బినామీలను ఏరేద్దాం!
రేషన్ డీలర్లపై స్పెషల్ డ్రైవ్
సాక్షి, హైదరాబాద్: చౌక ధరల దుకాణాల సంస్కరణలపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ దృష్టి సారించింది. బినామీ రేషన్ దుకాణాల వల్ల ప్రజాపంపిణీ వ్యవస్థలో జరుగుతున్న అక్రమాలపై ఆ శాఖ యంత్రాంగం నిఘా పెట్టింది. దీనిలో భాగంగా బినామీ డీలర్లను గుర్తించే పనిలో ఆ శాఖ ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని రంగంలోకి దింపింది. బినామీ రేషన్ డీలర్ల ఏరివేత పైలెట్ ప్రాజెక్టును గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రేషన్ షాపుల్లో చేపట్టనున్నారు.
పౌరసరఫరాల కమిషనర్ సి.వి.ఆనంద్ తెలిపిన వివరాల మేరకు, బినామీల ఏరివేతకు ఆయా ఏసీఎస్ఓ ఆఫీసులకు చెందిన ఏరియా ఇన్స్పెక్టర్లు అన్ని రేషన్ షాపుల్లో తనిఖీలు చేస్తారు. డీలర్‌కు జారీ చేసిన ఫారం బితో పాటు, షాపు నిర్వహణ తీరు తెన్నులను పరిశీలిస్తారు. వారు డీలర్లకు ఇచ్చిన పత్రాలను తమ ఆఫీసులోని పత్రాలతో సరిపోలుస్తారు. ఈ పని పది రోజుల్లో పూర్తి చేస్తారు.
ఈపాస్ మిషన్‌లో డీలర్ వ్యాపారం చేస్తున్నాడా, లేదా అని నిర్ధారణ చేసే సౌకర్యం కల్పించనున్నారు. ఈ మేరకు కమిషనర్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రేషన్ షాపుల పనితీరుపై గురువారం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా డీసీఎస్ ఓలు, ఏసీఎస్ఓలు, పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో సమీక్ష జరి పారు. కాగా 6 నెలలుగా రేషన్ తీసుకోని లబ్ధిదారుల కార్డులను రద్దు చేయనున్నారు.