ఉత్తమ నిర్మాతకు బి.నాగిరెడ్డి పురస్కారం
దక్షిణాది సినిమాపై ‘విజయా’ నాగిరెడ్డి సంతకం ఎప్పటికీ చెరిగిపోనిది. జానపదం, సాంఘికం, పౌరాణికం, ఇలా ఏ తరహా సినిమా చేసినా ప్రేక్షకుల్ని వినోదపరచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయన స్మారకంగా ప్రతి ఏటా ఉత్తమ వినోదాత్మక కుటుంబ కథా చిత్రానికి బి.నాగిరెడ్డి పురస్కారం అందజేస్తున్నారు ఆయన తనయుడు బి.వెంకట్రామిరెడ్డి. 2013కు సంబంధించి ఈ నెల 20న హైదరాబాద్లో పురస్కారం ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ -‘‘ఇంటిల్లిపాదికీ స్వచ్ఛమైన వినోదాన్ని అందించడమే లక్ష్యంగా నెలకొన్న సంస్థ ‘విజయా ప్రొడక్షన్స్’. ఇన్నేళ్లయినా ప్రజల గుండెల్లో విజయా సంస్థ నిలిచిపోయిందంటే కారణం అదే. ఎన్నో కళాఖండాలను ఆ సంస్థ ద్వారా ప్రేక్షకులకు అందించిన ఘనత నాగిరెడ్డి-చక్రపాణిలది. మంచి చిత్రాలను నిర్మిస్తున్న నిర్మాతల్ని పోత్సహించాలనే సత్సంకల్పంతో ఈ అవార్డును స్థాపించాం. పురస్కారం కింద జ్ఞాపికతో పాటు లక్షన్నర రూపాయల నగదు అందిస్తాం. ఈ నెల 15 లోపు నిర్మాతలు తమ నామినేషన్ను పంపించాలి’’ అని తెలిపారు.