పోటాపోటీగా పరభాషలో ప్రచారం
వాళ్లని 'భాషాదురాభిమానులు' అని కొందరు వెక్కిరిస్తారు. కానీ వాళ్లు మాత్రం తమని తాము భాషాభిమానులుగా చెప్పుకుంటారు. అవును. మనం మాట్లాడుకునేది తమిళుల గురించే. వారు మాతృభాషను అమ్మకన్నా ఎక్కువగా ఆరాధిస్తారని, దాన్ని కాపాడుకునేందుకు ఎంతకైనా తెగిస్తారని తెలిసిందే. ఆఖరికి సినిమాలకు కూడా పరాయి భాషల పేర్లు పెట్టరు. అలాంటి తమిళనాడులో ఇప్పుడు పరభాషా ప్రచారం పోటాపోటీగా సాగుతోంది. హిందీని ఈసడించుకునే ముఖ్యపార్టీలన్నీ (ఆయా పార్టీల నేతలు గతంలో చేసిన వ్యాఖ్యల ఆధారంగా) జాతీయ భాషలో ఓట్లు అడుక్కుంటున్నాయి.
చెన్నై శివారులోని ఎగ్మూర్ స్థానం నుంచి డీఎంకే తరఫున పోటీచేస్తోన్న అభ్యర్థి కేఎస్ రవిచంద్రన్ అయితే మరో అడుగు ముందుకువేసి హిందీలో ఎస్ఎంఎస్ లు పంపుతున్నారు. ఈపాటికే మీకు అర్థమై ఉంటుంది.. ఆ నియోజకవర్గంలో హిందీ మాట్లాడే ఉత్తర భారతీయుల ఓట్లే కీలకమని. తరాల కిందటే ఉత్తరం నుంచి వచ్చి ఎగ్మూర్ లో స్థిరపడ్డ మార్వాడీలు, ఇతరులను ప్రసన్నం చేసుకునేందుకు అన్నిపార్టీలు ఓటర్ల భాషలోనే ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఎగ్మూర్ లో హిందీలో సాగుతున్నట్లే ఆవడి నియోజకవర్గంలో అభ్యర్థులందరూ తెలుగులో ప్రచారం చేస్తున్నారు. తెలుగువారు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఆవడి కూడా ఒకటి.
హోసూర్, గుమ్మిడిపూండి, తిరుత్తణిల్లోనూ తెలుగు ఓటర్లు అభ్యర్థి జయాపజయాలను నిర్దేశించే స్థాయిలో ఉండటంతో ప్రచారమంతా తేట 'తెనుంగు'లో జరుగుతోంది. ఇక ఈరోడ్, ధర్మపురి, కృష్ణగిరి నియోజకవర్గాల్లో తెలుగుతోపాటు కన్నడ పలుకులూ హోరెత్తుతున్నాయి. అన్నింటికీ భిన్నంగా అటు కన్యాకుమారి, కోయంబత్తూరు జిల్లాలో అయితే మలయాళ మంత్రాలు జపిస్తున్నారు తమిళ రాజకీయ నేతలు. కారణం ఆ జిల్లాల్లో కేరళ నుంచి వచ్చి స్థిరపడ్డ మలయాళీలు ఎక్కువగా ఉండటమే. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరన్నట్లు.. ఎన్నికల సమయంలో అన్ని భాషలను గౌరవిస్తున్న తమిళులను తెలివైనవారు కాదనగలమా!