కిడ్నీ చిన్నదయింది... ప్రమాదమా?
ఆయుర్వేదం కౌన్సెలింగ్
మా పాప వయసు ఏడేళ్లు. ఇంకా రాత్రిపూట పక్క తడుపుతూనే ఉంది. ఎంత చెప్పినా వినడం లేదు. దయచేసి మా పాప సమస్యకు ఆయుర్వేదంలో మందులను సూచించండి.
- లక్ష్మీపద్మజ, హైదరాబాద్
ఈ సమస్యను ఆయుర్వేదంలో ‘శయ్యామూత్రం’గా వర్ణించారు. ఇంగ్లిష్‌లో బెడ్‌వెట్టింగ్ అంటారు.ఇది చాలామందిలో తారసపడే సాధారణ సమస్య. ఇది ఒక్కొక్కప్పుడు 12-13 ఏళ్లవరకూ కొనసాగూతే ఉంటుంది. మూత్రాశయానికి సంబంధించి, రచనాపరమైన లోపాలు ఏమీ లేనప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది. దీనికి ప్రధాన కారణం మానసిక ఒత్తిడి. అప్పుడే పుట్టిన శిశువులు మొదలుకొని, పెరిగే వయసులోనూ రకరకాల కారణాల వల్ల పిల్లలు మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. వారిలో అంతర్లీనంగా ఆందోళన, భయం, అభద్రతాభావం వంటి ఉద్వేగాలు చోటు చేసుకుంటాయి. పాలు తాగలేదనో, అన్నం తినలేదనో ఇంకేదైనా కారణం వల్లనో బూచాడికిచ్చేస్తామనో, పోలీసుల్ని పిలుస్తామనో చెప్పి ... తల్లిదండ్రులు పిల్లల్ని భయపెడుతుంటారు. క్రమశిక్షణ పేరు మీద అతిగా తిట్టడం, కొట్టడం చేస్తుంటారు. అదేవిధంగా పాఠశాలల్లోని ఉపాధ్యాయులు కూడా హోమ్‌వర్క్ చేయలేదనో, అల్లరి చేశారనో కఠినంగా శిక్షిస్తుంటారు. అందరిలోనూ క్లాసులో అవమానపరస్తుంటారు. మరికొన్ని సందర్భాల్లో పిల్లలు ఆత్మన్యూనతకు గురి అవుతుంటారు. పిల్లలకు పక్క తడుపుతుంటే ఇలా అనేక కారణాలను పరిశీలించాల్సి ఉంటుంది.
చికిత్స: ప్రధానంగా పైన పేర్కొన్న కారణాలను సమీక్షించి, వాటిని దూరం చేయాలి. - ఇంత వయసొచ్చినా సిగ్గులేకుండా పక్కమీదే మూత్రం పోస్తావా అని తల్లిదండ్రులు అంటుంటారు. ఆ పని చేయకూడదు. ఎందుకంటే అది కావాలని చేసిన పని కాదు. అలా చేసినందుకు పిల్లలు కూడా లోలోపల బాధపడుతూనే ఉంటారు. వారిలో ఆత్మవిశ్వాసాన్ని పాదుగొల్పడం తల్లిదండ్రుల విధి. ‘నువ్వేం కంగారుపడకు. ఇలా చాలామంది పిల్లలు చేస్తుంటారు. అది తగ్గిపోతుందిలే’ అని వారిని సముదాయించాలి. - రాత్రి 7-8 గంటలకే, కొంచెం వేగంగానే భోజనం పెట్టండి. అనంతరం వాళ్లకు తాగే పానీయాలేవీ ఇవ్వవద్దు. వారు నిద్రపోయిన ఒక గంటకే, వారిని నిద్రలేపి, బాత్రూమ్ తీసుకెళ్లి మూత్రవిసర్జన చేయించండి. అవసరమైతే మరో 40 నిమిషాలలో మళ్లీ ఆ పని చేయించండి.
ఔషధం: చంద్రప్రభావటి (మాత్రలు) ఉదయం ఒకటి - రాత్రి ఒకటి. అరవిందాసవం (ద్రావకం) ఉదయం 1 చెంచా - రాత్రి 1 చెంచా, నీళ్లతో తాగించండి. మీరు సేకరించగలిగితే శాస్త్రో్తక్తమైన ఔషధం మరొకటి ఉంది. దొండపాదు వేరును శుభ్రం చేసి, దంచి స్వరసం (పసరు) తీసి, ఒక చెంచా ఉదయం, ఒక చెంచా రాత్రి, తేనెతో నాకించండి. ఇలా రెండు వారాలు చేయవచ్చు.
నెఫ్రాలజీ కౌన్సెలింగ్
నా వయసు 42 ఏళ్లు. ఈమధ్యనే బీపీ వచ్చిమంది. అల్ట్రాసౌండ్ స్కానింగ్ రిపోర్టు చూసి ఒక కిడ్నీ చిన్నదిగా ఉందని చెప్పారు. సీరమ్ క్రియాటినిన్ 0.8 ఎంజీ/డీఎల్ ఉంది. యూరియా 30 ఎంజీ/డీఎల్ ఉంది. ఇలా ఒక కిడ్నీ చిన్నదిగా ఎందుకు ఉంది? ఇంకో కిడ్నీ కూడా చిన్నది అయ్యే అవకాశం ఉందా?
- శ్రీనాథశర్మ, నిడదవోలు
కొంతమందిలో పుట్టుకతోనే కిడ్నీ చిన్నదిగా ఉంటుంది. కొంతమందిలో పుట్టకలో నార్మల్‌గానే ఉండి, ఆ తర్వాత చిన్నగా అవుతుంది. ఇలా చిన్నదిగా మారడానికి కిడ్నీకి రక్తసరఫరా తగ్గడం, ఇన్ఫెక్షన్ రావడం వంటి ఏదైనా కారణం ఉండవచ్చు. దీనికి కారణం తెలుసుకోడానికి కిడ్నీ డాప్లర్ పరీక్ష, టీబీ ఉందా, లేదా అన్న పరీక్ష చేయించుకోవాలి. ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే ఆ రెండో కిడ్నీ దెబ్బతినకుండా మందులు వాడాలి. బీపీని ఎప్పుడూ నియంత్రణలో ఉంచుకోవాలి. బీపీ కంట్రోల్లో లేకుండా కిడ్నీ దెబ్బతినే అవకాశం ఎక్కువ. మీరు ఒకసారి నెఫ్రాలజిస్ట్‌ను సంప్రదించండి.
నా వయసు 32 ఏళ్లు. గత ఐదేళ్ల నుంచి అప్పుడప్పుడూ మూత్రం ఎర్రగా వస్తోంది. ప్రతిసారీ రెండు మూడు రోజుల తర్వాత తగ్గిపోతోంది. నొప్పి ఏమీ లేదు. ఇలా రావడం వల్ల భవిష్యత్తులో ఏదైనా సమస్య వస్తుందా? కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉందా?
- శ్రీనివాసరావు, టెక్కలి
మీరు చెప్పినట్లుగా మూత్రంలో రక్తం చాలాసార్లు పోతుంటే... ఎందువల్ల ఇలా జరుగుతోంది అనే విషయాన్ని తెలుసుకోవాలి. దానికి తగినట్లుగా చికిత్స తీసుకోవాలి. ఇలా మాటిమాటికీ మూత్రంలో రక్తస్రావం అవుతుండటానికి కిడ్నీలో రాళ్లు ఉండటం, ఇన్ఫెక్షన్ ఉండటం, కిడ్నీ సమస్య లేదా మరేదైనా కిడ్నీ సమస్య (గ్లోమెరూలో నెఫ్రైటిస్ వంటిది) ఉండవచ్చు. మీరు ఒకసారి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోండి. మూత్రపరీక్ష కూడా చేయించుకోవాలి. కిడ్నీలో రాళ్లుగానీ, ఇన్ఫెక్షన్ గానీ లేకుండా ఇలా రక్తం వస్తుంటే మూత్రంలో ప్రోటీన్ పోతుందేమోనని కూడా చూడాలి. కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ కూడా చేయించుకోవాలి. ఒకవేళ రక్తంతో పాటు ప్రోటీన్ కూడా పోతుంటే కిడ్నీ బయాప్సీ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. కిడ్నీలు దెబ్బతినకుండా ఉండేందుకు మందులు వాడాల్సి ఉంటుంది.
డర్మటాలజీ కౌన్సెలింగ్
నాకు కుడి చేతి మీద అలర్జిక్ ర్యాష్ వచ్చింది. దురదగా ఉంటే అక్కడ చాలాసేపు గీరాను. దాంతో అక్కడ నల్లటి మచ్చలు (డార్క్ మార్క్స్) ఏర్పడ్డాయి. అవి వచ్చి నాలుగు నెలలైనా ఇంకా తగ్గలేదు. నేను ఫెయిర్‌గా ఉంటాను. అందుకే అవి ఇంకా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి.
- సయీదా, హైదరాబాద్
మీరు చెబుతున్న కండిషన్‌ను పోస్ట్ ఇన్ఫ్లమేటరీ హైపర్ పిగ్మెంటేషన్ అంటారు. ఇది తగ్గడానికి ఈ కింది సూచనలు పాటించండి. సాఫ్ట్ పారఫిన్, షియాబట్టర్, గ్లిజరిన్ ఉన్న మాయిష్చరైజర్ను డార్క్ మార్క్స్ ఉన్నచోట బాగా రాయండి ఆ ప్రాంతంలో ఎస్పీఎఫ్ 50 కంటే ఎక్కువగా ఉన్న సన్‌స్క్రీన్ లోషన్ ప్రతిరోజూ ఉదయం, మధ్యానం రాయండి కోజిక్ యాసిడ్, అర్బ్యుటిన్, నికోటినమైడ్తో పాటు లికోరైస్ ఉన్న స్కిన్ లెటైనింగ్ క్రీములు అప్లై చేయండి ఆహారంలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే పదార్థాలను ప్రతిరోజూ తీసుకోండి. ఈ సూచనలు పాటించాక కూడా తగ్గకపోతే కెమికల్ పీలింగ్, మైక్రో డర్మా అబ్రేషన్ వంటి చికిత్సలు తీసుకోవడం కోసం మీకు దగ్గర్లోని డర్మటాలజిస్ట్‌ను కలవండి. మీరు మీ అలర్జీని అదుపులో ఉంచుకునే మందులు కూడా వాడాల్సి ఉంటుంది.
నాకు క్రీములు వాడే అలవాటు లేదు. సౌందర్యసాధనాలు వాడటం కూడా ఇష్టం లేదు. అందుకే ఆహారం ద్వారానే చర్మం మెరిసేలా చేసుకోవడం ఎలాగో చెప్పండి.
- సౌమ్య, కందుకూరు
ఫ్యాటీ యాసిడ్స్ చర్మానికి మేలు చేస్తాయి. ఇవి ఎక్కుగా ఉండే ఆహారాలైన చర్మానికి తాజా చేపలు, అవిశెలు, బాదం... వంటివి తీసుకోవడం ద్వారా చర్మం మెరిసేలా చూసుకోవచ్చు. ఇవి చర్మంలోని తేమను బయటకు వెళ్లనివ్వకుండా కాపాడి చర్మం ఎప్పుడూ మెరుస్తూ ఉండేలా చేస్తాయి. ముడిబియ్యం, పొట్టుతీయని ధాన్యాలు, బార్లీ, పొట్టు తీయని గోధుమలతో చేసిన బ్రెడ్స్‌లో ఫైబర్ (పీచు పదార్థాలు) ఎక్కువ. ఇవి శరీరంలోని విషాలను బయటకు పంపడానికి సహాయపడతాయి. ఇందులోని పీచు పదార్థాలు చర్మం బిగుతుదనాన్ని కాపాడతాయి. వైటమిన్-బి6 ఎక్కువగా ఉండే ఆహారమైన కాలీఫ్లవర్, పొద్దుతిరుగుడు గింజల నూనె, వాల్నట్, అవకాడో వల్ల హార్మోన్లలోని అసమతౌల్యత వల్ల వచ్చే మొటిమలను నివారించవచ్చు. అరటి, నారింజ, జామ వంటి అన్ని రకాల తాజా పండ్లలో అన్ని రకాల విటమిన్లతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి చర్మానికి హానిచేసే ఫ్రీ రాడికల్స్ అనే విషాలను తొలగించి మేనిని మెరిసేలా చేస్తుంది.