జర్నలిస్టును చితకబాదిన భద్రతా దళాలు
దొంగ అనుకుని ఓ ఇంగ్లీషు పత్రికలో పనిచేసే పాత్రికేయుడిని భద్రతా దళాల సిబ్బంది చితక్కొట్టారు. ఈ సంఘటన మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లోని కాంగ్లా పశ్చిమ గేటు వద్ద జరిగింది. 'ఇంఫాల్ ఫ్రీ ప్రెస్' పత్రికలో రిపోర్టర్‌గా పనిచేస్తున్న అరిబమ్ ధనంజయ్ అలియాస్ చావోబాను ఇండియా రిజర్వ్ బెటాలియన్ సిబ్బంది కొట్టారు. అతడు రాత్రి 11.30 గంటల సమయంలో ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. తాను పాత్రికేయుడినని అతడు భద్రతా దళాల సిబ్బందికి చెప్పినా, రాత్రిపూట దొంగలా తిరుగుతున్నాడంటూ అతడిని కొట్టారు.
తర్వాత జేఎన్ ఆస్పత్రికి తరలించి, ప్రాథమిక చికిత్స చేయించి పంపేశారు. అయితే జరిగిన సంఘటనపై స్పందించేందుకు ఐఆర్బీపీ సిబ్బంది అందుబాటులో లేరు. అనంతరం చావోబా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చావోబాపై దాడిని ఆల్ మణిపూర్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ ఖండించింది. భద్రతా దళాల సిబ్బంది తాగేసి తరచు పాత్రికేయులపై దాడులు చేస్తున్నారని, వాటిని నివారించాలని కోరింది.