ఉత్తమ విద్యకు ప్రణాళిక
కరప, న్యూస్‌లైన్ : జిల్లాలో ఈ ఏడాది కూడా ఉత్తమ విద్యా ప్రమాణాలు నెలకొల్పేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్టు డీఈఓ కేవీ శ్రీనివాసులురెడ్డి తెలిపారు. శనివారం ఆయన కరపలో పర్యటించి, స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పాఠ ్య పుస్తకాల కొరత లేదని, ఒకటి నుంచి పదో తరగతి వరకు 30 లక్షల పాఠ్య పుస్తకాలు అవసరమని, అన్నింటినీ ఆయా పాఠశాలలకు చేరవేసినట్టు చెప్పారు. ఏడు నుంచి పదో తరగతి వరకు ఏప్రిల్ 27 కల్లా అందజేశామన్నారు. మిగిలిన తరగతులకు పాఠశాలలు తెరిచిన వెంటనే పంపిణీ చేస్తామని వివరించారు.
జిల్లావ్యాప్తంగా సుమారు వెయ్యి ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలుండగా, వాటిని భర్తీ చేసేందుకు డీఎస్సీకి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. విద్యార్థులకు ఉచిత యూనిఫారం కోసం పాఠశాలలు తెరచిన మూడు రోజుల్లో హెచ్ఎంలు ఇచ్చిన నివేదికలను ఆప్కోకు పంపుతామన్నారు. ఈ ఏడాది 9, 10 తరగతులకు మారిన సిలబస్, పరీక్షా విధానాలకు అనుగుణంగా విద్యాబోధన చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రతి సబ్జెక్టుకు 100 మార్కుల్లో 80 మార్కులు పరీక్ష విధానం, 20 మార్కులు ఇంటర్నల్స్ ఉంటాయన్నారు. పరీక్షా విధానంలో 28, ఇంటర్నల్స్‌కు ఏడు మార్కు పాస్ మార్కులుగా నిర్ణయించార ని, ఈ ఏడాది నుంచి హిందీకి 35 పాస్ మార్కులు రావాలన్నారు.
ఈ నెల 20 నుంచి 25 వరకు మారిన సిలబస్, పరీక్షా విధానంపై ఉపాధ్యాయులకు ఒకరోజు పునశ్చరణ తరగతుల నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకు 120 మంది రీసోర్స్‌పర్సన్లను ఎంపిక చేసి, శిక్షణ ఇచ్చామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని హైస్కూల్ విద్యార్థినుల్లో ఆత్మస్థైర్యం నెలకొల్పేందుకు కరాటే, యోగాలో శిక్షణ ఇవ్వనున్నట్టు ఎంఈఓ తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో 80 హైస్కూళ్లను ఎంపిక చేశామన్నారు. ఆయన వెంట ఎంపీడీఓ అన్నెపు ఆంజనేయులు, ఎంఈఓ ఎంవీవీ సుబ్బారావు ఉన్నారు.