వాళ్లు నాతోనే ఉంటారు!
అభిమాన తారలతో కలిసి ఫొటోగ్రాఫ్ దిగాలని, ఆటోగ్రాఫ్ తీసుకోవాలని వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే వాళ్లతో కలిసి లంచ్ చేయాలని అభిమానులు ఉవ్విళ్లూరుతుంటారు. ఫొటోగ్రాఫులూ, ఆటోగ్రాఫుల వరకూ ఓకే కానీ లంచ్‌లు, డిన్నర్లు అంటే కష్టమే. కానీ, సమంత అభిమానుల్లో ఓ పాతిక మందికి రెగ్యులర్‌గా ఆ అవకాశం దక్కుతోంది. ఆ విషయం గురించి సమంత చెబుతూ - ‘‘నాకు బాగా దగ్గరైన 25, 30 మంది అభిమానులు ఉన్నారు. వాళ్లు తెలుగు పరిశ్రమకు చెందినవాళ్లు.
నా ఎదుగుదల, నా అపజయాల్లో నా వెన్నంటే ఉన్నారు. ‘ఇక చాలు.. సినిమాలు మానేద్దాం’ అనుకున్నప్పుడు కూడా వాళ్లు నాతోనే ఉన్నారు. ఎప్పటికీ నాతోనే ఉంటారు. నా ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా వాళ్లు నాకు దగ్గరయ్యారు. నా సినిమాలకు సంబంధించి వాళ్లిచ్చే ఫీడ్‌బ్యాక్ నాకు చాలా ముఖ్యం. వాళ్లు ఇచ్చే సపోర్ట్‌ని మాటల్లో చెప్పలేను. నాకు తెలిసి ఏ హీరోయిన్‌కీ ఇంత స్ట్రాంగ్‌గా సపోర్ట్ చేసే అభిమానులు ఉండరేమో. నేను రెగ్యులర్‌గా ఆ అభిమానులను కలుస్తుంటాను. కలిసి లంచ్ చేస్తాం. బర్త్‌డేలు సెలబ్రేట్ చేసుకుంటాం. ఇలాంటి అభిమానులు నాకు దక్కడం నా అదృష్టం’’ అన్నారు.