అందమైన లోకమని..
అందాన్ని చూసేది కళ్లే అయినా దానిని కాపాడాల్సిన బాధ్యత మాత్రం చేతులదే. అందంగా లేని ప్రపంచాన్ని చూస్తూ బాధ పడుతూ ఉండటం కన్నా, మెరుగు పరిచే దిశగా చేతనైన చిన్న పని చేయడానికి ప్రయత్నించాలంటూ మూడు నిముషాల వ్యవధిలో అందంగా చూపించారు. ప్రపంచం సప్తవర్ణ శోభితమైనా.. అంధులకు మాత్రం కటిక చీకటి తప్ప మరో వర్ణం తెలియదు. అలాంటి ఓ కళ్లులేని అమ్మాయికి చూపు వస్తుంది.
రంగురంగుల లోకాన్ని చూడటానికి బయల్దేరుతుంది. ఆనాటి వరకూ తను చూడలేని లోకం ఎంతో అందమైందని ఊహించిన ఆ మనసు.. తన కంటితో చూసిన తర్వాత అదే లోకంలో అంధవిహీన ప్రపంచం ఉందని గ్రహిస్తుంది. అణువణువూ వర్ణరంజితంగా ఉన్న ప్రపంచం ఎందుకిలా ఉందో అర్థం కాక బాధపడుతుంది. ఇంతలో ఒక సంఘటన.. ఆమెకు ఊరటనిస్తుంది. విజయ్‌కుమార్ కలివరపు రూపొందించిన ‘బ్యూటీ లైస్ ఇన్ హ్యాండ్స్..’ అనే బుల్లి చిత్రంలో క్రియేటివిటీతో పాటు, ప్రొఫెషనలిజం కూడా కనిపిస్తుంది. మెసేజ్ చెప్పడంలో భారమైన డైలాగులు లేకుండా షార్ట్ అండ్ క్రిస్ప్‌గా ముగించారు.