పంటలు ఎండుతున్నా పట్టని గోడు
పట్టెన్నపాలెం (జంగారెడ్డిగూడెం), న్యూస్‌లైన్ : జంగారెడ్డిగూడెం మండలం పట్టెన్నపాలెంలో సాగునీరు అందక పొగాకు పంట వాడిపోతోంది. ఇటీవల వరుస విపత్తులకు నారు, నాట్లు దెబ్బతిన్నాయి. అయినా.. కష్టనష్టాలకోర్చి రైతులు మరోసారి నాట్లు వేశారు. ఈ పరిస్థితుల్లో పట్టెన్నపాలెంలో బెల్ల రాజారావు బ్యారన్ వద్ద గల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వారం క్రితం కాలిపోయింది. దీంతో పొగాకు తోటలకు సాగునీరు అందటం లేదు. కాలిపోయిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పరిధిలో 12 వ్యవసాయ విద్యుత్ మోటార్ సర్వీస్ కనెక్షన్లు ఉండగా వీటి పరిధిలో 30 మంది రైతులు 120 ఎకరాల్లో పొగాకు పంట వేశారు.
‘విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది.. నీరు లేక పంట ఎండిపోతోంది.. వచ్చి చూడండంటూ’ సంబంధిత అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకున్న నాథుడు లేడని రైతులు వాపోతున్నారు. ఎకరానికి రూ. 25 వేలు ఖర్చుపెట్టామని, సకాలంలో నీరు అందకపోతే నష్టం తప్పదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ తరచూ పాడవుతూనే ఉందని, కెపాసిటీ పెంచాలని వేడుకుంటున్నా అధికారులు స్పందించడం లేదని రైతులు దండాబత్తులు పాపారావు, దండాబత్తుల చంద్రయ్య, బల్లె రాజారావు, ఆకుల నాగేశ్వరరావు, కర్రెడ్ల ఆంజనేయులు, ఆకుల నాగేశ్వరరావు ‘న్యూస్‌లైన్’ వద్ద వాపోయారు.