Children's Day 2022: పిల్లలు తప్పక చూడాల్సిన సినిమాలివే
పిల్లలు చదవాల్సిన కథలే కాదు.. చూడాల్సిన సినిమాలూ ఉన్నాయి. ప్రపంచంలోని పలు భాషల్లో అవి తెరకెక్కుతూనే ఉన్నాయి. అలాంటి వాటిల్లో కాలం, భాషా భేదం లేని.. తప్పక చూడాల్సిన కొన్ని సినిమాల గురించి ఇక్కడ బ్రీఫ్‌గా.. (బాలల దినోత్సవం(నంవబర్ 14) సందర్భంగా)
బ్యాగ్ ఆఫ్ రైస్ (ఇరాన్ మూవీ)
విడుదలైన సంవత్సరం: 1996, నిడివి: 80 ని.లు.
దర్శకుడు: మహ్మద్ అలీ తలేబీ
కథా రచయితలు: హోషంగ్ మొరాదీ కెర్మానీ, మహ్మద్ అలీ తలేబీ
జైరాన్ అనే ఆరేళ్లపాప.. వాళ్లింటికి ఎదురుగా ఉండే ఓ డెబ్బై ఏళ్ల మామ్మ చుట్టూ తిరిగే కథ ఇది. చేతనైనంతలో ఇతరులకు సహాయం చేయాలనేది ఈ సినిమా సారాంశం. చేయూతను అందించాలనే మనసు.. కలిమి– లేమి, కష్టం – సుఖం, బాల్యం – వృద్ధాప్యం వంటి మిషలేమీ పెట్టుకోదని.. సేవే మనిషి గుణమని చూపిస్తుందీ చిత్రం. ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ ఉన్నాయి.
బారీ థేకే పాలియే (బెంగాలీ)
విడుదలైన సంవత్సరం: 1958, నిడివి: 113ని.లు.
కథ: శివరామ్ చక్రవర్తి
దర్శకత్వం: రిత్విక్ ఘటక్
ప్రిన్సిపల్ అయిన తండ్రి కఠిన క్రమశిక్షణకు భయపడి ఎనిమిదేళ్ల కంచన్ అనే పిల్లాడు.. తనుంటున్న పల్లెటూరు నుంచి మహానగరమైన కలకత్తాకు పారిపోతాడు. అక్కడ రకరకాల మనుషులు, రకరకాల పరిస్థితులతో కలకత్తా నగర జీవితం అతనికి అనుభవంలోకి రావడమే బారీ థేకే పాలియే! కథా కాలం 1958. నాటి కలకత్తాను కళ్లకు కడుతుందీ చిత్రం. ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ ఉన్నాయి.
లునానా ఎ యాక్ ఇన్ ద క్లాస్రూమ్ (భూటాన్)
విడుదలైన సంవత్సరం: 2019, నిడివి: 109ని.లు.
కథ, దర్శకత్వం: పావో చోయినింగ్ దోర్జీ
ఉగ్యాన్ అనే కాంట్రాక్ట్ టీచర్.. ఆస్ట్రేలియా వెళ్లి అక్కడ సింగర్‌గా స్థిరపడాలను కుంటాడు. అయిదేళ్ల ఆ కంట్రాక్ట్లోని చివరి సంవత్సరం అతనికి భూటాన్‌లోని కుగ్రామమైన ‘లునానా’కు బదిలీ అవుతుంది. కనీసం కరెంట్ కూడా లేని ఆ ఊళ్లో ఒక్క క్షణం కూడా ఉండలేనని మూడు రోజుల్లోనే తిరుగు టపా కావాలనుకుంటాడు. కానీ అక్కడి విద్యార్థుల శ్రద్ధాసక్తులు, ఆ గ్రామప్రజల గౌరవభక్తులు అతణ్ణి కట్టిపడేస్తాయి. ఆ ఏడాదీ పూర్తిచేసుకుని తాను కోరుకున్నట్టే ఆస్ట్రేలియా వెళ్లి సింగర్‌గా స్థిరపడ్తాడు. అక్కడ లునానా జ్ఞాపకాలే వెంటాడుతుంటాయి. ఆ ఊళ్లో నేర్చుకున్న జానపద గీతాలతోనే శ్రోతలను అలరిస్తుంటాడు. మాతృభూమి మట్టి పరిమళాలను పంచుతుంటాడు. ఇదీ ఈ సినిమా కథ క్లుప్తంగా! ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ ఉన్నాయి.
ది బాయ్ ఇన్ ది స్ట్రైప్డ్ పైజామాస్ (అమెరికా)
విడుదలైన సంవత్సరం: 2008, నిడివి: 94ని.లు.
కథ: జాన్ బాయ్నే, దర్శకత్వం: మార్క్ హెర్మన్
హిట్లర్ జాత్యహంకారానికి సమిధలైన ఇద్దరు చిన్నారి స్నేహితుల కథ ఇది. నాజీ సైనికాధికారి కొడుకు బ్రూనో, యూదు బానిస కొడుకు షూమెల్ల మధ్య స్నేహం కుదురుతుంది. మంచి స్నేహితులుగా మారుతారు. ఉన్నట్టుండి ఒకసారి షూమెల్ తండ్రి కనిపించకుండా పోతాడు. అతడిని వెదికే క్రమంలో బ్రూనో, షూమేల్ ఇద్దరూ నాజీలు నిర్వహిస్తున్న యూదుల కాన్సన్ట్రేషన్ క్యాంప్‌కి వెళ్తారు. అక్కడ విషవాయువుకి ఇద్దరూ బలి అవుతారు. మనసు పిండేసే ఈ సినిమా కథా కాలం రెండవ ప్రపంచ యుద్ధం నాటిది. జాన్ బాయ్నే రాసిన ‘ద బాయ్ ఇన్ ద స్ట్రైప్డ్ పైజామాస్’ ఆధారంగా అదే పేరుతో ఈ సినిమాను తెరకెక్కించారు.
బెకాస్ (ఇరాక్)
విడుదలైన సంవత్సరం : 2012, నిడివి : 90 నిమిషాలు
కథ, దర్శకత్వం: కర్జాన్ కాదర్
యుద్ధంలో తల్లిదండ్రులను పోగొట్టుకున్న ధన, జన అనే ఇద్దరు అన్నదమ్ముల కథ ఇది. కథాకాలం 1990. బూట్ పాలిష్ చేసుకుంటూ పొట్టపోసుకుంటున్న ఈ ఇద్దరు తోబుట్టువులు ఒకసారి సూపర్‌మ్యాన్ సినిమా చూస్తారు. ఆ సూపర్మ్యాన్కి వీరాభిమానులైపోతారు. ఎలాగైనా ఆ సూపర్‌మ్యాన్‌ని కలవాలని ఆరాటపడ్తారు. అతను అమెరికాలో ఉంటాడని తెలుసుకుని అమెరికా వెళ్లాలనుకుంటారు. ఆ ప్రయాణం కోసం వాళ్లు చేసే ప్రయత్నాలే ఈ సినిమా. చివరకు వాళ్ల సాహసాన్ని వాళ్లే గ్రహించి సూపర్‌మ్యాన్ ఎక్కడో లేడు.. తమలోనే ఉన్నాడని తెలుసుకుంటారు. సమస్యలకు ఎదురీది బతుకున్న ధైర్యమే ఎవరినైనా సూపర్‌మ్యాన్‌గా నిలబెడుతుందని అర్థం చేసుకుంటారు. అమెరికా ప్రయాణం రద్దుచేసుకుంటారు. కుర్దిష్ భాషలో తీసిన ఈ సినిమాకు ఇంగ్లిష్ సబ్‌టైటిల్స్ ఉన్నాయి.
పైవాటితోపాటు వీలైనప్పుడు ‘వై వజ్ ఐ బార్న్’ , ‘ది స్పిరిట్ ఆఫ్ ది బీహైవ్’, ‘ది బ్లాక్ స్టాలియన్’, ‘సన్ చిల్డ్రన్’, ‘ఐ వజ్ బార్న్’, ‘బట్’, ‘సడాకో అండ్ ది థౌజెండ్ పేపర్ క్రేన్స్’, ‘పోస్ట్‌మెన్ ఇన్ ది మౌంటెన్స్’, ‘రన్ బాయ్ రన్’, ‘చూరీ’ వంటి చిత్రాలనూ చూడండి.