బీఈడీ కుంభకోణం బట్టబయలు
బీఈడీ సీట్ల అనుమతులకు సంబంధించిన కుంభకోణం ఒకటి హైదరాబాద్‌లో బయటపడింది. విద్యార్థులే ఈ వ్యవహారాన్ని పట్టుకుని బయటపెట్టడం ఇందులో విశేషం. వాళ్లు విషయమంతా తెలుసుకుని, లంచగొండి అధికారిని రెడ్‌హ్యాండెడ్‌గా పోలీసులకు పట్టించారు. హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని రాష్ట్ర విద్యా పరిశోధనా శిక్షణ సంస్థలో ఒక కాలేజి సీటు అనుమతికి నర్సింహారావు అనే అధికారి మూడు లక్షల రూపాయల లంచం డిమాండ్ చేశారు. ఇందుకు ఒప్పుకున్న ప్రైవేటు కాలేజీకి చెందిన ఓ వ్యక్తి సదరు సారుగారికి మూడు లక్షలు చెల్లించేందుకు రాగా ... ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు వారిని పట్టుకున్నారు.
పక్కా సమాచారంతో అక్కడికి చేరుకున్న విద్యార్థులు, ఈ తతంగంపై అధికారిని నిలదీశారు. అలాంటిదేమీ లేదని నర్సింహారావు బుకాయించారు. వెంటనే అక్కడికి చేరుకున్న అబిడ్స్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. తమ భవిష్యత్తుతో ఆడుకుంటే ఊరుకునేది లేదని ఈ సందర్భంగా విద్యార్థులు హెచ్చరించారు.