ముఖ్యమంత్రిగా మా అబ్బాయే ఉత్తమం
లక్నో: ఉత్తరప్రదేశ్లో చాలా ఏళ్ల తర్వాత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించడంతో ముఖ్యమంత్రి పీఠంపై ఆ పార్టీ నాయకులు కన్నేశారు. యూపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపంలో లేకపోయినా ఆశావహ అభ్యర్థుల పేర్లు తెరపైకి వస్తున్నాయి.
కేంద్ర మంత్రి మేనకా గాంధీ తన కుమారుడు, ఎంపీ వరుణ్ గాంధీ పేరును స్వయంగా ప్రస్తావించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా వరుణ్ అత్యుత్తమ వ్యక్తి అవుతారని మేనక అన్నారు. ఉత్తరప్రదేశ్ లో సోమవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న మేనక అఖిలేష్ యాదవ్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
మేనక్, వరుణ్ ఇద్దరూ యూపీ నుంచే లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం యూపీలో సమాజ్ వాదీ పార్టీ అధికారంలో ఉంది. కాగా అత్యాచారాలు, నేరాలను అరికట్టడంలో విఫలమైన అఖిలేష్ యాదవ్ ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ అద్భుత ఫలితాలు సాధించడంతో ఆ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ప్రత్యేక దృష్టిసారిస్తోంది. మేనక ఆశలు నెరవేరాలంటే ముందుగా ప్రధాని నరేంద్ర మోడీ ఆశీస్సులు పొందాలి.