గడ్డకట్టే చలి అంటే బీవర్లకు బాగా ఇష్టమా!?
జంతుప్రపంచం
యానిమేషన్ చిత్రాల్లో ఎక్కువగా కనిపించే ఈ జంతువు పేరు బీవర్. కెనడా దేశపు జాతీయ జంతువు ఇది. ఇవి కెనడా, అమెరికా దేశాల్లో విరివిగా ఉంటాయి. ఆ తర్వాత బ్రిటన్, ఆస్ట్రేలియాల్లోని ఏవో కొన్నిప్రాంతాల్లో మాత్రం కనిపిస్తాయి!వీటికి చలి అంటే మహా ఇష్టం. గడ్డకట్టే చలిలో సైతం చలాకీగా తిరిగేస్తుంటాయి. ఇంకా చెప్పాలంటే చలికాలంలోనే ఎక్కువ హుషారుగా ఉంటాయి!
బీవర్ల ప్రధాన ఆహారం వెదురు. పండ్లు, దుంపలను సైతం తిన్నప్పటికీ... చెట్ల కాండాలను ఎక్కువగా కొరికి తింటుంటాయి! వీటి పళ్లు జీవితాంతం పెరుగుతూనే ఉంటాయి. వెదురును ఎక్కువగా కొరుకుతూ ఉండటం వల్ల పళ్లు మరీ పెద్దగా పెరగకుండా ఉంటాయి! ఇవి నీటిలోనే ఎక్కువగా ఉండటానికి ఇష్టపడతాయి. అద్భుతంగా ఈత కొడతాయి. నీటి అడుగుకు కూడా వెళ్లిపోయి కొన్ని నిమిషాల పాటు ఉండి వస్తాయి.
బీవర్ నివాసాన్ని లాడ్జ్ అంటారు. కొమ్మలు, మట్టి కలిపి నీటిమధ్యలో నిర్మించే ఈ గూటిలో రెండుభాగాలు ఉంటాయి. ఒకదానిలో నివసిస్తాయి. ఇంకోదానిలో... నీటిలో తడిసి వచ్చినప్పుడు ఒంటిని ఆరబెట్టుకుంటాయి. అందుకే ఆ గదిని డ్రయర్ డెన్ అంటారు! ఇవి తమ గూటికి రహస్య ద్వారాన్ని నిర్మించుకుంటాయి. ప్రమాద సూచికలేమైనా కనిపిస్తే, దానిగుండా నీటిలోకి వెళ్లిపోతాయి!
వీటి కనుగుడ్ల నిర్మాణంలోని ప్రత్యేకత కారణంగా నీటి అడుగున కూడా వీటికి కళ్లు స్పష్టంగా కనిపిస్తాయి. నీటిలో ఈదుతున్నప్పుడు నీరు లోనికి వెళ్లకుండా ఇవి తమ నాసికా రంధ్రాలను, చెవులను మూసుకోగలవు!
తోక కదలికల్ని బట్టి బీవర్ల ప్రవర్తనను అంచనా వేయవచ్చు. ఆనందం వచ్చినప్పుడు తోకను పైకి లేపుతాయి. కోపం వచ్చినప్పుడు నేలకేసి టపటపా కొడతాయి. శత్రువు దగ్గర్లోనే ఉందని తోటి బీవర్లకు చెప్పాలనుకున్నప్పుడు నీటిలోకి వెళ్లిపోయి, తోకను నీటి ఉపరితలంపై వాటికి కనబడేలా ఉంచుతాయి!