఆ వరుసలో ఇపుడు వెంకటేష్
హైదరాబాద్: టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా సినిమాల కోసం ప్రయోగాలు చేయడం, బరువు పెరగడం తగ్గడం చాలా కామన్‌గా మారిపోయింది. దీనికోసం పస్తులు ఉండడం, కసరత్తులు చేయడం మామూలే. ఆయా పాత్రల్లో ఒదిగిపోయేందుకు నటీనటులు ఎంతటి రిస్క్ చేయడానికైనా వెనకడుగు వేయట్లేదు. ఇప్పుడు ఈ కోవలోకి టాలీవుడ్ హీరో వెంకటేష్ కూడా చేరిపోయారు. తెలుగు దర్శకురాలు సుధ కొంగర దర్శకత్వంలో రూపుదిద్దుకోబోతున్న ఓ మూవీ కోసం ఆయన భారీగా బరువు పెరగనున్నారని సమాచారం.
మాధవన్ హీరోగా హిందీలో సూపర్ హిట్ అయిన 'సాలా ఖుదూస్' రీమేక్ లో నటిస్తున్న వెంకీ ఈ మూవీకి అనుగుణంగా తన బాడీని మలుచుకోకున్నారట. ఒక బాక్సర్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలోని పాత్రకు న్యాయం చేసేందుకు బరువు పెరగాలని నిర్ణయించారట. దీనికోసం ఆయన భారీ కసరత్తులే చేయనున్నట్టు తెలుస్తోంది. తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి విడుదలైన సాలా ఖుదూస్ చిత్రంలో మాధవన్ ఓ బాక్సర్‌గా, బాక్సింగ్ కోచ్‌గా చేసిన అద్భుత నటన పలువురి ప్రశంసలందుకుంది. దీనికి దీటుగా తెలుగు రీమేక్ తీర్చిదిద్దేందుకు పక్కా ప్లాన్‌తో ముందుకువెళుతున్నాడట వెంకటేష్. 'దృశ్యం' ఇచ్చిన భారీ హిట్‌తో మాంచి కిక్ మీదున్న వెంకీ ప్రస్తుతం మారుతి డైరక్షన్ లో 'బాబు బంగారం' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
కాగా తెలుగు సినిమా దిగ్గజ నటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కూడా ఆయా పాత్రల కోసం ప్రయోగాలు చేసినవారే. ప్రస్తుత హీరో హీరోయిన్లు కూడా సాహసాలకు సిద్ధపడుతున్నారు. సాలా ఖుద్దూస్ కోసం మాధవన్, పీకే సినిమా కోసం అమీర్ ఖాన్, సరభ్ జిత్ సింగ్ సినిమా కోసం రణదీప్ హూడా, నేను శైలజ సినిమా కోసం హీరో రామ్, సైజ్ జీరో కోసం అనుష్క, బాహుబలి కోసం ప్రభాస్, రానా.. ఇలా చాలామంది రకరకాల ప్రయోగాలతో వార్తల్లో నిలిచినవారే.