రాఖీ అందమైన బ్యాండ్ మాత్రమేనా?
సెల్ఫ్ చెక్
పిల్లలకు రాఖీ అంటే మణికట్టుకు కట్టుకునే అందమైన బ్యాండ్ అనే తెలుసు. పురాణ కాలం నుంచి శ్రావణ పౌర్ణమి నాడు దేశం మొత్తం స్థానిక సంప్రదాయాలను అనుసరిస్తోంది. పిల్లలకు చెప్పే ముందు మనం గుర్తు చేసుకుందాం.
1. యమున తన సోదరుడు యముడు క్షేమంగా ఉండాలని రక్షాబంధనాన్ని కట్టిందని, రక్షాబంధనం కట్టే ఆనవాయితీకి ఇదే మొదలు అని విశ్వాసం.
ఎ. అవును బి. కాదు
2. బలి చక్రవర్తికి లక్ష్మీదేవి రాఖీ కట్టినట్లు పురాణ కథనం.
ఎ. అవును బి. కాదు
3 శచీదేవి రాఖీని ఇంద్రునిలో ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసం కలిగించడానికి సాధనంగా ఉపయోగించింది.
ఎ. అవును బి. కాదు
4. శిశుపాల వధలో కృష్ణుని మణికట్టుకు గాయమై రక్తం కారితే ద్రౌపది తన చీర చెంగును చించి గాయానికి కడుతుంది. అప్పుడు కృష్ణుడు ఆమెకు అండగా ఉంటానని మాట ఇచ్చినట్లు ఒక కథనం వాడుకలో ఉంది.
ఎ. అవును బి. కాదు
5. అరేబియా తీరంలోని వాళ్లు ఈ రోజు సముద్రంలో కొబ్బరికాయలను వదిలి నారియల్ పూర్ణిమగా పండగ చేసుకుని చేపల వేట ప్రారంభిస్తారు.
ఎ. అవును బి. కాదు
6. దక్షిణాది రాష్ట్రాల్లో ఈ పర్వదినాన్ని రుషి తర్పణ్, అవని అవిట్టమ్ పేరుతో సంప్రదాయబద్ధంగా చేసుకుంటారు.
ఎ. అవును బి. కాదు
7. ఉత్తరాది రైతులు ఈ రోజును కజారి పూర్ణిమగా పండగ చేసుకుంటారు. గోధుమ, బార్లీ పంటలు నాటే రోజులివి. భగవతీదేవికి పూజ చేసి పంటలు బాగా పండాలని కోరుకుంటారు.
ఎ. అవును బి. కాదు
8. గుజరాత్లో ఈ రోజు శివలింగానికి ప్రత్యేక పూజలు చేసి మణికట్టుకు పంచకవ్యంలో(ఆవు పాలు, పెరుగు, నెయ్యి, మూత్రం, పేడలతో చేసిన మిశ్రమం) ముంచిన నూలుదారాలను కట్టుకుంటారు. ఇది విషాన్ని హరిస్తుందని, పాపనాశకంగా పని చేస్తుందని వారి విశ్వాసం.
ఎ. అవును బి. కాదు
మీ సమాధానాల్లో ‘ఎ’లు ఆరు అంతకంటే ఎక్కువగా వస్తే ఈ పండగ పుట్టు పూర్వోత్తరాల గురించి మీకు ఆసక్తి ఎక్కువ. పిల్లలకు దీని మూలాలను చెప్పడానికి తగిన సమాచారం ఉంది.