ఆసియా స్నూకర్ చాంప్ భారత్
బిష్కెక్ (కిర్గిస్తాన్): స్టార్ ప్లేయర్ పంకజ్ అద్వానీ అద్భుత ప్రదర్శనతో భారత్ ‘ఎ’ జట్టు ఆసియా స్నూకర్ టీమ్ చాంపియన్షిప్లో విజేతగా నిలిచింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ‘బి’తో బుధవారం జరిగిన ఫైనల్లో భారత్ ‘ఎ’ జట్టు 3–0తో విజయం సాధించింది. ఈ టోర్నీలో పంకజ్ అద్వానీ అజేయంగా నిలవడం విశేషం. ‘బెస్ట్ ఆఫ్ ఫైవ్’ పద్ధతిలో జరిగిన ఫైనల్లో భారత్ మూడు మ్యాచ్లు గెలిచి విజయాన్ని ఖాయం చేసుకోవడంతో మిగతా రెండు మ్యాచ్లను నిర్వహించలేదు. తొలి మ్యాచ్లో పంకజ్ 87–5తో మొహమ్మద్ బిలాల్పై గెలుపొందగా... రెండో మ్యాచ్లో లక్ష్మణ్ రావత్ 133–0తో బాబర్ మాసిని ఓడించాడు. మూడో మ్యాచ్లో పంకజ్–లక్ష్మణ్ రావత్ ద్వయం 70–55తో బిలాల్–బాబర్ మాసి జోడీపై గెలిచింది. పంకజ్ అద్వానీ, లక్ష్మణ్ రావత్, మల్కీత్ సింగ్లతో కూడిన భారత బృందానికి అశోక్ శాండిల్య కోచ్గా వ్యవహరించారు.