హెల్త్ బీమా ఎందుకు తప్పనిసరి?
నేటి జీవనశైలి, ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో ప్రతి కుటుంబానికీ హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం ఎంతో ఉంది. అయినా, ప్రీమియం భారంగా భావించి హెల్త్ కవరేజీ తీసుకోని వారు మన సమాజంలో ఇప్పటికీ చాలా మందే ఉన్నారు. కనుక అందరూ కాకపోయినా కొందరు అయితే నూటికి నూరు శాతం హెల్త్ కవరేజీ ఉండేలా చూసుకోవాలి. లేదంటే, ఆర్థిక పరమైన సంక్షోభాన్ని హెల్త్ రిస్క్ రూపంలో ఎదుర్కోవాల్సి రావచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఎవరికి ఎక్కువ ప్రయోజనం..?
అనారోగ్యం లేదా ప్రమాదం కారణంగా ఆస్పత్రిలో చేరాల్సి వస్తే హెల్త్ కవరేజీ ఉంటే ఆ నిశ్చింతే వేరు. వయసు పెరుగుతున్న కొద్దీ పలు అనారోగ్యాలు, వ్యాధులు పలకరిస్తుంటాయి. కొందరికి చిన్న వయసులోనే ఆరోగ్య సమస్యలు ఎదురుకావచ్చు. ఫిట్నెస్తో సంబంధం లేకుండా వచ్చే కేన్సర్ వంటి మహమ్మారులూ ఉన్నాయి. అందుకని ఆరోగ్య బీమాను మంచి పెట్టుబడిగా.. ధైర్యాన్నిచ్చే, అవసరంలో రక్షణనిచ్చే మంచి ఆయుధంగా చూడాలి. సంపాదన మొదలు పెట్టిన నాటి నుంచి లేదా కనీసం పెళ్లయిన వెంటనే ఆరోగ్య బీమా తీసుకోవాలి. ముఖ్యంగా కుటుంబంలో వ్యాధుల చరిత్ర ఉన్నవారు ఆరోగ్య బీమాను ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించడం లేదా ఆలస్యం చేయడం సరికాదు.
నిర్లక్ష్యం చేస్తే రిస్క్‌ను ఆహ్వానించినట్టే అవుతుంది. వంశపారంపర్యంగా వచ్చే వ్యాధులు ఎన్నో ఉన్నాయి. అలాగే, పిల్లల్ని కనే వయసులోని మహిళలు, అంటువ్యాధులు ఎక్కువగా కనిపించే ప్రాంతాల్లో ఉండేవారు, తరచూ ప్రయాణించే వారు (విమాన ప్రయాణం కావచ్చు.. ఉద్యోగరీత్యా తరచూ వాహన ప్రయాణం చేసే వారు) ఆరోగ్య బీమాను వెంటనే తీసుకోవాలి. తీసుకుంటే పాలసీదారులకే ప్రయోజనం. బీమా కంపెనీలకు కాదు. వీలైనంత చిన్న వయసులోనే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అన్నది ఎంతో ప్రయోజనకరం. ఎందుకంటే ఆ వయసులో వ్యాధుల రిస్క్ ఉండదు. తక్కువ ప్రీమియానికే మెరుగైన కవరేజీ లభిస్తుంది. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికీ ఉండాలి. కానీ, ఇక్కడ చెప్పుకున్న విభాగాల్లోని వారికి హెల్త్ ప్లాన్ పక్కా ఉండాల్సిందే.
కుటుంబ చరిత్ర
కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు నేడు వంశపారంపర్యంగా మారాయి. ఇందుకు ఆయా కుటుంబాల జీవనశైలి, ఆహార నియమాలు, జీన్స్ ఇలా ఎన్నో అంశాలు నేపథ్యంగా ఉండొచ్చు. గుండె జబ్బులు, మధుమేహం, పలు రకాల కేన్సర్ సమస్యలు ఇవన్నీ వంశపారంపర్యంగా వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మరణాలకు కూడా ఇవి కారణమవుతున్నాయి. కుటుంబ చరిత్రలో ఎవరికైనా ఈ సమస్యలు ఉంటే కనుక తప్పకుండా బీమా కవరేజీ తీసుకుని రక్షణ కల్పించుకోవాలి. ఆయా వ్యాధులు పలకరించక ముందు నుంచే బీమా ఉంటుంది కనుక.. ముందు నుంచి ఉన్న వ్యాధుల పరిధిలోకి అవి రావు. ముందు నుంచి ఉన్న వ్యాధులకు హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థలు పాలసీ తీసుకున్న నాటి నుంచి కనిష్టంగా రెండేళ్లు.. గరిష్టంగా నాలుగేళ్ల వరకు వేచి ఉండాలని కోరుతుంటాయి.
కంపెనీల మధ్య ఈ వెయిటింగ్ పీరియడ్ వేర్వేరుగా ఉండొచ్చు. ఆలస్యం చేస్తే ఏమవుతుందంటే.. ఆరో గ్య సమస్యలు వెలుగుచూస్తాయి. దీంతో బీమా కంపెనీలు నిర్ణీత కాలం పాటు వెయిటింగ్ తర్వాతే వాటికి కవరేజీని ఆఫర్ చేస్తాయి. అది కూడా అధిక ప్రీమియానికే అని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే వీరి నుంచి క్లెయిమ్‌ల రిస్క్ ఉంటుంది. అవన్నీ మదింపు వేసి, అందుకు తగ్గ ప్రీమియాన్ని అవి వసూలు చేస్తాయి. ఆరోగ్యవంతులకు, ఆరోగ్య సమస్యలున్న వారికి ఒక్కటే ప్రీమియం వసూలు చేయ డం అన్నది అసాధ్యం. వెయిటిం గ్ పీరియడ్ వల్ల ఆయా కాలంలో అవే ఆరోగ్య సమస్య లతో ఆస్పత్రిలో చేరాల్సి వస్తే.. ఖర్చంతా పాలసీదారు స్వయంగా భరించా ల్సి వస్తుందని గుర్తుంచుకోవాలి. అందుకనే చిన్న వయసులోనే బీమా రక్షణ కల్పించుకో వాలని నిపుణులు సూచిస్తుంటారు.
కొన్ని ప్రాంతాలు వేరు..
దేశంలోని చాలా ప్రాంతాల్లో వేడి వాతావరణ పరిస్థితులు ఉంటుంటాయి. ఆయా ప్రాంతాల్లో డెంగీ, చికెన్ గున్యా, మలేరియా కేసులు అప్పుడప్పుడు పెద్ద సంఖ్యలో కనిపిస్తుంటాయి. అందుకని వీటికి కవరేజీని ఆఫర్ చేసే బీమా ప్లాన్లను ఆయా ప్రాంతాల్లో నివసించే వారు తప్పకుండా తీసుకోవాలి. ముఖ్యంగా అవుట్ పేషెంట్ కవరేజీతో ఈ ప్లాన్లు ఉండేలా చూసుకోవాలి. కొన్ని ప్రాంతాల్లో అక్కడి ప్రత్యేక పరిస్థితుల కారణంగా కొన్ని వ్యాధులు తరచూ కనిపిస్తుంటాయి. స్థానికులు వాటిపై అవగాహనతో కవరేజీ ఉండేలా జాగ్రత్త పడాలి. ఇలాంటి సమస్యలకు అవుట్ పేషెంట్‌గా వైద్యం చేయించుకోవాలన్నా భారీగా ఖర్చవుతుంది. హెల్త్ప్లాన్లలో ఇన్‌పేషెంట్ (ఆస్పత్రిలో చేరి తీసుకునే చికిత్సలు) కవరేజీ విషయంలో సందేహం అక్కర్లేదు.
అదే సమయంలో అవుట్ పేషెంట్‌గా చేసే ఖర్చును కూడా దృష్టిలో పెట్టుకుని పాలసీ ఎంపిక జరగాలి. నేడు చాలా బీమా సంస్థలు అవుట్ పేషెంట్ కవరేజీ (ఓపీడీ)ని అందిస్తున్నాయి. వీటికి కొన్ని పరిమితులు, షరతులు, కొంత అదనపు ప్రీమియం అమలవుతుంది. ఐసీఐసీఐ లాంబార్డ్ బీఫిట్, రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ డిజిటల్ కేర్ ప్లాన్లు రూ.1,000 నుంచి రూ.10,000 ఓపీడీ కవరేజీ కోసం రూ.300 నుంచి రూ.3,000 వరకు ప్రీమియం వసూలు చేస్తున్నాయి. వీటిని యాడాన్‌గా లేదంటే పాలసీలో భాగంగా తీసుకోవచ్చు. ఓపీడీ కవరేజీలో టెలిమెడికల్ కన్సల్టేషన్లు, వార్షిక హెల్త్ చెకప్‌లు ఉచితంగా లభిస్తాయి.
తరచూ ప్రయాణాలు..
ప్రమాదకరమైన వృత్తుల్లో పనిచేసే వారికి అన్ని బీమా సంస్థలు ప్లాన్లను ఆఫర్ చేయడం లేదు. కొన్ని మాత్రం కఠిన అండర్ రైటింగ్ నిబంధనలకు లోబడి కవరేజీని ఇస్తున్నాయి. తరచూ ప్రయాణాలు చేసే వారికి కూడా ఎన్నో రకాల రిస్క్‌లు ఎదురవుతుంటాయి. వీరు సులభంగానే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవచ్చు. ఇతర వృత్తులతో పోలిస్తే ఇలా తరచూ ప్రయాణించే వారికి ఆరోగ్య సమస్యల రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఈ తరహా వ్యక్తులు క్యాష్‌లెస్ కవరేజీ నెట్‌వర్క్‌లో ఎక్కువ ఆస్పత్రులు ఉండే బీమా సంస్థ నుంచి ప్లాన్ తీసుకోవడం మంచిది. ప్రయాణ సమయంలో ఎక్కడ ఇబ్బంది వచ్చినా సమీపంలోని నెట్వర్క్ హాస్పిటల్‌కు వెళ్లి నగదు రహిత వైద్యాన్ని పొందడానికి వీలుంటుంది. క్యాష్‌లెస్ హాస్పిటల్స్ ఎక్కువగా ఉన్న బీమా సంస్థల ప్లాన్లలోని సదుపాయాలను విశ్లేషించిన తర్వాత ఒకదానిని ఎంపిక చేసుకోవాలి. సొంత ప్రాంతంలో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చినప్పుడు నగదు రహిత చికిత్సల ఆస్పత్రి కాకపోయినా.. ఎవరో ఒకరి నుంచి బదులు తీసుకుని చికిత్స తీసుకోవచ్చు.
కానీ, ప్రయాణాల సమయంలో సమస్య వస్తే అప్పుడు ఆదుకునేది నగదు రహిత వైద్యమే అని గుర్తు పెట్టుకోవాలి. అంతర్జాతీయ ప్రయాణాలు చేసే వారు ఈ విషయంలో మరింత శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది. విదేశాల్లోనూ కవరేజీ లభించే విధంగా చూసుకోవాలి. ఇందుకోసం ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను కూడా తీసుకోవాల్సి రావచ్చు. దీనికంటే కూడా ప్రయాణాలు చేసే వృత్తుల్లోని వారు డొమెస్టిక్ హెల్త్ప్లాన్లోనే విదేశీ వైద్యానికి కూడా కవరేజీ ఉండే ఆప్షన్‌తో తీసుకోవడం మంచిది. మణిపాల్ సిగ్నా లైఫ్ టైమ్ హెల్త్‌ప్లాన్ 27 రకాల క్రిటికల్ ఇల్నెస్లకు విదేశాల్లో కవరేజీని ఆఫర్ చేస్తోంది. అలాగే, ఆదిత్య బిర్లా యాక్టివ్ హెల్త్‌ప్లాన్ 16 రకాల తీవ్ర ఆరోగ్య సమస్యలకు విదేశాల్లో క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ను అందిస్తోంది. ఈ తరహా వ్యక్తులు అధిక కవరేజీ (రూ.కోటి వరకు) తీసుకోవడం అత్యవసర పరిస్థితుల్లో అర్థవంతంగా ఉంటుంది.
కూర్చుని చేసే ఉద్యోగాలు
కదలికలు తక్కువగా ఉండి, సిస్టమ్ ముందు గంటలపాటు కూర్చుని పనిచేసే వారికి దీర్ఘకాలంలో వ్యాధుల రిస్క్ ఎక్కువ. వీరికి జాయింట్స్, స్పైన్ సమస్యలు, మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బుల రిస్క్ ఎక్కువగా ఉంటున్నట్టు పలు అధ్యయనాలు తేల్చాయి. కనుక వ్యక్తిగత ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తూనే.. మరోవైపు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీకి కూడా ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. అందులోనూ సమగ్ర కవరేజీ ఉండేలా చూసుకోవాలి.
పెళ్లయిన మహిళలు
వివాహ బంధంలోకి అడుగుపెట్టి పిల్లల కోసం ప్లాన్ చేసుకునే మహిళలు బీమా కవరేజీ పట్ల ముందుగా దృష్టి సారించాలి. దాదాపు అన్ని బీమా సంస్థలు మెటర్నిటీ కవరేజీ కోసం వెయిటింగ్ పీరియడ్ అమలు చేస్తున్నాయి. కేవలం కొన్ని ప్లాన్లు వెయిటింగ్ పీరియడ్ లేకుండా పరిమితంగా మెటర్నిటీ కవరేజీ ఇస్తున్నాయి. ఉద్యోగం చేస్తుంటే సంస్థ నుంచి గ్రూపు హెల్త్ ప్లాన్ తీసుకోవడం మంచిది. ఎందుకంటే గ్రూపు హెల్త్ ప్లాన్లలో మొదటి రోజు నుంచే కవరేజీ లభిస్తుంది. స్టార్హెల్త్ యంగ్ స్టార్ గోల్డ్ ప్లాన్, టాటా ఏఐజీ మెడికేర్ ప్రీమియర్ ప్లాన్, ఫ్యూచర్ జనరాలి ప్రోహెల్త్ ప్లస్ మెటర్నిటీ కవరేజీని రూ.30,000–50,000 మధ్య ఆఫర్ చేస్తున్నాయి. వీటిల్లో వెయిటింగ్ పీరియడ్ ఉంది. పుట్టే బేబీలకు మొదటి రోజు నుంచి కవరేజీ ఆప్షన్‌తో ఉన్న ప్లాన్ మెరుగైనది అవుతుంది.
బజాజ్ అలియంజ్ హెల్త్ సుప్రీమ్ ప్లాన్‌లో.. ఆస్పత్రిలో చేరడానికి ముందు, ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత అయ్యే వ్యయాలకూ చెల్లింపులు చేస్తుంది. బేబీకి 90 రోజుల వరకు ఇచ్చే టీకాలకూ క్లెయిమ్ లభిస్తుంది. ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలు అన్నీ కూడా కొత్తగా వచ్చే పిల్లలకూ కవరేజీని ఇచ్చే ఆప్షన్‌తోనే ఉంటాయి. గ్రూపు హెల్త్ ప్లాన్లలో వెయిటింగ్ పీరియడ్ ఉండదు. అందుకని పనిచేసే చోట గ్రూపు హెల్త్‌ప్లాన్ తీసుకుని, విడిగా ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ ఎంపిక చేసుకోవాలి. వ్యక్తులు వారి కుటుంబ ఆరోగ్య చరిత్ర, జీవనశైలి, వయసు ఇలాంటి అంశాలన్నీ పరిశీలించుకుని, ఆయా సమస్యలకు కవరేజీనిచ్చే, సమగ్ర ఆరోగ్య ప్లాన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి.
కారణం ఏదైనా కానీ, పాలసీ తీసుకునే నాటికి ఏవైనా వ్యాధులు ఉంటే వాటి కోసం వేచి చూడక తప్పదు. అటువంటి సందర్భంలో అప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యలకు సైతం కవరేజీ కోరుకునేట్టు అయితే.. కొన్ని సంస్థలు అధిక ప్రీమియంతో వెంటనే కవరేజీనిస్తున్నాయి. కొన్ని బీమా కంపెనీలు తక్కువ వెయిటింగ్ పీరియడ్‌తో పాలసీలను ఆఫర్ చేస్తున్నాయి. కాకపోతే వీటి ప్రీమియం ధరలు అధికంగా ఉంటాయని మర్చిపోవద్దు. ఎందుకంటే అండర్‌రైటింగ్ (వాటి రిస్క్‌ను సర్దుబాటు చేసుకోవడం) నిబంధనలను కఠినంగా అమలు చేయాల్సి వస్తుంది.
గుండె జబ్బులు, కేన్సర్ తదితర తీవ్ర అనారోగ్య సమస్యలకు కవరేజీనిచ్చే క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్లు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి మొదటి 30 రోజుల వెయిటింగ్ పీరియడ్‌తో కవరేజీని ఆఫర్ చేస్తున్నాయి. కానీ, రెగ్యులర్ ప్లాన్‌లో వేచి ఉండే కవరేజీతో పోలిస్తే ఇలా తీసుకునే వాటి ప్రీమియం చాలా ఎక్కువ. పైగా తీసుకునే బీమా కవరేజీ కూడా ఇక్కడ కీలకమవుతుంది. కుటుంబంలో తీవ్ర ఆరోగ్య సమస్యల చరిత్ర ఉన్నా.. తీసుకునే నాటికి ఆరోగ్య సమస్యలు పలకరించినా.. రూ.5 లక్షల కవరేజీ ఏ మూలకు సరిపోకపోవచ్చు. ము ఖ్యంగా కేన్సర్ చికిత్సకు రూ.5 లక్షల కవరేజీ చాలదు. క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్లలో బెనిఫిట్ ఆప్షన్‌తో ఉన్న వాటికి ఎంపిక చేసుకుంటే జాబితాలోని వ్యాధి నిర్ధారణ అయిన వెంటనే ఆ మేరకు మొత్తం చెల్లించేస్తాయి.