ఒక్క సారీ... చెప్తే ఏం పోతుంది?
‘‘ఇప్పుడు నేనేం తప్పు చేశానని అంత కోపం’’... విసుగ్గా అన్నాడు సురేశ్. ‘‘తప్పు చేసింది మీరు కాదు... మిమ్మల్ని పెళ్లి చేసుకోవడమే నేను చేసిన పెద్ద తప్పు’’... అనేసి విసవిసా బెడ్రూమ్లోకి వెళ్లిపోయింది శిరీష. ఆమె అన్న మాటకు షాక్ తిన్నట్టుగా అయ్యాడు సురేశ్. ఆ రాత్రిని ఒంటరిగా హాల్లోనే గడిపాడు. శిరీష కూడా మెత్తబడలేదు. అతడే దారికొస్తాడులే అనుకుంది. కానీ ఆమె మాట అన్నదానికంటే, మళ్లీ దగ్గరకొచ్చి సారీ చెప్పకపోవడం సురేశ్‌ని బాధించిందని ఆమెకు తెలీదు. అలా వారి మధ్య ఏర్పడిన దూరం పెరుగుతూనే ఉంది. దాన్ని శిరీష గమనించుకునేలోపే వారి అనురాగం ఉనికిని కోల్పోయింది.
పరుషమైన మాట పెదవి దాటితే... ఓ అందమైన బంధం బీటలు వారుతుంది. మనిషికి మాట ఎంత అవసరమో... ఆ మాట మధురంగా ఉండటం అంతకంటే అవసరం. అలా అని అందరూ ఎప్పుడూ స్వీట్‌గానే మాట్లాడలేరు. మనిషన్న తర్వాత కోపాలు, తాపాలు, విసుగులు, చిరాకులు, అపార్థాలు, అసూయలు... ఇలా ఎన్నో ఉంటాయి. అవి ఒక్కసారి మన మనసును ఆక్రమిస్తే... మన మాట మీద అధికారాన్ని చెలాయించడం మొదలు పెడతాయి. అందుకే ఒక్కోసారి అనకూడని మాట అనేస్తాం. ఆ తర్వాత మన కోపం చల్లారిపోవచ్చు. కానీ అవతలివారి మనసులో రగిలిన మంట ఆరుతుందని గ్యారంటీ లేదు. సురేశ్, శిరీషల మాటల్నే తీసుకుంటే... ఏదో విషయం మీద మాటా మాటా వచ్చింది. దానికి మామూలుగా కూడా కోప్పడవచ్చు. కానీ పెళ్లి చేసుకోవడమే తప్పని పెద్ద మాట అనేసింది శిరీష. అది సురేశ్ మనసును గాయపర్చింది.
‘సారీ’ అన్న చిన్న పదాన్ని చెప్పలేక, అనవసరమైన ఇగోతో బంధాల్ని విచ్ఛిన్నం చేసుకునేవాళ్లు చాలామంది ఉంటారు. తెలిసో తెలియకో అవతలివారి మనసును గాయపరుస్తాం. వారికి చిన్న సారీ చెప్పడానికి ఎందుకు బాధ? మనవాళ్ల దగ్గర ఎందుకు ఇగో? భార్యాభర్తలనే కాదు... తల్లిదండ్రులు, అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములు, పిల్లలు, చివరకు పని వాళ్లయినా సరే... ఒకరిని బాధపెట్టే హక్కు ఎవరికీ ఉండదు. ఒకవేళ తెలియక పెడితే... ఒక్కసారి సారీ అంటే చాలు... కోపం దూదిపింజలా ఎగిరిపోతుంది. దానిస్థానే ప్రేమ వచ్చి చేరిపోతుంది. బంధాలను నిలబెట్టుకోవాలంటే కొన్నిసార్లు తగ్గాలి. చాలా విషయాల్లో తగ్గించుకోవాలి. సారీ అనే ఓ చిన్న మాటను పలకడానికి బాధపడి, విలువైన బంధాన్ని దూరం చేసుకోవడం అవసరమా? ఫలితం బాగుంటుందనుకున్నప్పుడు కాస్త కాంప్రమైజ్ కావడంలో తప్పేముంది చెప్పండి!