'నా భర్త ఎక్కడున్నాడో పోలీసులే చెప్పాలి'
వికారాబాద్ రూరల్ (రంగారెడ్డి జిల్లా): తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్(టఫ్)లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న నా భర్త భీంభరత్ ఎక్కడున్నాడో వెంటనే చెప్పాలని ఆయన భార్య జ్యోతి పోలీసులను డిమాండ్ చేశారు. వికారాబాద్‌లోని అతిథి గృహంలో ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని ఉప్పర్‌పల్లిలో నివాసం ఉంటుండగా ఈ నెల 1వ తేదీ అర్ధరాత్రి 12.30 గంటలకు అచ్చంపేట, షాబాద్ పోలీసులమంటూ 20, 30 మంది వచ్చి ఏమీ చెప్పకుండా భీంభరత్‌ను తీసుకువెళ్లారన్నారు. మూడు రోజులు అవుతున్నా ఎందుకు తీసుకువెళ్లారో, ఎక్కడ ఉంచారో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అర్థరాత్రి ఇంట్లోకి చొరబడి అక్రమంగా తీసుకెళ్లడం వెనుక కుట్ర దాగిఉందని ఆరోపించారు. భీంభరత్‌కు ఏమైన అయితే పూర్తి బాధ్యత పోలీసులదేనన్నారు. ఈ విషయమై రాష్ట్ర హోంమంత్రిని కలిశామని, ఆయన జిల్లా ఎస్పీతో మాట్లాడారని జ్యోతి అన్నారు. భీంభరత్ వికారాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఉన్నట్లు 9490617966 నంబర్ నుంచి ఫోన్ వచ్చిందని, తీరా ఇక్కడి వచ్చి చూస్తే లేడని పేర్కొన్నారు. నా భర్తను 24 గంటల్లో కోర్టులో హాజరు పర్చాలని, లేని పక్షంలో రాష్ర్ట వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను చేపడతామని హెచ్చరించారు. ఆమె వెంట టఫ్ నాయకులు నాగిరెడ్డి, మహేష్, విశ్వం, అశోక్ తదితరులు ఉన్నారు.