విజయంతో ముగించారు
బెల్జియం జూనియర్ పురుషుల జట్టుపై భారత మహిళల జట్టు గెలుపు
ఆంట్వర్ప్ (బెల్జియం): యూరోప్ పర్యటనను భారత మహిళల హాకీ జట్టు విజయంతో ముగించింది. పటిష్టమైన బెల్జియం జూనియర్ పురుషుల జట్టుతో జరిగిన చివరి మ్యాచ్‌లో భారత జట్టు 4–3 గోల్స్ తేడాతో గెలుపొందింది. భారత్ తరఫున గుర్జీత్ కౌర్ (7వ, 11వ నిమిషాల్లో), కెప్టెన్ రాణి రాంపాల్ (13వ, 33వ నిమిషాల్లో) రెండేసి గోల్స్ చేశారు. బెల్జియం జట్టుకు థిబాల్ట్ నెవెన్ (38వ నిమిషంలో), విలియమ్ వాన్ డెసెల్ (42వ నిమిషంలో), మథియాస్ రెలిక్ (48వ నిమిషంలో) ఒక్కో గోల్ అందించారు. ఆరంభంలో పూర్తి ఆధిపత్యం చలాయించిన భారత్‌కు చివరి రెండు క్వార్టర్స్‌లో గట్టిపోటీ ఎదురైంది.
ఆఖరి పది నిమిషాల్లో బెల్జియం జట్టు స్కోరును సమం చేసేందుకు విఫలయత్నం చేసినా... గోల్‌కీపర్‌గా భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ అమ్మాయి ఎతిమరపు రజని అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించి ప్రత్యర్థి జట్టు ఆశలను వమ్ము చేసింది. పది రోజుల ఈ పర్యటనలో భారత జట్టు నాలుగు మ్యాచ్‌లు ఆడింది. నెదర్లాండ్స్‌కు చెందిన డెన్ బాష్ జట్టు చేతిలో రెండు మ్యాచ్‌ల్లో ఓడిన టీమిండియా... బెల్జియం జూనియర్ పురుషుల జట్టుతో జరిగిన తొలి మ్యాచ్‌ను 2–2తో ‘డ్రా’గా ముగించింది.