సొగసు చూడతరమా!
సాక్షి: స్వచ్ఛమైన గాలి, పచ్చదనం నిండిన పరిసరాలు, అలల హోరు, తెల్లటి ఇసుక తెన్నెలు, నిర్మలమైన నీలాకాశం, నీటిలో తేలియాడుతున్నట్లుండే కొండలు, నీటి అడుగు నుంచి పలకరించే జలచరాలు.. హుషారెత్తించే బోటింగ్, థ్రిల్లింగ్ అందించే స్విమ్మింగ్ ఇవన్నీ మిమ్మల్ని మరోలోకానికి తీసుకెళ్తాయి. ఇంతటి వైవిధ్యమైన ప్రకృతి అందాలకు చిరునామా ఫిఫి దీవులు. ఈ దీవుల్లోని ప్రకృతి రమణీయతను ఎంత వర్ణించినా తక్కువే అవుతుందనడం అతిశయోక్తి కాదు. మరి ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఫిపి దీవుల అందాలు, విశేషాల గురించి తెలుసుకుందామా?
ఫిఫి ఐలాండ్స్ ఆరు ద్వీపాల కలయిక. వాటిలో రెండు పెద్ద ద్వీపాలు. మిగిలిన నాలుగు కేవలం బీచ్‌లకు ప్రత్యేకం. ఇవి థాయ్‌లాండ్‌కు దక్షిణాన ఉన్నాయి. స్వచ్ఛతకు మారుపేరైన అండమాన్ సముద్రంలో ఉండటం వల్ల ఇవి మరింత ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ముఖ్యంగా సేదతీరడానికి పేరుగాంచిన ఈ దీవులు థాయ్లాండ్లోనే కాక ప్రపంచంలోనే అందమైన దీవులుగా ప్రసిద్ధి చెందాయి.
ప్రత్యేక అనుభూతి..
బీచ్ ఒడ్డున ఈత కొట్టే రంగు రంగుల చేపలను చూస్తూ చెక్క కుర్చీలో శీతల పానీయాలు తాగుతూ సేదతీరడం నిజంగానే ఒక ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది. బీచ్‌లను స్వచ్ఛంగా ఉంచడం అంత సులువైన విషయం కాదు. ఆ విషయంలో ఈ బీచ్ నిర్వాహకుల కృషిని అభినందించాల్సిందే. ఇక్కడ నీరు ఎంత స్వచ్ఛంగా ఉంటుందంటే లోపల తిరుగాడే రంగు రంగుల చేపలు, జలచరాలు స్పష్టంగా కనిపిస్తుంటాయి.
రెండే కాలాలు..
లోకానికి మూడు కాలాలుంటే ఈ దీవుల్లో రెండే కాలాలుంటాయి. ఎండాకాలం, వానాకాలం. జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఎండాకాలం. మే నుంచి డిసెంబర్ వరకు వానాకాలం. ఈ ప్రాంతం వానాకాలం సందర్శిస్తే మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. ఎండా కాలం కూడా మరీ వేడిగా ఉండదు. ఏ కాలమైనా ఉష్ణోగ్రతలు 20 నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ల మధ్య ఉంటాయి. ఇక్కడ కరెన్సీ థాయ్బాట్. మన రెండు రూపాయలు ఒక థాయ్బాట్తో సమానం. కాబట్టి భారతీయులకు థాయ్టూర్ అంత ఖర్చుతోకూడున్నది ఏమీ కాదు.
అక్కడకు వెళ్తే టాటూ పడాల్సిందే..
ఫిఫి ఐలాండ్స్ చిన్న ప్రాంతమే అయినా ఒక నగరానికి ఉండాల్సిన అన్ని లక్షణాలు ఉంటాయి. ఇక్కడ టూర్‌ను చాలా తక్కువ ఖర్చుతో పూర్తి చేయొచ్చు. ఎక్కువ గానూ ఖర్చుచేయొచ్చు. ఇక్కడ టాటూ సెంటర్లు చాలా ఎక్కువ. ఏటీఎం సెంటర్ల మాదిరి ఎక్కడపడితే అక్కడ టాటూ సెంటర్లు కనిపిస్తాయి. ఏ పద్ధతిలో కావాలన్నా, ఏ టాటూ కావాలన్నా నిమిషాల్లో వేసేస్తారు. ఫిఫి వెళ్లొచ్చిన దాదాపు అందరి ఒంటిపైన టాటూలు కనిపిస్తాయి.
ప్రానంగ్ టూ ఫిఫి..
ఈ ద్వీపాలు కాబ్రి టౌన్ పరిధిలోకి వస్తాయి. వాటితో పాటు ప్రా నంగ్ బీచ్. పక్కనే ఒక పెద్ద కొండ, దాని మీద వేలాడే ఉద్యానవనాలు.. అన్నీ ఎంతో అద్భుతంగా కనువిందు చేస్తుంటాయి. తెల్లటి ఇసుకతో ఈ ప్రాంతం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది.
పుకెట్ నగరం..
థాయ్‌లాండ్‌లో ప్రముఖ పర్యాటక ప్రదేశం పుకెట్ నగరం. ఆ దేశ ఏరోప్లేన్ బ్రాండ్ కూడా ఇదే. ఈ నగరం ఫిఫి ఐలాండ్‌కు కేవలం 50 కి.మీ దూరంలో ఉంది. ఇది కూడా థాయ్‌లోని అతిపెద్ద పర్యాటక ప్రదేశమే. ప్రకృతి దృశ్యాలకు ఈ ప్రాంతం ప్రత్యేకం. థాయ్ సంప్రదాయ దర్శనీయ స్థలాలు ఉన్నాయి.
యాచ్ ట్రిప్..
ఈ దీవుల్లో మరో మంచి అనుభూతి యాచ్ట్రిప్. ఇక్కడకు వచ్చే పర్యాటకులు ఈ పొడవాటి పడవలు ఎక్కకుండా తిరిగి వెళ్లరు. వీటిలో ఒక రోజంతా ఆరు దీవులను చుట్టిరావడం ఎన్నో మధుర జ్ఞాపకాలను మిగులుస్తుంది. వీటి ఖరీదు కూడా పెద్ద ఎక్కువ కాదు. వీటిని కొన్ని కంపెనీలు, సంస్థలు, హోటళ్లు.. నడుపుతున్నాయి. ఎవరికి నచ్చిన ఆప్షన్ వాళ్లు ఎంచుకుని కూడా గైడ్లను వెంటబెట్టుకుని వెళ్లొచ్చు.