జగిత్యాల ఆస్పత్రిలో జర భద్రం
శిథిలావస్థలో భవనం
పెచ్చులూడుతున్న పైకప్పులు
భయాందోళనలో రోగులు
జగిత్యాల అర్బన్ : కరీంనగర్‌లోని ప్రభుత్వ ప్రధానాస్పత్రిలోని పిల్లల వార్డులో పైకప్పు పెచ్చులూడిపడి ఇటీవల నలుగురు గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటన గుర్తుకుతెచ్చుకుంటే జగిత్యాల ఆస్పత్రిలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. పట్టణంలోని ఏరియా ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చేరింది. పెచ్చలూడుతున్న పైకప్పు, చిన్నవర్షానికి ఉరుస్తుండడంతో రోగులు భయాందోళన చెందుతున్నారు. నిత్యం వందలాది మంది ఔట్పేషెంట్లు వస్తుంటారు. అంతకుపైగానే ఇన్పేషెంట్లుగా ఉంటారు. భవనం శిథిలావస్థకు చేరడంతో పలు వార్డుల్లో చిన్నపాటి వర్షానికే ఉరుస్తూ చిన్నచిన్న బిల్లలు ఊడిపడుతున్నాయి. పదిహేనేళ్ల క్రితం నిర్మించిన ఈ భవనం త్వరలోనే శిథిలావస్థకు చేరింది. బయట ఉన్న పోర్ట్పో సైతం పెచ్చులూడుతోంది.
భయాందోళనలో రోగులు
ఇటీవల వర్షాలు కురుస్తుండడంతో ఆస్పత్రి భవనం ఉరుస్తోంది. దీంతో ఎప్పుడు కూలుతుందోననే భయాందోళనలో రోగులు గడుపుతున్నారు. మరమ్మతులు చేపట్టకపోవడంతో ఆస్పత్రికి పెచ్చులూడుతున్నాయి. ఈ ఆస్పత్రి 100 పడకలది అయినప్పటికీ 150కి పైగానే ఇన్‌పేషెంట్లు ఉంటున్నారు. వారి బంధువులు 100కు పైగానే ఆస్పత్రిలో ఉంటారు. భవన నిర్మాణంలో నాణ్యత పాటించకపోవడంతో త్వరగానే శిథిలావస్థకు చేరుకుంది.
పట్టించుకోని ప్రజాప్రతినిధులు
కరీంనగర్ తర్వాత జగిత్యాల ఆస్పత్రికే ప్రాధాన్యత ఉంది. ఇక్కడ నెలకు 100కు పైగానే డెలివరీలు అవుతుండడంతోపాటు రోగులు సైతం నిత్యం 300లకు పైగానే వస్తుంటారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో ఆస్పత్రి అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఇప్పటికైనా ఎంపీ కవిత, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి చొరవ చూపి ఆస్పత్రికి మరమ్మతులు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.